
నేచరల్ ఇండెక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాద రెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది అందించిన సహకారంతో ఇది సాధ్యపడిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహం, మార్గదర్శకం ఎంతో ఉపకరించాయన్నారు. ఐఐటీ (భువనేశ్వర్), ఐఐటీ (ముంబాయి) మొదటి రెండు స్థానాలలో నిలిచాయన్నారు. సంత్ గడ్జి బాబా ఆమర్ఐటి విశ్వవిద్యాలయం, ఐఐటీహెచ్ (హైదరాబాద్) సంయుక్తంగా మూడో స్థానలో నిలిచిందని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో మొదటి స్థానంలో నిలిచే దిశగా ఏయూ పనిచేస్తోందన్నారు.
గడచిన ఏడాది కాలంలో ఎన్నో సంస్కరణలు చేపట్టడం సాధ్యపడిందన్నారు. విద్యార్థి కేంద్రంగా విద్యను అందిస్తున్నామన్నారు. మత్స్య కారులకు పూర్తిస్థాయిలో నైపుణ్యాలను అందించి ఉపాధి కల్పించే కేంద్రం, పూర్తిస్థాయిలో నైపుణ్యాలను అందించి ఉపాధి కల్పించే కేంద్రం, పూర్తిస్థాయిలో సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ ఏర్పాటు చేసిందన్నారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకారం అందించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ విజయ సాయి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.