
సహజంగా రాజకీయ సంబంధ ప్రకటనలకు దూరంగా ఉండే కొన్ని రంగాల్లో ఫ్యాషన్, బ్యూటీపార్లర్...వంటివి ప్రధానమైనవి. గ్లామర్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే రంగాలు కాబట్టి...రాజకీయ నేతలను పొగడడం కాని విమర్శించడం వీరికి పెద్దగా అలవాటు లేని పనులు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనూహ్య ప్రశంసలు ఈ రంగంలో సుప్రసిద్ధుడైన వ్యక్తి నుంచి లభించడం విశేషం. భారతదేశంలో ప్రఖ్యాత హెయిర్‌స్టైలిస్ట్‌గా, సెలబ్రిటీ మేకప్‌కి పేరొంది, దేశవ్యాప్తంగా వేలాది శాఖలు నిర్వహిస్తున్న జావేద్ హబీబ్... జగన్ పధకాలకు జై కొట్టారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జగనన్న చేదోడు పధకం ఆయన్ను బాగా మెప్పించింది. ఈ పధకంలో భాగంగా పలు రకాలుగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉపాధి పొందే వారికి ఏటా రూ.10వేలు అందుతుంది. అదే క్రమంలో నాయి బ్రాహ్మణులకు కూడా ఇది వర్తిస్తుంది. జగన్ ప్రకటించిన ఈ పధకం తనను ఎంతగానో ఆకట్టుకుందని జావేద్ హబీబ్ అన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిండికి కూడా ఇబ్బంది పడుతున్న చిరుద్యోగులు, పార్లర్లలో పనిచేసేవారికి ఇది ఎంతైనా ఉపయుక్తమనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది. కరోనా ప్రపంచం మొత్తాన్ని మార్చేసిందని, తమ రంగంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్జీలకు, నాయి బ్రాహ్మణులు తదితరులకు రూ. 10వేల చొప్పున అందిస్తున్న జగన్‌కి దిల్సే బిగ్ థ్యాంక్స్ అంటూ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను కూడా ట్వీట్ చేశారు. అదే విధంగా సెలబ్రిటీ డిజైనర్ హర్మాన్ కౌర్ సైతం జగన్ పధకాన్ని స్వాగతించారు. ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన చర్య గా ఆయన అభివర్ణించారు.