
ఇఎస్ఐ కుంభకోణంలో చంద్రబాబు హయాంలో నాటి కార్మిక మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు.. శుక్రవారం ఉదయం 6గంటల సమయంలో భారీ బందోబస్తు మధ్య ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన ఈ ఆరెస్ట్ పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
గతంలో ప్రతిపక్షంబలో ఉండగా పలు అవినీతి ఆరోపణలు చేసిన వైఎస్ జగన్ ఏపీలో తాను అధికారంలోకి రాగానే చంద్రబాబు పాలనలోని అవినీతిపై విచారణకు ఆదేశించారు. అప్పుడే కార్మిక శాఖలోని ఈఎస్ఐ స్కాం వెలుగుచూసింది. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు రైట్ హ్యాండ్ గా చెప్పుకునే నాటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందని దర్యాప్తులో తేలినట్టు సమాచారం. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్ వెల్లడించింది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని విచారణలో వెలుగులోకి వచ్చింది.
ఈఎస్ఐ గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కోటేషన్లు తీసుకొని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ.51 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తించారు. మందులు పరికరాల వాస్తవ ధరకంటే 136శాతం అధికంగా సంస్థలు టెండర్లు చూపించినట్టు తద్వారా అక్రమంగా రూ.85 కోట్లు చెల్లించినట్టు విచారణలో తేలింది. ఈ స్కామ్ లో ఇప్పటికే ఒక డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. అతడు ఇచ్చిన ఆధారాల ప్రకారం అచ్చెన్నాయుడి బండారం బయటపడినట్లు సమాచారం. దీంతో ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.