అమెరికాలో భారత కాన్సుల్ జనరల్ గా తెలుగు అధికారి

TV Nagendra Prasad will be India s new consul general in San Francisco

విదేశాంగ శాఖలో పని చేస్తోన్న తెలుగు అధికారి అమెరికాలో భారత కాన్సుల్‍ జనరల్‍ అధికారిగా నియమితులయ్యారు. కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా గల్ఫ్ దేశాల బాధ్యతలు నిర్వహిస్తోన్న టి.వి.నాగేందప్రసాద్‍ శాన్‍ఫ్రాన్సిస్కోలో కాన్సుల్‍ జనరల్‍ ఆఫ్‍ ఇండియాగా నియమితులయ్యారు. ఈ నెలాఖరులో భారత కాన్సుల్‍ జనరల్‍గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని కొడకండ్ల, దేవరుప్ప లలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఈయన 1993లో ఇండియన్‍ ఫారిన్‍ సర్వీసులో చేరి అనేక దేశాల్లో సేవలందించారు. హైదరాబాద్‍లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, భారత వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎంఎస్సీ చేసిన ఈయన రెండింటిలోనూ బంగారు పతకాలు సాధించారు.

విదేశీ సర్వీసులో చేరిన అనంతరం టెహ్రాన్‍, లండన్‍, భూటాన్‍, స్విట్జర్లాండ్‍, తుర్క్మెనిస్థాన్‍ ఎంబసీల్లో డిప్యూటీ అంబాసిడర్‍గా, అంబాసిడర్‍గా పని చేశారు. నాగేందప్రసాద్‍ 2018 నుంచి విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శిగా గల్ఫ్ దేశాల బాధ్యతలు చూస్తున్నారు. ఈ దేశాల్లో భారత కార్మికులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించారు. కొవిడ్‍ నేపథ్యంలో కువైట్‍ తదితర దేశాల్లో ఇబ్బందులు పడిన వారిని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేశారు.

 


                    Advertise with us !!!