
అడ్డూ అదుపులేని ఆగ్రహావేశాలతో విమర్శలు గుప్పించే సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మళ్లీ తనదైన శైలిలో గళం విప్పుతున్నారు. ఎన్నికల ముందుతో పోలిస్తే ఆ తర్వాత కాస్త స్పీడు తగ్గించి అరుదుగా కొన్ని అంశాలపై మాత్రమే స్పందిస్తున్న పోసాని... గత కొన్ని రోజులుగా మీడియాలో తరచు కనిపిస్తున్నారు. పలు అంశాలపై ఎప్పిటిలాగే కుండ బద్ధలు కొడుతున్నారు. చాలా మందికి భిన్నంగా తాననుకున్నది బల్లగుద్ధి మరీ చెప్పే ఆయన మాటల పట్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది.
తాజాగా సినిమా రంగంలో నెలకొన్న వివాదాలు, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితుల మీద ఆయన స్పందించారు. మహానాడు సందర్భంగా వైఎస్ జగన్ పాలన గురించి హీరో బాలకృష్ణ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. త్వరలోనే వైకాపా ప్రభుత్వం కూలిపోతుందంటూ బాలకృష్ణ మాట్లాడడాన్ని తప్పు బడుతూ అలా కూలిపోవడానికి జగన్ వెన్నుపోటు దారుడు కాదని అలాగే వెన్నుపోటు పొడిపించుకోవడానికి ఎన్టీరామారావు కూడా కాదంటూ వ్యంగ్యంగా విమర్శించారు. అలా అంటూనే బాలయ్య కోపం నిమిషఃం మించి ఉండదంటూ తేల్చేశారు.
తెలంగాణలో కెసియార్, కెటియార్లు అవినీతికి పాల్పడలేదనేది తన గట్టి నమ్మకం అని చెప్పారు. వాళ్లు అవినీతి పరులని నిరూపణ అయితే వారిని వ్యతిరేకిస్తూ తెలంగాణ అంతా తిరుగుతానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు కెసియార్ ఇచ్చిన అద్భుత వరం అన్నారు. రెండు సార్టు జైలుకెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి కి కెసియార్ను విమర్శించే అర్హత లేదన్నారు. కెసియార్ కలల స్వప్పం కాళేశ్వరం అని ప్రజలకు మేలు చేస్తే ప్రతిపక్షాలు కూడా పొగడాలన్నారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డి మంచోడని ఆయన దేశం కోసం సైన్యంలో పనిచేశాడని. అలాంటి వ్యక్తి నిజాలు మాట్లాడాలన్నారు. నాగార్జునసాగర్ కూడా కాంగ్రెస్ కమిషన్ల కోసమే కట్టారా? అని నిలదీశారు. అయితే అది 100శాతం ప్రజల కోసమే కట్టారని అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రజల కోసమే అన్నారు. కెసియార్ కమిషన్లు తీసుకున్నారంటున్న విపక్షాలు అవెక్కడ దాచారో చెప్పాలని తాము తెచ్చుకుంటామన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మధ్య మంచి సఖ్యత ఉందని ఇద్దరూ జలవివాదాలను చర్చల ద్వారా సరైన పద్ధతిలో పరిష్కరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.