
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్: 2.75/5
బ్యానర్లు : వయాకామ్ 18 స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి.
ఓ టి టి వేదిక: నెట్‌ఫ్లిక్స్ ఇండియా
నటీనటులు : సిద్ధు జొన్నగడ్డ, శ్రద్ధ, శ్రీనాధ్, షాలిని వడ్నికట్టి, సీరత్ కపూర్, వైవా హర్ష, ఝాన్సీ సంపత్‌రాజ్ తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకా
ఎడిటింగ్ : గ్యారీ
ఛాయాగ్రహణం: షానీల్ డియో, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
రచన: రవికాంత్ పేరేపు, సిద్దు జొన్నలగడ్డ
నిర్మాతలు : సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18, సంజయ్‌రెడ్డి
సమర్పణ: రానా దగ్గుబాటి
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
విడుద తేదీ: జూన్ 25, 2020
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో దగ్గుబాటి రానా సప్పోర్ట్ తో వచ్చిన కృష్ణ అండ్ హిస్ లీల సోషల్ మీడియాలో గుర్తించదగ్గ సందడే చేసింది. థియేటర్స్ బంద్ నేపథ్యంలో చిన్న సినిమాలు ఓ టి టి లో విడుదల అవుతుండగా.. నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయిపోయింది. నేటితరం ప్రేమ కథను, ప్రేమలో ఈతరం పోకడను సహజంగా చూపించిన తెలుగు సినిమాలు అంతగా మనకు రాలేదు. బాలీవుడ్లో ఇలాంటి మోడ్రన్ లవ్ స్టోరీస్ తరచుగా వస్తుంటాయి కానీ తెలుగు లో మొదటి సరిగా సరి కొత్త ప్రయోగం చేసిన ఈ సినిమా జూన్ 25న విడుదల అయ్యింది. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్, ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, కలిసి రచించిన ఈ ప్రేమ కథని నేటి యువతరాన్నీ ఆకట్టుకునేలా రూపొందించారు మరి ఈ ఓవర్ ది టాప్ మూవీ రివ్యూ ఏమిటో చూద్దాం.
కథ :
కథాపరంగా హీరో కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) కన్ఫ్యూజన్ కృష్ణుడు. ఇద్దరమ్మాయిను సిన్సియర్‌గా ప్రేమించేస్తాడు. ఇద్దరినీ హర్ట్ కాకుండా చూసుకుందామనుకుంటాడు. కానీ రిలేషన్షిప్స్లో జోడు గుర్రాల స్వారీ జరిగే పని కాదుగా? కృష్ణ , సత్య(శ్రద్ధ శ్రీనాథ్) ఇద్దరూ ప్రేమించుకొని విడిపోతారు. సత్యతో బ్రేక్ వలన అప్సెట్ లో ఉన్న కృష్ణ… రాధా(షాలిని) ప్రేమలో పడతాడు. ఉద్యోగం నిమిత్తం బెంగుళూరు వెళ్లిన కృష్ణకు తన మాజీ లవర్ సత్య కనిపిస్తుంది. సత్య మరలా కృష్ణకు దగ్గిర అవుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణ…సత్య మరియు రాధాలతో ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ కొనసాగిస్తూ ఉంటాడు. ఏక కాలంలో ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తున్న కృష్ణ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఎలా ముగిసింది అనేది మిగతా కథ.
