
ఉన్నది ఉన్నట్లుగా, మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరోలా నటించడం తెలియని నికార్స్అయినా వ్యక్తి, కుండా బద్దలు కొట్టినట్లు మాట్లాడే టాప్ హీరోలలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకరు. తన నటనతో అభిమానుల , ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు. అలాగే రాజకీయాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. జూన్ 10న ఆయన 60 వసంతంలోకి అడుగుపెట్టారు. కరోనా వైరస్ కారణంగా తన అభిమానులకు ముందుగా ఈ పుట్టిన రోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం లేదు ముందు ఆరోగ్యమే ప్రధానమని వారికి సమాచారం ఇచ్చి తన కుటుంభం సభ్యుల సమక్షంలోనే నిరాడంబరంగా పుట్టిన రోజు షష్టి జరుపుకున్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
మీకు 60 సంవత్సరాు అంటే నమ్మబుద్ధి కావడం లేదు! ఆరోగ్య రహస్యమేంటి?
- ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నా వయసు 60 కాదు 16 అని చెప్పాను. 14ఏళ్ల వయసులో నా నట జీవితం ప్రారంభించాను కాబట్టి, ఇంకో ఇంటర్వ్యూలో 14ఏళ్లు అని చెప్పా. ఇంకా తక్కువ చెప్పవచ్చేమోనని ఇప్పుడు ఆలోచిస్తున్నా. 60 పక్కన సున్నా తీసేయండి.(నవ్వు). ఇక సినిమా విషయానికి వస్తే నా పాత్రను బట్టి డైట్ మారిపోతుంటుంది. యోగాసనాలు వ్యాయామం దానికి తగ్గట్లు చేస్తా. అన్ని ఆహార ప్రదార్ధాలు తింటా... అయితే లిమిట్‌గా. ఇవే నా ఆరోగ్య రహస్యాలు. సినిమాలో పాత్ర పండటానికి బాగా హోంవర్క్ చేస్తా. బోయపాటి నా కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కోసం ఇప్పుడు కసరత్తు చేస్తున్నా. మా సినిమా షూటింగ్‌ను ఫైట్‌తోనే ప్రారంభిస్తాం. ఈ చిత్రమూ అంతే. అది నా పుట్టిన రోజునాడు విడుదల చేసిన టీజర్ లో చూసారుగా? ఈ వయసులో ఇంత హుషారంటారా... అది నాన్న జీన్స్ నుంచి వచ్చింది.
మీ 60ఏళ్ల జీవితంలో మరుపురాని సంఘటనలు ఏవైనా ఉన్నాయా?
- నా జీవితంలో ప్రతిదీ మరుపురాని సంఘటనే. ప్రతి విషయాన్నీ ఎంజాయ్ చేస్తూ చేస్తా.
యన్ టి ఆర్ నట, రాజకీయ వారసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారు? మీకెలా అనిపిస్తోంది?
- నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఉండటం మొదట్లో కొంత భయంగా ఉండేది. కానీ, మా చిన్నతనం నుండి నాన్నగారి క్రమశిక్షణ నాకు అలవడింది. ఆయన కూడా నాకు ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదు. ‘వీరబ్రహ్మేంద్రస్వామి’ షూటింగ్ జరుగుతున్నపుడు నా వయసు 24 సంవత్సరాలు మంచి వయసులో వున్నా ఓ రోజు షూటింగ్ లో టేక్ మీద టేకులు తీసుకుంటుంటే నాన్నగారికి బాగా కోపం వచ్చింది. టోటల్ యూనిట్ ముందు నన్ను తిట్టేశారు. అప్పటి నుంచి ప్రతి విషయంలో సమయాన్ని వృధా చేయకుండా సన్నివేశంలో ఇతర నటి నటుల టైంయింగ్ లో బాగా ఇన్వాల్వ్ అయి చేస్తూవస్తున్నాను.
బాలకృష్ణ అంటే ఎంత ప్రేమ ఉంటుందో, అంతే భయం కూడా ఉంటుంది. దీనిపై మీరేమంటారు?
- అదేం లేదు. భయపడాల్సిందేముంది. అందరితోనూ సరదాగా ఉంటా.
మీ ప్రయాణంలో మీ శ్రీమతి వసుంధర గారి సహకారం గురించి..?
- కార్యేశు దాసి.. కరణేశు మంత్రి... పద్యంలా... వసుంధర నాకు భార్యగా లభించడం నాకు వరం. నా విజయాలన్నింటిలో ఆమె పాత్ర ఉంది. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నా కోపాన్ని, కష్టాన్ని తానూ తీసుకుంటుంది. నన్ను ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచడానికి నిత్యం శ్రమిస్తుంది.
మీరు యన్ టి ఆర్కు భయపడతారని విన్నాం. అయితే, మీ ఇంట్లో ఇంకెవరికో కూడా భయపడతారట! నిజమేనా?
