telangana-cm-launches-year-long-birth-centenary-celebrations-to-highlight-360-degree-personality-of-narsimha-rao

పివీ మన తెలంగాణ ఠీవి...కేసీఆర్‍

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను, ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. వివిధ దేశాల్లో కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లను చేశారు. హైదరాబాద్‍ నెక్లెస్‍రోడ్‍లోని పీవీ జ్ఞానభూమిలో జూన్‍ 28వ తేదీన పీవీ శతజయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‍రావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని పి.వి. నరసింహరావుది 360 డిగ్రీల వ్యక్తిత్వమని పేర్కొన్నారు. పీవీ మన తెలంగాణ ఠీవి అని,అంటూ, ఆయనో నిరంతర సంస్కరణశీలి అని కొనియాడారు. నమ్మిన వాదానికి కట్టుబడి.. తన వ్యక్తిత్వాన్ని, విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ఎదిగిన ధీశాలి అని ప్రశంసించారు. 

కొవిడ్‍ నిబంధనల ప్రకారం జరిగిన సభలో మాట్లాడుతూ.. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‍ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో, రాష్ట్ర క్యాబినెట్‍లో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధాని వద్దకు వెళ్లి కోరుతానని తెలిపారు. పార్లమెంట్‍లో పీవీ చిత్రపటం పెట్టాలని కూడా కోరనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పీవీతో అనుబంధం ఉన్న ఐదు ప్రదేశాల్లో ఆయన కాంస్య విగ్రహాలు ఆవిష్కరిస్తామని, శాసనసభలో కూడా పీవీ భారీ చిత్రపటాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్‍ను కోరారు. పీవీ ఏ పదవిలో, ఏ స్థాయిలో ఉన్నా సంస్కరణలే లక్ష్యంగా పనిచేసే వారని అన్నారు. రాష్ట్రంలో సీఎం హోదాలో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి.. ముందు తన భూమినే పేదలకు పంచిన నిజాయితీపరుడని తెలిపారు. అందుకే పీవీ మన తెలంగాణ ఠీవీ అని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డకు ఒక ప్రధానిగా దక్కాల్సిన గౌరవం దక్కలేదని, అందుకే ఆ గౌరవం కల్పించేలా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పీవీ నరసింహారావు గురించి ఇదీ అదీ అని చెప్పడానికి సాహసం కావాలి. పీవీ గురించి ఒక్క మాటలో చెప్పాలటే 360 డిగ్రీల పర్సనాలిటీ ఆయనది. అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆయన వ్యక్తిత్వ పటిమ.. ఆయనకు ఆయనే సృష్టించుకున్న గరిమ. ఆయన గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ప్రస్తుతం పీవీ శతజయంతి ఉత్సవాలు చేయడం, ఇంత ప్రాధాన్యం అవసరమా? అనే సందేహాలు వచ్చాయి. ఉత్సవాలు అవసరమే. నిన్నటి గతమే నేటి చరిత్ర. ఒక గొప్ప తెలంగాణ బిడ్డ.. ప్రపంచానికే సేవ చేసిన వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. ఆయన గురించి ప్రపంచానికి తెలియజేయాలి. అందుకే ఈ ఉత్సవాలు. ఈ రోజు నాకు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నది.పీవీ ఇంగ్లిషులో కొత్త సామెత తీసుకొచ్చారు. తూర్పుదిక్కున ఉన్న దేశాలను పట్టించుకోని ప్రపంచానికి ‘లుక్‍ టూ ఈస్ట్’ అని పిలుపునిచ్చారు. మాకు సంస్కారం, చరిత్ర, సంస్క•తి, గొప్ప వైవిధ్యం ఉన్నాయి.. అని చాటిచెప్పారు. పాశ్చాత్య ప్రపంచమంతా తూర్పు వైపు చూసేలా చేశారు. ఇంకొకరికైతే సాధ్యమయ్యేది కాదు. నిశ్చల, గంభీరమైన వ్యక్తి పీవీ. నమ్మినదాన్ని చేసుకుంటూ ముందుకు పోయేవారు. పీవీ ప్రధాని అయ్యేనాటికి దేశ గమ్యం అంధకారమై ఉంది. మన బంగారాన్ని ఇతర దేశాల బ్యాంకుల్లో పెట్టి పరువు నిలబెట్టుకుంటున్న క్లిష్ట సమయంలో ప్రధాని పదవి చేపట్టారు. ఆయనేమీ ముఠాలు గట్టి ప్రధాని పదవి సాధించుకోలేదు. ఆయనను వరించి వచ్చిన అవకాశం అది. అప్పటివరకు రాజకీయాల్లో లేని ఆర్థికవేత్త మన్మోహన్‍సింగ్‍ను ఆర్థికమంత్రిని చేసి, ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. మనం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛ, పొందిన ఆర్థిక పరిణతికి ప్రధాన కారణభూతుడు పీవీ. దేశం ఆర్థిక కష్టాలు గట్టెక్కి ప్రపంచంతో పోటీపడేస్థాయికి ఎదిగిందంటే ఆయన చలవే. ప్రైవేటురంగం ప్రభుత్వరంగంతో, ప్రభుత్వరంగం ప్రైవేటుతో పోటీపడే ఆర్థిక సృజనకు ఆద్యుడు. ఆయన ఏదైనా ప్రతిపాదిస్తే సీఎంలు కూడా భయపడాల్సిన పరిస్థితి. 

