visa-and-immigration/us-has-just-over-580000-h-1b-visa-holders-says-uscis

అమెరికాలో నిరుద్యోగం కట్టలు తెంచుకుంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‍ హెచ్‍ 1బీ తదితర వీసాలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో యునైటెడ్‍ స్టేట్స్ సిటిజన్‍షిప్‍ అండ్‍ ఇమిగ్రేషన్‍ సర్వీసెస్‍ (యూఎస్‍సీఐఎస్‍) మొట్టమొదటిసారిగా హెచ్‍ 1బీ వీసాలపై పనిచేస్తున్న వారి వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం 2019 సెప్టెంబరు నాటికి హెచ్‍ 1బీ వీసా కింద 5,83,420 మంది పని అనుమతి పొందారు. అయితే 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 96,798 మంది హెచ్‍ 1బీ వీసాదారులను శాశ్వత నివాస హోదా సర్దుబాటు చేసినట్టు యూఎస్‍సీఐఎస్‍ నివేదిక అంచనా వేస్తోంది.

2020 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో (అక్టోబరు- మార్చి) పనిచేయడానికి అనుమతిచ్చిన వారి సంఖ్య ఇంతకన్నా పది శాతం ఎక్కువ ఉండవచ్చని అంచనా. కరోనాతో అమెరికాలో నిరుద్యోగం భారీగా పెరిగింది. దీంతో హెచ్‍ 1బీ తదితర వీసాలను రద్దు చేశారు. ఇటీవల కాలంలో అమెరికా జారీ చేసిన హెచ్‍ 1బీ వీసాల్లో భారతీయులే 70 శాతం వరకు పొందారు. కీలకమైన పారిశ్రామిక రంగాల్లో 2 కోట్ల మంది అమెరికా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయినట్టు అధ్యక్షుడి ప్రకటన ద్వారా తెలుస్తోంది.