- బ్రహ్మణి. తను చాలా బ్యాలెన్స్డ్. ఏ విషయాన్నైనా చాలా కూల్‌గా చెబుతుంది. ఆమె వల్లే నాకు సహనం అలవడింది. తను ఏం చెప్పినా వింటా. తను లేకపోతే మా మనవడితో కలిసి అల్లరి చేస్తా. వాడికి కూడా వాళ్లమ్మ అంటే భయం. నటుడిగా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్న ఎప్పుడూ బిజీగా ఉండేవారు. ఆయన చెన్నైలో ఉంటే.. మేం హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. ఆయన ఇక్కడికొచ్చాక... నేను అక్కడకి వెళ్లా. అయన నిజ జీవితంలో కంటే అయన చేసిన సినిమాల్లోనే ఎక్కువగా చూసి స్ఫూర్తిపొందాను. నేను కొంతవరకూ నా కుటుంబానికి సమయం ఇచ్చేవాడిని . బ్రహ్మణీని ట్యూషన్‌కు తీసుకెళ్లేవాణ్ని. వాళ్లు చదువుకోవడానికి అవసరమైనవి ఇచ్చేవాణ్ని. సైన్స్, టెక్నాజీకి సంబంధించి నాకు తెలిసిన విషయాలను వారితో పంచుకునేవాణ్ని. బ్రహ్మణీకి అయిదు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చాయి. నేను హార్వార్డ్‌కు వెళ్లు అనిచెప్పా. అక్కడికి ఇంటర్వ్యూకు వెళ్లాక వాళ్లు... ‘ఇక్కడ సీటు లభించడం నీ అదృష్టం’ అని ఏదో అన్నారంట. అలా అన్నందుకు సీట్ తిరస్కరించి వచ్చేసింది. స్టాన్‌ఫోర్డ్‌లో చదివింది. సింగపూర్‌లో ఉద్యోగం చేసింది. ఏ విషయమైనా తను లాజిక్‌గా చెబుతుంది. అందుకే నేను తన మాట వింటా. ప్రస్తుతానికి తనకు రాజకీయాపై ఆసక్తి లేదు.
బాలకృష్ణకు ఏదనిపిస్తే అది మాట్లాడతారు? వెనకా ముందు చూడడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు? అలా మాట్లాడటం కరక్టేనా?
- ఎందుకు మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్లే కదా నాన్నగారు తెలుగు దేశం పార్టీ స్థాపించారు. నేను కూడా అంతే! ఏది మంచి అనిపిస్తే, ఏది రైట్ అనిపిస్తే వున్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పేముంది? మనసులో ఒకటి ఉంచుకుని బయటకి నటించి మాట్లాడటం మా నాన్న నేర్పలేదు.
కొందరు సినీ ప్రముఖు సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు మీరు చేసిన కామెంట్ సెన్సేషన్ అయింది కదా! దాన్ని ఏమంటారు?
- దానిపై ఆ తర్వాత రియలైజ్ అయ్యా. ఒకవేళ ఏపీ సీఎంను కలవడానికి వెళ్లే ముందు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలిస్తే వెళ్లేవాడిని. జూన్ 10 నా పుట్టిన రోజు పైగా షష్టి పూర్తి కార్యక్రమాలు వున్నాయి అందుకే జూన్ 9న అమరావతికి వెళ్ళడానికి వీలుకలుగలేదు. అప్పుడు అలా అనడం వల్ల వాళ్లు భయపడి ఉంటారు. ప్రభుత్వాన్ని నేను తప్పుపట్టను. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి ఓ అనుమతి కావాల్సి వస్తే, మేము చేస్తున్న సేవకు మెచ్చి కేసీఆర్ ఒక్కరోజులో ఆ పని చేసి పెట్టారు. ఆయనంటే నాకు అమితమైన గౌరవం.
ఇంకా మీరు చేయానుకుంటున్న పాత్రలేమైనా ఉన్నాయా? దర్శకత్వం చేస్తారా?
- తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. నా తరం హీరోల్లో నేను పౌరాణిక, జానపద, సాంఘిక, ప్రయోగాత్మక చిత్రాలెన్నో చేశాను. చంఫీుజ్ఖాన్, గోనగన్నారెడ్డి... వంటి పాత్రలు చేయాలని వుంది సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 999' కూడా చేస్తాను.
నాన్నగారితో నటించిన హీరోయిన్స్‌తో మాట్లాడుతుంటారా?
- నేను ఎక్కువగా రెగ్యులర్ గా నాన్నగారి సినిమాలు చూస్తుంటాను. ఆయన సినిమాలు చూడకపోతే నాకు ఆ రోజు గడవదు. గుండమ్మకథ, గులేబకావళికథ, మిస్సమ్మ వంటి ఎవర్ గ్రీన్ సినిమాలు చూస్తుంటాను. ఇక నాన్నగారు సినిమాల్లో పాడిన పద్యాలను కూడా మననం చేసుకుంటూ ఉంటాను. ఇక నాన్నగారితో నటించిన హీరోయిన్స్‌లో జమునగారితో మాట్లాడుతుంటాను. వీలున్నప్పుడల్లా ఆమెను కలిసి అప్పటి సినిమా ముచ్చట్లలను చెప్పమని వింటూ ఆనందిస్తుంటాను కూడా.
ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా మీరు చేస్తున్న సేవల గురించి..?
- బసవతారకం ఆసుపత్రి ద్వారా మరింత మందికి సేలవందించానేది నా లక్ష్యం. దాదాపు రూ.650 కోట్లతో... తుళ్లూరులో 1000 పడకలతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించదలిచాం. దాని ద్వారా ఇంకా ఎంతోమందికి చికిత్సలు అందుతాయి. నా నియోజకవర్గంలో చాలామందికి నా ఫోన్‌నంబర్ తెలుసు. ఏ సమస్య ఉన్నా కాల్ చేస్తారు. అక్కడున్న నా పీఏ ద్వారా ఆ పని పూర్తిచేయించే ఏర్పాట్లు చేస్తాను.
అభిమానులకు మీరేం చెప్పానుకుంటున్నారు?
- ప్రతి వ్యక్తికి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలుంటాయి అలాంటి ఘట్టం నా 60వ పుట్టినరోజు..నా షష్టిపూర్తి. ఇలాంటి రోజును అభిమానులతో ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాం. కానీ కరోనా కారణంగా అన్నీ ప్రాంతాల నుండి అభిమానులు రావాలంటే చాలా ఆంక్షలున్నాయి. అందువల్ల నా అభిమానులతో పుట్టినరోజును షష్టిపూర్తి ని జరుపుకోలేకపోయానని చాలా బాధగా ఉంది. అభిమానులను తలచుకున్నప్పుడల్లా.. మీకు, నాకు మధ్య ఉన్న అనుబంధం ఏంటి? అని కొన్నిసార్లు అనిపిస్తుంది. అన్నీ కులాల , వర్గాల , మతాల వాళ్లు నా అభిమానులుగా ఉన్నారు. ఎక్కడో జాంబియాలో కూడా నా పుట్టిన రోజు తమ స్థానంలో జరుపుకుని అక్కడి పేదలకు నిత్యావసర సామాగ్రిని పంపిణి చేయడం ముదావహం. ప్రపంచం నాలు మూలాల నుండి ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని పొందడం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. విజయాలు వచ్చినపుడు ఆనందించారు. నా కష్టాల్లో నా వెన్నంటే నిలబడ్డారు. ఎన్నో సినిమాలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తున్నారు. నేను సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాదు.. నా అభిమానులు కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు తమ డబ్బు వెచ్చించి చేస్తున్నారు. ఎక్కడో జాంబియాలో కూడా నా పుట్టిన రోజు తమ స్థానంలో జరుపుకుని అక్కడి పేదలకు నిత్యావసర సామాగ్రిని పంపిణి చేయడం ముదావహం. మిమ్మల్ని చూస్తుంటే నేను జీవితంలో ఏదైనా గొప్పగా సాధించానంటే అది ఇంత మంది అభిమానమే.
మీ నట వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగ్రేటం ఎప్పుడు?
- ఇంకా రెండు ఏళ్ళు పట్టొచ్చు.
బోయపాటి శ్రీనుతో చేస్తోన్న హాట్రిక్ మూవీ గురించి..?
- ``బోయపాటి గారితో చేస్తున్న సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింహా, లెజెండ్ తర్వాత నేను, బోయపాటి శ్రీను కాంబినేషన్లో చేస్తోన్న సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయి టీజర్ చూస్తేనే అర్ధమైవుంటుంది. టీజర్ ఇండియాలోనే నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. టీజర్‌ను చూసి సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలుసు. ఇప్పటికే (12జూన్ సాయంత్రం 7 ఘంటలకు) 7. 8 మిలియన్ల వ్యూస్ తో వుంది. నాకు, బోయపాటి శ్రీనుకి మధ్య మంచి వేవ్‌లెంగ్త్ కుదిరింది. అందుకనే మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించగులుగుతున్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల మేర ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనే తదితర అంశాలపై డిస్కస్ చేసి షూటింగ్ ప్రారంభిస్తాం. మా కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది. బోయపాటి బాలకృష్ణ సినిమా అంటే ఆ వైబ్రేషన్స్ అలానే ఉంటాయి. మా ఇద్దరికీ మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. సాధారణంగా నేను, బోయపాటిగారు చాలా స్పీడుగా సినిమా పూర్తి చేస్తాం. షూటింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాక ఈ సినిమాను రెట్టింపు వేగంతో పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చాలా పెద్ద స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా ఎందరో ప్రముఖులు, చాలా మంది అభిమానులు విషెస్ చెప్పారు. ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ నిబందనలను పాటిస్తూనే అందరికీ ఆదర్శంగా ఉంటూ నా పుట్టిన రోజు నాడు ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలను చేపట్టినందుకు, రికార్డ్ సృష్టించడానికి చేసిన కేక్ కటింగ్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను`` అంటూ ఇంటర్వ్యూ ముగించారు నటసింహ నందమూరి బాలకృష్ణ..