https://ap govt all set to launch 1068 new 108 and 104 ambulances

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైద్యసేవలు మరింత విస్త్రుతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి ప్రారంభించిన ప్రతిష్టాత్మక అంబులెన్స్‌ సేవల్ని బలోపేతం చేయనున్నారు. అందులో ఈ భాగంగా ఆయన గత కొంత కాలంగా నత్తనడక నడుస్తున్న 108, 104 అంబులెన్స్‌ సేవలను మళ్లీ పట్టాల మీదకు ఎక్కించడంతో పాటు ఆ వ్యవస్థకు కొత్త రక్తం కూడా ఎక్కిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు.

వచ్చే నెల 8వ తేదీన మొత్తం 1068 అంబులెన్స్‌లను వైఎస్‌జగన్‌ ఒకేసారి ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ అంబులెన్స్‌లలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యాధునిక వైద్య సౌకర్యాలను అమర్చింది. వెంటిలేటర్‌ సౌకర్యం ఉండడంతో పాటు అత్యాధునిక వైద్య సహాయం అవసరమైన కోవిడ్‌ 19 రోగులకు ఈ వాహనాలు మరింత ఉపయుక్తంగా ఉంటాయని రాష్ట్ర వైద్య శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా 108 వాహనాలు ప్రమాదాలకు గురైనవారితో పాటు అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారిని తరలించే సేవలు మాత్రమే అందిస్తున్నాయి. కోవిడ్‌ విజృంభణ తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా దీనిలో ప్రాణరక్షణకు ఉపయోగించే వైద్య సౌకర్యాలు సైతం అమర్చారు. తద్వారా కోవిడ్‌ రోగులు ఆసుపత్రికి తరలిస్తున్నపుడు కూడా చికిత్స పొందే వీలుంటుంది.