
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొన్ని ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల మేరకు షూటింగ్స్ చేసుకునే అవకాశం కలిగింది. అయితే బాలీవుడ్‌కి మాత్రం ఇప్పట్లో ఆ అవకాశాలు ఉన్నట్టు కనిపించడం లేదు. తాజా సమాచారం మేరకు వచ్చే నెల నుంచి షూటింగులకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ పక్క మహారాష్ట్రలో కరోనా కేసులు లక్ష దాటిపోవడంతో ఆంక్షలు మరింత కఠినంగా మారే అవకాశం కనిపిస్తోంది. బాలీవుడ్ మాత్రం కరోనా అంటేనే వణికి పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల సీనియర్ నటుడు శక్తి కపూర్ కరోనాపై, షూటింగులపై స్పందించాడు. ఇలాంటి పరిస్థితిని ప్రపంచ ఎప్పుడూ ఎదుర్కోలేదని, ఈ విపత్తు వల్ల మనిషి మనుగడ సాగించే అవకాశాలు రోజు రోజుకీ సన్నగిల్లుతున్నాయని అన్నారు.
తన వరకు తాను బయటికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదని, షూటింగ్ స్టార్ట్ అయినా అందరికీ నో చెప్పదలుచుకున్నానని అంటున్నారు. మరి ఆయన కుమార్తె అయిన హీరోయిన్ శ్రద్ధా కపూర్ పరిస్థితి ఏమిటి అని అడిగితే... ఆమె కూడా తనలాగే ఇంట్లోనే ఉంటుందని, ఏ సినిమా అయినా ఎలాంటి హీరోతో అయినా క్యాన్సిల్ చేసుకోమని శ్రద్ధాకి చెప్పానని అంటున్నాడు శక్తి. మరి ఈ విషయంలో శ్రద్ధా తండ్రి మాట వింటుందా లేక షూటింగ్లో పాల్గొంటుందా చూడాలి. ప్రభాస్ హీరోగా నటించిన `సాహో` చిత్రంలో నటించే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవు. అలాగని షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలు కూడా లేవు. కాబట్టి తండ్రీకూతుళ్లు షూటింగ్ గురించి ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు.