
కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగకముందే యూఎస్ ఓపెన్‌లో ఆడలేమంటూ జొకోవిచ్, నడాల్లాంటి అగశ్రేణి క్రీడాకారులంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా, అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మాత్రం ఆ గ్రాండ్‌స్లామ్‌కు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో పాల్గొనేందుకు తాను సిద్ధమని తెలిపింది. ఈ మేరకు యూఎస్ టెన్నిస్ సంఘం టోర్నీ ప్రజెంటేషన్ కార్యక్రమం సందర్భంగా విడుదల చేసిన వీడియాలో తన నిర్ణయాన్ని సెరెనా ప్రకటించింది. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనా.. టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఈ వీడియోలో పేర్కొంది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నట్టు టోర్నీ నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే.