
-విమర్శల పాలవుతున్నతెలంగాణ ప్రభుత్వం
-పరీక్షలు చేయడం లేదని ఆరోపణలు
-అనూహ్య స్థాయిలో పెరిగిన మరణాలు
తొలుత తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసుల్లో కాస్త ముందున్న తెలంగాణ ఆ తర్వాత సమర్ధవంతంగా దానిని ఎదుర్కుంటున్నట్టు కనిపించింది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరుగుతూ పోతుంటే... తెలంగాణలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో నియంత్రణలోనే ఉన్నట్టు అనిపించింది.
ప్రధాని మోడీ కంటే రెండడుగులు ముందుంటూ లాక్ డవున్ నిబంధనలు అమలు చేస్తూ కెసియార్ సమర్ధవంతంగానే సమస్యను డీల్ చేస్తున్నారనే అభిప్రాయం కలిగించారు. ఒక దశలో తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజుకు కేవలం 3 కేసులు మాత్రమే నమోదైన పరిస్థితి రావడంతో ప్రభుత్వం అత్యద్భుత పనితీరు కనపరిచిందని హైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో కూడా సింగిల్ డిజిట్ కేసులు మాత్రమే నమోదవడం అసాధారణ విజయం అంటూ పలువురు కొనియాడారు. పొరుగు రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు పెరగడం కూడా తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందన్న అభిప్రాయం బలపడడానికి కారణమైంది. మరోవైపు ఇదే అదనుగా ప్రభుత్వం కూడా రెట్టించిన ఉత్సాహం చూపింది. తెలంగాణ త్వరలోనే కరోనా ఫ్రీ స్టేట్‌గా మారనుందని అత్యుత్యాహంతో ప్రకటించేసింది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి మరో అడుగు ముందుకేసి తాము తీసుకున్న చర్యల వల్ల కరోనా అంతమవుతోందని లేకపోతే ఎపిలోని కర్నూలు పరిస్థితి వచ్చేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా తాము సమర్ధవంతంగా నియంత్రిస్తున్నామని చెప్పకనే చెప్పారు.
ఇప్పుడు ఇదంతా గతం కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే తెలంగాణలో పరిస్థితి తారుమారైంది. లాక్ డవున్ సడలింపుల తర్వాత రాష్ట్రంలో కేసులు నమోదు తారాస్థాయికి చేరింది. స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌తో దాదాపు సమాన స్థాయికి చేరింది. ప్రస్తుతం రోజువారీగా వందల సంఖ్యలో తెలంగాణలో కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాదు మరణాల రేటూ అనూహ్యంగా పెరిగిపోయింది. విచిత్రం ఏమిటంటే కేసుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కన్నా కాస్త తక్కువ ఉన్నప్పటికీ చికిత్స పొందుతున్న రోగులు, మరణాల విషయంలో మాత్రం తెలంగాణ మరింత ముందంజలో ఉంది. కేవలం ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో దాదాపు 150కిపైగా పాజిటివ్ కేసులు నమోదైతే, ఒక్కరోజులోనే 14 మరణాలు సంభవించడం తెలంగాణలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో పోలీసులతో పాటు జర్నలిస్టులు సైతం కరోనా బాధితులుగా మారుతున్నారు. ఆదివారం ఒక టీవీచానెల్కు చెందిన యువ జర్నలిస్ట్ కరోనాతో చనిపోవడం గమనార్హం.
ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల దాడి పెంచాయి కరోనా నియంత్రణలో కెసియార్ విఫలమయ్యారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆది నుంచీ పరీక్షల విషయంలో అలసత్వం వహించారని అదే ప్రస్తుత దుస్థితికి కారణమని వీరు అంటున్నారు. ఇప్పటిదాకా పరీక్షల సంఖ్యను ప్రభుత్వం వెల్లడించకపోవడం ఏమిటని నిలదీస్తున్నాయి. మరోవైపు కేంద్రం కూడా ఈ విషయంలో తెలంగాణ పై అసంత్రుప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం సంకటంలో పడింది. ఓ వైపు లాక్ డవున్ సడలింపులు మరోవైపు కరోనా శరవేగంగా వ్యాపిస్తుండడంతో నియంత్రణ చర్యలు మరింత పకడ్బందీగా చేపట్టనుంది.