NATS special event on Telugu Padya Sangeetha Vibhavari by Dr Gunmadi Gopala Krishna

పద్య గాన ప్రవాహంతో అలరించిన గుమ్మడి గోపాలకృష్ణ

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో అమెరికాలో తెలుగు ప్రజలకు సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఆన్‌లైన్‌లో పద్య సంగీత విభావరి నిర్వహించింది. ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ చే నాట్స్ ఈ సంగీత విభావరిని నిర్వహించింది. తెలుగువారికే సొంతమైన పద్యాన్ని..ఆ పద్య మాధుర్యాన్ని గుర్తు చేసేలా గుమ్మడి గోపాలకృష్ణ పద్య సంగీత విభావరి కొనసాగింది. నాట్స్ నాయకులు డాక్టర్ సూర్యం గంటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహారించారు. నాట్స్ మాజీ ఛైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి, నాట్స్ వైస్ ఛైర్మన్ అరుణ గంటి ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అమెరికాలో తెలుగువారు ఆన్‌లైన్ ద్వారా ఈ పద్య సంగీత విభావరిని వీక్షించారు. రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథుడు, అల్లసాని పెద్దన్న పద్యాలను రాగయుక్తంగా ఆలపించారు. హరిశ్చంద్ర, చింతామణి నాటక పద్యాలను కూడా ఎంతో శ్రావ్యంగా ఆలపించి తెలుగు భాషలోని మథురిమలు ఎంత గొప్పవనేది చాటారు. తెలుగు పద్యాలు పాడటం భావ వ్యక్తీకరణకు ఎంతో దోహదం చేస్తుందని రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పగలిగేందుకు కూడా పద్యగానం తోడ్పడుతుందన్నారు. ఏ దేశమేగినా మాతృభాషను మరిచిపోరాదని అన్నారు. తెలుగువారు ఎక్కడున్నా తమ భాషను విస్మరించరాదన్నారు.

తులభారం  నాటక పద్యాలను ప్రముఖ రంగస్థల నటీమణి రత్నశ్రీ ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ పద్య సంగీత విభావరి ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. అమెరికాలో ఉంటున్న తెలుగువారికి తమ అచ్చ తెలుగు పదాలు, పద్యాలు గుర్తు చేసుకునేలా చేసింది. శ్రీధర్ అప్పసాని మాట్లాడుతూ ఆన్ లైన్ లో విశేషం గా వస్తున్న వీక్షకుల కోరిక మేరకు త్వరలో పార్ట్ 2 కూడా చేయాలని గోపాల కృష్ణ గారిని జరిగింది. గోపాల కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభించి పేద కళాకారుల జీవన భృతి కి ఆటంకం గా మారటంతో వారిని ఆదుకోవలసిందిగా కోరారు. డా. మధు కొర్రపాటి మాట్లాడుతూ చిన్న పిల్లలతో, నూతన కళాకారులతో కూడా మున్ముందు మంచి కార్యక్రమం చేయాలని కోరారు.  నాట్స్ సహకారంతో పేద కళా కారుల భృతి కోసం గుమ్మడి గోపాల కృష్ణ ఫౌండేషన్ ద్వారా కూడా ఈ కళాభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందించటానికి నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని వివరించారు శ్రీధర్.  తెలుగు భాష వికాసం కోసం నాట్స్ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. 

Click here for Photogallery