TANA Father s Day Celebrations in New Jersey

అంతర్జాతీయ కవితల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అంతర్జాతీయ పితృ దినోత్సవ వేడుకలను అంతర్జాలంలో ఘనంగా నిర్వహించింది. "ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న" అనే అంశంపై తానా నిర్వహించిన "ప్రపంచ స్థాయి కవితల పోటీల్లో " విజేతలైన వారికి బహుమతి ప్రదానం జరిగింది.

తానా అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి జయశేఖర్ మాట్లాడుతూ "నాన్న నారికేళం వంటి వాడని పైకి కఠినంగా కనపడినా లోపల అనురాగం, అభిమానం అనే తీయని కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఉంటాయని, అటువంటి నాన్న అనుభవాలను, అనుభూతులను అక్షరరూపంగా మలచడానికి, మనసులలో నాన్న జ్ఞాపకాలు నిక్షిప్తం చేయటానికి ప్రపంచ స్థాయి కవితల పోటీలు నిర్వహించామని, ఈ పోటీలో ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఒమన్, బెహరైన్, వంటి దేశాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్ర ల వంటి రాష్ట్రాల తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 750 మంది పాల్గొని అద్భుతమైన కవితలు రాశారు. అసాధారణమైన స్పందన లభించింది. మా దృష్టిలో నాన్న మీద రాయబడిన ప్రతీ కవితా ఉత్తమ కవితే కాబట్టి ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి కవీ ఉత్తమ కవే అని, బహుమతి పొందినట్లే అని మేము భావిస్తూ పాల్గొన్న ప్రతీ కవికీ ప్రశంసా పత్రాలను అందజేస్తున్నామని" అన్నారు.

ప్రథమ బహుమతి (రూ;10,116/) మౌనశ్రీ మల్లిక్; ద్వితీయ బహుమతి (రూ;7,116) జయశ్రీ మువ్వా; తృతీయ బహుమతి (రూ. 5, 116) ప్రొ; రామ చంద్రమౌళి గెలుచుకొన్నారని తానా పూర్వ అధ్యక్షులు డా. చౌదరి జంపాలగారు అధికారికంగా ప్రకటించారు.

ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర "తండ్రులందరకూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా భారత - చైనా సరిహద్దు సంఘర్షణలలో వీరమరణం పొందిన సాటి తెలుగు వాడు కల్నల్ సంతోష్ బాబు తో సహా అసువులు బాసిన వీర సైనికులందరకూ నివాళులర్పించి, "నాన్నా నీకు నమస్కారం" కార్యక్రమాన్ని ఆ సైనికుల త్యాగనిరతికి అంకితం చేస్తున్నామని" అన్నారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీ తనికెళ్ళ భరణిలను డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేశారు.

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.... "నాన్న త్యాగాలు మరువలేనివని నాన్న కంటే గొప్ప దైవం లేదని, నాన్న కేవలం పిల్లల్ని పెంచి ఇంటికే పరిమితమైన పాత్ర కాదని ఆయనది సామాజిక బాధ్యత అని, ఒక గొప్ప బిడ్డను తయారు చేయడం, తద్వారా గొప్ప సమాజాన్ని నిర్మించగలగటం ఘనమైన నాన్న వ్యక్తిత్వం తోనే ముడిపడి ఉంటుందని, కాబట్టి నాన్న ఉన్నతంగా, ఉత్తమంగా, నీతివంతంగా, ఆదర్శవంతంగా ఉండాలని తద్వారా ఉదాత్తమైన సమాజం ఏర్పడుతుందని" ఆయన అన్నారు. ప్రపంచ స్థాయిలో నాన్న కవితల పోటీలు నిర్వహించినందుకు తానాను ఆయన అభినందించారు. విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ తనికెళ్ళ భరణి మాట్లాడుతూ ..... "నాన్న అనే అంశం పై తానా వారు కవితల పోటీలు నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయమని, తెలుగు భాషకు, సాహిత్యానికి తానా చేస్తున్న సేవలు అభినందనీయమని" అన్నారు. భరణి తన నాన్నతో తమకున్న సంబంధాన్ని, తమ పెద్ద కుటుంబానికి ఏ లోటూ లేకుండా తండ్రి గా ఆయన పోషించిన పాత్ర ఎంతో స్ఫూర్తి దాయకం అన్నారు.

