హీరో నుంచి లైట్ బాయ్ వ‌ర‌కు కాస్ట్ క‌టింగ్ త‌ప్ప‌దు

From the hero to the light boy, there is no cost cutting

లాక్‌డౌన్ కార‌ణంగా న‌ష్ట‌పోయిన ప‌రిశ్ర‌మ‌ల్లో సినిమా ప‌రిశ్ర‌మ ఒక‌టి. గ‌త మూడు నెల‌లుగా షూటింగులు లేక‌పోవ‌డంతో ఎక్క‌డి సినిమాలు అక్క‌డే ఉండిపోయాయి. షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అవుతున్న స‌మ‌యంలో లాక్‌డౌన్ రావ‌డంతో ఆగిపోయిన సినిమాలు కొన్న‌యితే, స‌గం షూటింగ్ పూర్త‌యిన సినిమాలు, దాదాపు పూర్తి కావ‌చ్చిన సినిమాలు... ఇలా ర‌క‌ర‌కాలుగా సినిమాల ప‌రిస్థితులు ఉన్నాయి. కొన్ని నెల‌లుగా గ‌డ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఊర‌ట‌నిచ్చే విష‌యం షూటింగులు మ‌ళ్లీ మొద‌లు కావ‌డం. కొన్ని ష‌ర‌తుల‌తో, మార్గ‌ద‌ర్శ‌కాల‌తో కూడిన అనుమ‌తి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌డంతో కొన్ని సినిమాల షూటింగులు మొద‌ల‌య్యాయి. 

సినిమా అంటేనే కోట్ల రూపాయ‌ల‌తో కూడిన వ్యాపారం. అందుకోసం కొంత‌మంది నిర్మాత‌లు బ‌య‌టి నుంచి అప్పులు తెచ్చి సినిమాలు తీస్తుంటారు. అలాంటి వారిపై లాక్‌డౌన్ ప్ర‌భావం బాగా ప‌డింది. షూటింగులు ఆగిపోవ‌డంతో తెచ్చిన అప్పుకి వ‌డ్డీ భారం తోడైంది. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా నిర్మాత కోలుకునే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే ఇప్ప‌ట్లో థియేట‌ర్స్ ఓపెన్ చేసే ప‌రిస్థితి లేదు. ఓపెన్ చేసినా థియేట‌ర్స్‌కి వ‌చ్చి సినిమా చూసే సాహ‌సం ప్రేక్ష‌కులు చేయ‌లేరు. క‌రోనా అదుపులోకి వ‌చ్చినా థియేట‌ర్స్ ద‌గ్గ‌ర మునుప‌టి క్రౌడ్ క‌నిపించ‌దు. అందులో ఎలాంటి సందేహం లేదు. సినిమాని ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద రిలీజ్ చేసినా థియేట‌ర్స్ ద్వారా వ‌చ్చినంత భారీ మొత్తం ఇక్క‌డ రాదు. ఎలా చూసినా చివ‌రికి న‌ష్ట‌పోయేది నిర్మాతే. 

నిర్మాత మ‌నుగ‌డ‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా ఉండేందుకు నిర్మాత‌ల సంఘం ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అదేమిటంటే రెమ్యున‌రేష‌న్ క‌టింగ్‌. హీరో ద‌గ్గ‌ర్నుంచి లైట్ బాయ్ వ‌ర‌కు అంద‌రి రెమ్యున‌రేష‌న్‌లో 25 శాతం కోత విధించాల‌ని సంఘం భావిస్తోంద‌ట‌. మ‌రి దీన్ని అమ‌లు చేసేందుకు ఎలాంటి విధి విధానాలు పాటించాల‌నే విష‌యంలో నిర్మాత‌ల సంఘం ఒక నిర్ణ‌యానికి రావాల్సిన అవ‌స‌రం ఉంది. నిర్మాత‌కు భారం త‌గ్గించేందుకు మంచి నిర్ణ‌య‌మే తీసుకున్న‌ప్ప‌టికీ దీనికి పెద్ద హీరోల నుంచి ఎంత‌వ‌ర‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌నేది ప్ర‌స్తుతం నిర్మాత‌ల సంఘం ముందు ఉన్న ప్ర‌శ్న‌. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే త‌క్కువ న‌ష్టంతో నిర్మాత బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. మ‌రి దీన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌గ‌లుగుతారా లేదా అనేది తెలియాలంటే కొంత‌కాలం ఆగాలి. 

 


                    Advertise with us !!!