
తెలుగు టైమ్స్ ఇంటర్వ్యూలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
అటు ప్రభుత్వంలో...ఇటు పార్టీలో కీలకపాత్ర పోషిస్తూ, మరోవైపు జగన్కు సన్నిహితంగా మెలుగుతూ, అవసరమైన సలహాలను, సూచనలను అందజేస్తూ బిజీగా కనిపించే వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు.
జగన్ ఏడాది పాలనలో ముఖ్యమైన అంశాలేమిటి?
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నెంబర్వన్ రాష్ట్రంగా చేసేందుకు అనేక చర్యలు చేపట్టారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు. ఏడాదికాలంలో వ్యక్తిగత అవసరాలకోసం వారం పదిరోజుల తప్ప ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా పరిపాలనమీదే తదేక ద•ష్టి, ధ్యాసపెట్టారు. అందుకనే దేశంలో ఏ రాష్ట్రంచేయనన్ని కార్యక్రమాలు చేపట్టారు. తొలిఏడాదిలోనే మేనిఫెస్టో దాదాపుగా పూర్తిచేశారు. సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదలచే•శారు. వీటి అమలును పటిష్టంచేసుకుంటూ నీటిపారుదల పరంగా, పారిశ్రామికంగా, విద్యా వైద్యరంగాల్లో మౌలికసదుపాయాల కల్పనతో దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేస్తున్నారు.
వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తరువాత పాలన ఎలా ఉంటుందోనని సందేహంగా చూసినవాళ్ళు నేడు జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి తమ ఆలోచనను మార్చుకున్నారు. జగన్ పాలన తొలి ఏడాదిని సంక్షేమ నామ సంవత్సరంగా పేర్కొనవచ్చు.
పాలన ఎలా ఉండాలో వైయస్ జగన్ చేసి చూపించారు. మానవీయ కోణంలో పథకాలను సీఎం వైయస్ జగన్ ప్రవేశ పెట్టారు. ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు. విద్య వైద్య రంగానికి పెద్ద పీట వేశారు. కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా విద్య వైద్య రంగాన్ని సీఎం జగన్ తయారు చేస్తున్నారు. పేదపిల్లల కోసం ఇంగ్లీషు మీడియం విద్యను తీసుకొచ్చారు. పేదలకు ఇళ్ళు స్థలాలు ఇస్తున్నారు. టీడీపీ హయాంలో టీడీపీ వాళ్ళకే పథకాలు అందేవి. సీఎం జగన్ పాలనలో అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయి. పాలన ఎలా ఉండాలో జగన్మోహన్రెడ్డి చూపించారు.
సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలయ్యాయి?
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. రేషన్ బియ్యాన్ని ప్రతి గడపకు నేరుగా చేరవేస్తున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీన తెల్లవారుజామున ప్రతి అవ్వా,తాత ఇంటి దగ్గరకు వెళ్లి.. సూర్యోదయం కంటే ముందే ఇంటిదగ్గరకు వెళ్లి పెన్షన్ అందించేలాఏర్పాటు, అమ్మ ఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాలో నగదు జమ, ఇళ్ల పట్టాల పంపిణీ, వైయస్ఆర్ రైతు భరోసా, మత్స్యకార భరోసా పథకం, వైయస్ఆర్ వాహన మిత్ర పథకం, ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, వైయస్ఆర్ బీమా పథకం, వైయస్ఆర్ కంటి వెలుగు, వైయస్ఆర్ నవోదయంతో ఎంఎస్ఎంఈ యూనిట్లకు లోన్స్ రీస్ట్రక్చరింగ్, మన బడి నాడు-నేడు పథకం, వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైయస్ఆర్ లా నేస్తం, వైయస్ఆర్ నేతన్న నేస్తం, వైయస్ఆర్ కంటి వెలుగు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, వైయస్ఆర్ కాపు నేస్తం. వైయస్ఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం, వైయస్ఆర్ ఆసరా, జగనన్న తోడు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము.
జగన్ పాలనపై ఇతర రాష్ట్రాల మాటేమిటి?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. సీఎం వైయస్ జగన్ ఏపీలోని ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చిన ‘ఇంగ్లిష్ మీడియం’ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. అధికార వికేంద్రీకరణను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అనుసరించాలనుకుంటున్నారు. దిశ చట్టం గురించి తెలపమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరారు. దిశ చట్టాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకున్నారు. వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల ఏర్పాటు కోసం ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఆలోచిస్తున్నారు. ఇలా వివిధ రాష్ట్రాలవారికి కూడా వైఎస్ జగన్ పాలన ఆకట్టుకుంటోంది.
ఎన్నారైలను ఎలా ఆకట్టుకోనున్నారు?
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిపర్చాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఎన్నారైల నుంచి వివిధ రంగాల్లో చేయూతకోసం చర్యలను కూడా చేపట్టారు. నాడు-నేడు కార్యక్రమం, పారిశ్రామిక, ఇతర రంగాల్లో పెట్టుబడుల కల్పన వంటి విషయాల్లో ఎన్నారైలను ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎపిఎన్ఆర్టీ ద్వారా, అమెరికాలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ద్వారా ఎన్నారైలతో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించే ఏర్పాట్లు చేశారు. అలాగే వివిధ చోట్ల కూడా ప్రభుత్వ ప్రతినిధులను ఎన్నారైలతో సంప్రదించేలా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. కనెక్ట్ టు ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమాన్ని కూడా తీసుకువచ్చింది. ఇలా ఎన్నో కార్యక్రమాలతో విదేశాంధ్రులతో రాష్ట్ర ప్రభుత్వం కనెక్ట్ అవడంతోపాటు వారిని రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తోంది.