
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16వ తేదీన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. వ్యవసాయం, ఉపాధి హామీ పనులు సహా ఇతర అంశాలపై వారితో చర్చించనున్నారు. ప్రగతి భవన్లో ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశానికి స్థానిక సంస్థల బాధ్యతలు చూస్తున్న అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, వ్యవసాయ శాఖ అధికారులు సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. ఉపాధి హామీ పధకం నిధులతో వీలైనన్ని ఎక్కువ శాఖల్లో ఎక్కువ పనులు చేయాలనే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సంబంధించిన అంశాలపై చర్చించి కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. నియంత్రిత సాగు, రైతు వేదికల నిర్మాణం, పల్లె, పట్టణ ప్రగతి, కరోనా, సీజనల్ వ్యాధుల నివారణ సహా ఇతర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.