
ఇ.వి.వి.సత్యనారాయణ..
నవ్వులు పూయించే సినిమాలు తీయడంలో దిట్ట. హాస్య ప్రధాన చిత్రాలు రూపొందించడంలో ఓ ప్రత్యేక శైలిని కలిగిన దర్శకుడు జంధ్యాల ప్రియ శిష్యుడు ఇ.వి.వి. ఆయన దగ్గర 8 సంవత్సరాల్లో 22 సినిమాలకు పనిచేశాడు. నాలుగు స్తంభాలాట, రెండు రెళ్లు ఆరు, అహనా పెళ్ళంట, రెండు జెళ్ల సీత.. ఆ సినిమాల్లో ముఖ్యమైనవి. ఆ తర్వాత సురేష్ కృష్ణ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి కూడా పనిచేశాడు. సినిమాలంటే మక్కువతో పశ్చిమ గోదావరి జిల్లా దొమ్మేరు నుంచి మద్రాసు చేరుకున్న ఇ.వి.వి.కి ఎంతో కాలం తర్వాత నిర్మాత నవత కృష్ణంరాజు సహకారంతో దేవదాస్ కనకాల దర్శకత్వంలో రూపొందిన ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాతే జంధ్యాల దగ్గర దర్శకత్వ శాఖలో చేరాడు. కె.అశోక్‌కుమార్ నిర్మించిన చెవిలో పువ్వు చిత్రంతో దర్శకుడిగా మారారు ఇ.వి.వి.సత్యనారాయణ. రాజేంద్రప్రసాద్, సీత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఎంతో నిరాశకు గురైన ఇవివికి రామానాయుడు ఓ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అదే ప్రేమఖైదీ. హరీష్, మాలాశ్రీ జంటగా రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. మంచి కథ, కథనాలతోపాటు సందర్భానుసారం వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. ఈ సినిమాతో దర్శకుడిగా నిలదొక్కకున్నారు ఇవివి. ఆ తర్వాత అతనికి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. రాజేంద్రప్రసాద్‌తో తీసిన తన తొలి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అతనితోనే తన మూడో సినిమా అప్పుల అప్పారావు ప్రారంభించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. దీంతో హాస్య చిత్రాల దర్శకుడిగా ఇవివి పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వరసగా సీతారత్నంగారి అబ్బాయి, ఆ ఒక్కటీ అడక్కు, జంబలకిడి పంబ, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆలీబాబా అరడజను దొంగలు, ఆమె, ఆయనకి ఇద్దరు... వంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు ఇవివి దర్శకత్వంలో వచ్చాయి.
రాజేంద్రప్రసాద్, నరేష్, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలతోనే కాకుండా నాగార్జున, వెంకటేష్, కృష్ణంరాజు, మోహన్‌బాబు, రాజశేఖర్ వంటి టాప్ హీరోలతో వారసుడు, హలోబ్రదర్, అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మానాన్నకు పెళ్లి, వీడెవడండీ బాబు, అదిరింది అల్లుడు, నేటి గాంధీ తదితర చిత్రాలు రూపొందించారు. తన ప్రతి సినిమాకు డిఫరెంట్ టైటిల్ అప్పటి వరకు ఎవరి ఊహల్లోకీ రాని టైటిల్‌ని వెతికి మరీ పెట్టేవారు ఇవివి. ముందుగా టైటిల్ చూడగానే చాలా కొత్తగా ఉందని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా ఇవివి సినిమాల టైటిల్స్ ఉండేవి.
పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్‌ను హాయ్ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత ఆర్యన్ కొన్ని సినిమాలు చేసినప్పటికీ హీరోగా నిలదొక్కులేకపోయాడు. రెండో కుమారుడు నరేష్... రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అల్లరి చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. అతనికి కితకితలు చిత్రంతో మంచి బ్రేక్ ఇచ్చారు ఇవివి. ఆ తర్వాత నరేష్‌తోనే అత్తిలి సత్తిబాబు, ఫిటింగ్ మాస్టర్, పెళ్ళయింది కానీ, బెండు అప్పారావు ఆర్ ఎం పి, బురిడీ, కత్తి కాంతారావు సినిమాలు చేసి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి హీరోగా నరేష్‌ను నిలబెట్టారు ఇవివి. 2000లో ఇవివి సినిమా పేరుతో సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి చాలా బాగుంది చిత్రం నిర్మించారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు సొంత బేనర్లో నిర్మించారు.
ఒకవైపు హాస్యప్రధాన సినిమాలు చేస్తూనే మరో వైపు సందేశాత్మక సినిమాలు, మహిళా ప్రధాన సినిమాలు చేస్తూ వచ్చారు ఇవివి. వాటిలో ఆమె, తాళి, ఆరుగురు పతివ్రతలు వంటి సినిమాలు ఉన్నాయి. ఆమె చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు ఇవివి. తెలుగు తెరకు ముగ్గురు అందమైన కథానాయికలను పరిచయం చేసిన ఘనత కూడా ఇవివికే దక్కుతుంది. ఇవివి దర్శకత్వంలో వచ్చిన నేను ప్రేమిస్తున్నాను ద్వారా రచన, ఆ ఒక్కటీ అడక్కు ద్వారా రంభ, ఆమె ద్వారా ఊహ హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
ఒకప్పుడు హాస్యప్రధాన సినిమాలు అంటే జంధ్యాల డైరెక్షన్లో వచ్చినవే. జంధ్యాల తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసింది ఖచ్చితంగా ఇవివినే. ఇప్పుడు వస్తున్న దర్శకులు కామెడీ సినిమా చెయ్యాలంటే ఒక జంధ్యాల సినిమాలా, ఒక ఇవివి సినిమాలా అంటూ ఒక బ్రాండ్‌ను వారికి ఇచ్చారు. ప్రేక్షకులు కూడా ఆ బ్రాండ్ అంటే ఎంతో ఇష్టపడతారు. మరి ఇవివి తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? మంచి కథ, కథనాలతో సినిమాను నడిపిస్తూనే హాస్యాన్ని కూడా జోడించి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చెయ్యగల ఇ.వి.వి.సత్యనారాయణలాంటి దర్శకులు ఇంకా రావాలని కోరుకుందాం. జూన్ 10 ఇ.వి.వి.సత్యనారాయణ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది `తెలుగు టైమ్స్`