నటి నటుల హావభావాలు :
ప్రేమ.. ప్రియురాళ్ల విషయంలో స్పష్టత లేని కన్ఫ్యూస్డ్ లవర్ గా యంగ్ హీరో సిద్దూ ఆకట్టుకున్నారు. అక్కడక్కడా ఖుషీలో పవన్‌కళ్యాణ్‌ని అనుకరిస్తున్నట్టు అనిపించినా కానీ ఓవరాల్‌గా సిద్ధు మెప్పిస్తాడు. రొమాన్స్ అండ్ ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యాడు. ఎప్పుడో మొదలైన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్ లుక్ ప్రెసెంట్ లుక్ కి భిన్నంగా ఉంది. హీరో సిద్ధూ ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరి మధ్య రొమాన్స్ అండ్ ఎమోషన్స్ సహజంగా సాగాయి. ఇక మరో యంగ్ హీరోయిన్ షాలిని అనుభవం లేకున్నా పాత్రకు న్యాయం చేసింది. నేటి అమ్మాయిల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఉండే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. డిఫరెంట్ మూడ్స్ తో సాగే ఆమె పాత్రకు ఆమె గుడ్ ఛాయిస్ అనిపించింది. ఇక కమెడియన్ హర్ష మంచి పాత్ర దక్కించుకోగా ఝాన్సీ, సంపత్ తమ పరిధిలో అలరించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
ఇక డైరెక్టర్ రవికాంత్ విషయానికి వస్తే ఎంచుకున్న సబ్జెక్టు పాతదే అయినా తన నెరేషన్ తో మెప్పించే ప్రయత్నంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఆయన రాసుకున్న సన్నివేశాలు.. డైలాగ్స్ మరియు కథనం సినిమాకు ఆకర్షణ జోడించింది. ఐతే క్లైమాక్స్ మరింత ఆసక్తి కరంగా మలచాల్సింది. అలాగే ఆశించిన స్థాయిలో ఎమోషన్స్ పలికించ లేకపోయారు. అత్యున్నత నిర్మాణ విలువలు కలిగిన ఈ చిత్రంలో కెమెరా వర్క్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అద్భుతం. పాటలతో పాటు.. నేపథ్య సంగీతం సినిమాకు మంచి ఫీల్ అందించింది. ఇక డైలాగ్స్ మరో ఆకట్టుకొనే అంశం.
విశ్లేషణ:
ఇలా హీరో ఇద్దరమ్మాయిను సిన్సియర్‌గా ప్రేమించి, ఇద్దరిలో ఎవరు కావాలనేది తేల్చుకోకపోవడం అనేది కొత్త కథేమీ కాదు. ఎన్నార్, శోభన్‌బాబు, జగపతిబాబు వంటి హీరోలతో ఇలాంటి కథలొచ్చాయి. ఒక విధంగా పవన్‌కళ్యాణ్ బద్రి స్టోరీలైన్ కూడా ఇదే. మరి ‘కృష్ణ అండ్ హిజ్ లీ’ ప్రత్యేకత ఏమిటి? అంటే అప్పటి మాదిరిగా క్లీన్ రొమాన్స్ కాకుండా... ఇప్పటి తరం వేగానికి తగ్గట్టు, ఈతరం ప్రేమను ప్రతిబింబించేట్టు చూసుకున్నారు. 'ఎలా వున్నావు ప్రియా ఇప్పుడేం చేస్తున్నావు ప్రియతమా' అంటూ డ్రమెటిక్ డైలాగ్స్ కాకుండా... ‘లోదుస్తు ఏ రంగువి వేసుకున్నావ్?’ లాంటి మాటు మాట్లాడుకునే లేటెస్ట్ ప్రేమజంటని చూపించారన్నమాట. ఇద్దరిని ప్రేమించే హీరో ఎక్కడా స్త్రీ లోలుడు అనిపించకుండా తన కన్ఫ్యూజన్ ఏమిటనేది క్లారిటీగానే చూపించారు. ప్రేమించిన ఇద్దరిని హర్ట్ చేయకూడదని తనకు తానే మరింత డీప్‌గా సమస్యలోకి జారిపోయి, తనతో పాటే వాళ్లిద్దరినీ కూడా ఎలా లోనికి లాగేస్తున్నాడనేది కన్ఫ్యూజన్ లేకుండా తెర మీదకు తేవడంలో దర్శకుడు, రచయితలు సక్సెస్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్ పార్ట్ బాగుండడంతో సినిమా అంతగా బోర్ కొట్టదు. కాకపోతే ఒకే పాయింట్ చుట్టూ కథ తిరుగుతూ వుండడం వలన అసంపూర్ణంగా వుంది అనిపిస్తుంది అవే సీన్స్ రిపీట్ అవుతోన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది.
తీర్పు:
నేటి యూత్ ప్రేమ, రిలేషన్స్ విషయంలో వారి ప్రవర్తన, ఆలోచనా విధానం వంటి విషయాలను ఈ మూవీలో దర్శకుడు ప్రస్తావించారు. హీరో హీరోయిన్స్ నటన, మ్యూజిక్ అండ్ రొమాన్స్ ఈ మూవీలో ఆకట్టుకొనే అంశాలు. రొటీన్ స్టోరీ కావడంతో పాటు, నెమ్మదిగా సాగే కథనం నిరాశపరిచే అంశాలు. అయిన్నప్పటికీ ఆసక్తికర సన్నివేశాలు, అలరించే సంభాషణలు మెప్పిస్తాయి. మొత్తంగా ఈ లాక్ డౌన్ లో కృష్ణ అండ్ హిజ్ లీల మంచి ఛాయిస్ గా చెప్పవచ్చు.