
భారతీయ టెకీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ షాకిచ్చారు. హెచ్1బీ వీసాలను సస్పెండ్ చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో తీవ్ర స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. అయితే ఆ సమస్యను ఎదుర్కొనేందుకు ట్రంప్ సర్కార్ ..హెచ్ 1బీ వీసాలతో పాటు ఇతర వీసాలను కూడా రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీసాల కత్తిరింపునకు సంబంధించి వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని రాసింది. హెచ్ 1బీ వీసాలను తగ్గిస్తున్నట్లు ఆ పత్రికకు ఓ అధికారి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజా ప్రతిపాదనల వల్ల హెచ్ 1బీ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారి ఆశలకు గండిపడినట్లు తెలుస్తోంది. అయితే సస్పెషన్ ఎత్తివేసేంత వరకు ఆ వీసాలు ఉన్న వారు అమెరికాలోకి ఎంటర్ కావడం అసాధ్యం.
ఇప్పటికే హెచ్ 1బీ వీసా ఉన్న వారు అమెరికాలో కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయిన హెచ్ 1బీ వీసాదారులు ఇప్పటికే అమెరికా నుంచి స్వదేశాలకు పయనమవుతున్నారు. అయితే వీసా సస్పెన్షన్‌పై తుది నిర్ణయం తీసుకోలేదని శ్వేతసౌధం సృష్టం చేసింది. కానీ పరిపాలనా విభాగం ఇతర ప్రతిపాదలను ఆలోచిస్తునట్లు వైట్‌హౌజ్ ప్రతినిధి హోగన్ గిడ్లే పేర్కొన్నారు. హెచ్ 1బీ తో పాటు హెచ్ 2బీ, జే1, ఎల్ 1 వీసాలకు కూడా కత్తెర విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.