
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న సూపర్ విమానాలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన శక్తిమంతమైన రెండు బీ 777 విమానాలు ముందుగా నిర్ణయించిన సమయం కంటే రెండు నెలలు ఆలస్యంగా సేవలు ప్రారంభించనున్నాయని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఈ విమానాలు క్షిపణి దాడులను తట్టుకోవటమే కాకుండా స్వీయ రక్షణ వ్యవస్థలను (ఎల్ఏఐఆర్సీఎం) కలిగి ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి పర్యటనల కోసం బీ747 విమానాలను వినియోగిస్తున్నారు. వీటిని ఎయిర్ ఇండియా పైలట్లు నడుపుతున్నారు. కొత్తగా రానున్న విమానాలను మాత్రం వాయుసేవ పైలట్లు నడుపుతారని అధికారులు తెలిపారు. ఈ విమానాలను ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.