పీవీ మన జాతిబిడ్డ, తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయన గురించి ప్రపంచానికి వందకు వంద శాతం ఢంకా బజాయించి చెప్పాలే. పీవీ శతజయంతి ఉత్సవాలు జ్ఞానభూమిలోనేకాదు.. 51 దేశాల్లో జరుగుతున్నాయి.  ఈ బాధ్యతలను మంత్రి కేటీఆర్‍ చక్కగా నిర్వహిస్తున్నారు. 33 జిల్లాల్లో హోర్డింగ్స్ పెట్టాలని చెప్పిన. కరీంనగర్‍, వరంగల్‍, వంగరలో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. గల్లీలో మీటింగ్‍ పెట్టుకొని చెప్పే వ్యక్తి కాదు పీవీ. తెలంగాణ బిడ్డలు దేశమంతా గర్జించాలి. ఇతర రాష్ట్రాల్లోనూ కలకత్తా, ముంబై, ఢిల్లీలో కూడా సన్‍ ఆఫ్‍ ది సాయిల్‍ ఆఫ్‍ ఇండియా అని హోర్డింగ్‍ పెట్టారు. బహుముఖ వ్యక్తిత్వం, ధీశాలి, ప్రజ్ఞాదురంధరుడు, భాషా కోవిదుడు, స్వాతంత్ర సమరయోధుడు, సంస్కరణశీలి ఆయనలోని అన్ని కోణాలు వెలుగులోకి రావాలి. ఇందుకు కేశవరావు సరైన వ్యక్తిగా భావించి ఈ బాధ్యతలను ఆయనకే అప్పగించినం. ఈ ఉత్సవాల నిర్వహణకు రూ. 10 కోట్లు విడుదల చేశాం.

పార్లమెంటులోనూ పీవీ చిత్రపటం

పార్లమెంటులో పీవీ చిత్రపటం ఉండాలి. కానీ వాళ్లు పెట్టలేదు. మాజీ ప్రధానులకు ఇచ్చిన గౌరవం మన పీవీకి ఇవ్వలేదు. దాన్ని ఇప్పుడు మనం చేద్దాం. దీనికోసం మనందరం పోరాడుదాం. పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టడంతోపాటు పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో, క్యాబినెట్‍లో తీర్మానం చేసి నేనే స్వయంగా పీవీ కుటుంబసభ్యులతో, మంత్రి వర్గ సభ్యులను తీసుకెళ్లి ప్రధానిని కోరుతా.  పీవీ అభిమానులను కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి చేయిస్తా. ఢిల్లీలో రిమెంబరింగ్‍ పీవీ పేరుతో జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తాం.

పీవీ మెమోరియల్‍, మ్యూజియం

పీవీ చేసిన సేవలకు గుర్తుగా జ్ఞానభూమిలో ఒక మెమోరియల్‍, మ్యూజియం ఏర్పాటు చేయాలి. రామేశ్వరం వెళ్లినపుపడు అబ్దుల్‍ కలాం మెమోరియల్‍ను చూశాను. దానికన్నా అద్భుతంగా పీవీ మెమోరియల్‍ను నిర్మించాలి.  కేకే నేతృత్వంలోని కమిటీ రామేశ్వరం సందర్శించి కలాం మెమోరియల్‍ను మించేలా తయా రు చేయించాలి. వచ్చే యేడాది జూన్‍ 28నాటికి మెమోరియల్‍ నిర్మాణం పూర్తికావాలి. 

పీవీ వ్యక్తిత్వ పటిమపై ప్రత్యేక పుస్తకాలు

అముద్రితంగా ఉన్న పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ముద్రి స్తాం. అన్ని వర్సిటీలకు ఈ రచనలను పంపిస్తాం. పీవీ వ్యక్తిత్వ పటిమపై అద్భుతమైన స్థాయిలో మూడు నాలుగు ఎడిషన్స్ తీసుకురావాలని కేకేను కోరుతున్నా. వాటిని ఇండియాలోని అన్ని యూనివర్సిటీలకు, అన్ని భాషల్లో పంపిస్తాం.  ‘హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్‍ ఇండివిజ్యువాలిటీ’ అనే దానికి పీవీ ఓ ప్రతీక. ఈ పుస్తకాలు విద్యార్థులకు ఉపయోగంగా ఉంటాయి.

పీవీ పేరుతో ఆయన నూతన ఆర్థిక విధానాలపై కాకతీయ యూనివర్సిటీలో రిసెర్చ్ సెంటర్‍ను పెడుతాం. తెలుగు అకాడమీకి పీవీ పేరు పెట్టాలనే సూచన వచ్చింది దాన్ని ప్రజలు కోరితే చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పీవీ పేరు పెడుతాం. పీవీ పేరును స్మరించుకునేలా కార్యక్రమాలుంటే భవిష్యత్‍ తరాలకు లాభం జరుగుతుంది. పీవీ పేరిట ఒక పోస్టల్‍ స్టాంప్‍ విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతా. హైదరాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీ పేరును పీవీ సెంట్రల్‍ యూనివర్సిటీగా మార్చాలని డిమాండ్‍చేయాలని కేకే సూచించారు. దీనికి సంబంధించి ఈ రోజే ప్రధానికి లేఖ రాస్తా.. దీనికోసం ఫైట్‍ చేస్తాం. ప్రస్తుత ప్రధాని, రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‍ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‍సింగ్‍ ఇలా అందరూ పాల్గొనేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‍ పేర్కొన్నారు.