అచ్చెన్న అరెస్టులో అవి లోపించాయి : నాదెండ్ల

Janasena Leader Nadendla Manohar Reacts on MLA Acham Naidu Arrest

అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్‍ నాదెండ్ల మనోహర్‍ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేక రాజకీయ కక్ష సాధింపా? అనే విషయంలో వైకాపా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన సృష్టం చేశారు. ఒక శాసనసభ్యుడిని అరెస్టు చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అచ్చెన్న అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తోందన్నారు. ఈఎస్‍ఐలో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని తమ పార్టీ డిమాండ్‍ చేస్తోందని అన్నారు.