
భారత సంతతికి చెందిన ఆన్మాల్ నారంగ్ అరుదైన ఘనత సాధించింది. వెస్ట్పాయింట్లోని ప్రఖ్యాత అమెరికా మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి సిక్కు యువతిగా చరిత్ర సృష్టించింది. వెస్ట్పాయింట్లో నాలుగేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అన్మోల్ ఓక్లహామ్లోని లాటెన్ ఫోర్ట్ సిల్లో బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్సు అభ్యసించనుంది. ఈ శిక్షణ పూర్తైన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో జపాన్లోని ఒకినావాలో ఆమెకు తొలి పోస్టింగ్ లభించే అవకాశం ఉంది. ఈ విషయం గురించి సెకండ్ లెఫ్టినెంట్ అన్మాల్ నారంగ్ మీడియాతో మాట్లాడుతూ వెస్ట్పాయింట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్న నా కళ తీరింది. నాకు దక్కిన ఈ గౌరవం నన్నెంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. జార్జియాలోని సిక్కు కమ్యూనిటీ సభ్యులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా సిక్కు అమెరికన్లు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలరని నిరూపించారు. ఇష్టమైన కెరీర్ ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉంటే అసాధ్యం అనేది ఏదీ ఉండదు అని పేర్కొన్నారు.
జార్జియాలోని రోస్వెల్లో పుట్టిపెరిగిన అన్మోల్ తన తాతయ్య (భారత ఆర్మీలో పనిచేశారు) స్ఫూర్తితో మిలటరీలో సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. హవాయిలోని హోనలులులో ఉన్న పెరల్ హార్బర్ నేషనల్ మెమొరియల్ సందర్శించిన అనంతరం వెస్ట్పాయింట్లో చేరాలని సంకల్పించి తన ఆకాంక్ష నేటితో నేరవేర్చుకున్నారు.