KCR considering re imposing 15 days Lockdown in GHMC

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్‌ కేసులు ఆందోళ‌న‌క‌ర‌స్థాయిలో పెరుగుతున్న నేప‌ధ్యంలో 15 రోజుల పాటు మళ్ళీ లాక్ డౌన్ విధించాలని సీఎం కేసీఆర్ కు అధికారుల రిపోర్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో జంట‌న‌గ‌రాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించి, లాక్ డౌన్ విధించేందుకు విధివిధానాలు సిద్ధం చేయాలని ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి ప‌రిస్థితిని వివరించారు. ‘‘దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న‌ క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య తక్కువే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పాజిటివ్ గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది బెడ్లు సిద్ధం చేశాం. సీరియస్ పేషంట్లకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. పెద్ద‌గా వ్యాధి లక్షణాల్లేని వారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం’’ అని ఈటల రాజెందర్ వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని వెల్లడించారు.

తెలంగాణలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ గా తేలిన వారికి తగు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జిహెచ్ఎంసి పరిధిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలనేది వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ చెప్పారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్ర‌ధాన నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువున్న క్రమంలో కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలికతో పాటు వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలూ ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదారాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేబినెట్ ను సమావేశ పరచాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం.

అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ ను సమావేశ పరిచి, జిహెచ్ఎంసి పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని సిఎం కేసీఆర్ చెప్పారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.