ఈ తానా ప్రపంచ కవితా పోటీల సమన్వయ కర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ .. 23 మంది కి "నాన్న నీకు నమస్కారం లైవ్ కవిసమ్మేళనం లో పాల్గొని కవితలు చదివే అవకాశం మరియు ప్రసంశాపత్రాలు పొందిన వారు - శ్రీ రాపోలు సీతా రామరాజు (సౌత్ ఆఫ్రికా), శ్రీ అల్లాల రత్నాకర్ (బెహరైన్), శ్రీమతి కొప్పుల దివ్య ప్రశాంత్ (ఆస్ట్రేలియా), శ్రీ పంతుల కృష్ణ సుమంత్ (ఒమన్), డాక్టర్ నక్త వెంకట మనోహర రాజు (అమెరికా), డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ( హైదరాబాద్), శ్రీమతి సీ. యమున (హైదరాబాద్), శ్రీ సిరాశ్రీ (హైదరాబాద్), శ్రీమతి మధురాంతకం మంజుల (తమిళనాడు), శ్రీమతి పుష్పలత ( బెంగళూరు), శ్రీ సిద్దాంతపు ప్రభాకరాచార్యులు (అశ్వారావుపేట), డాక్టర్ అడిగొప్పుల శేషు (భద్రాద్రి), శ్రీ చలపాక ప్రకాష్ (విజయవాడ), శ్రీమతి రమాదేవి కులకర్ణి ( హైదరాబాద్), డాక్టర్. మురహర రావు ఉమా గాంధీ (విశాఖపట్నం), శ్రీమతి చంద్రకళ యలవర్తి (అమెరికా), శ్రీ పుప్పాల కృష్ణ చంద్ర మౌళి ఒరిస్సా), డాక్టర్ ఎమ్. సి.దాస్.( విజయవాడ), శ్రీ బండారి రాజ్ కుమార్ (వరంగల్), శ్రీ గూటం స్వామి (రాజమండ్రి), శ్రీమతి గట్టు రాధికా మోహన్ (హనుమకొండ), శ్రీ బొడ్డ కుర్మా రావు ( విశాఖపట్నం) అని ప్రకటించారు.

మరో 41 మందికి విశిష్ట బహుమతులు + ప్రసంశాపత్రాలు లభించాయని , మరో 70 మందికి ప్రోత్సాహక ప్రసంశా పత్రాలు అందించడం జరిగిందని, అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రసంశాపత్రాలను అందజేసామని అన్నారు. విశిష్ట బహుమతులు వచ్చినవారిని కొంత మందిని ప్రత్యేక ప్రోత్సాహకాలు అనగా లైవ్ కార్యక్రమంలో కవిత చదివే అవకాశం కల్పించడం వలన, ఒక్కొక్కరికి రెండు బహుమతులు వచ్చినట్లు భ్రమ కలుగుతుందని అది నిజం కాదని. ఒక కవికి ఒక బహుమతి మాత్రమే అందజేస్తున్నట్లు శ్రీనివాస్ తెలియజేశారు.

తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నిరంజన్ శృంగవరపు వందన సమర్పణ చేస్తూ "ఈ పోటీలకు డా. కె. గీత (అమెరికా), కిరణ్ ప్రభ (అమెరికా) న్యాయ నిర్ణేత లు గా వ్యవహరించారని , ఈ కార్యక్రమానికి పోషక దాత "వెన్నం ఫౌండేషన్" ఛైర్మన్ మురళీ వెన్నం, తానా న్యూజెర్సీ కో ఆర్డినేటర్ శ్రీ రాజా కసుకుర్తి, సాంకేతిక సహకారం అందించిన "బైట్ గ్రాఫ్ స్టుడియో" అధినేత ప్రశాంత్ కు, ప్రసారం చేసిన "మనటీవీ", "టీవీ 5 (ఇంటర్నేషనల్)" వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని ఫేస్ బుక్ లో, యు ట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది వీక్షించారని , ఇది తెలుగు కవులలో నూతనోత్సాహాన్ని నింపిందని, కొన్ని వందల మంది కవులకు ఏక కాలంలో ప్రపంచ సాహిత్య వేదికకు పరిచయం అయిన సంతృప్తి లభించిందని పలువురు కవులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.