అభిమానుల‌పై పోలీసు కేసు... స్పందించ‌ని ఎన్టీఆర్‌

Hyderabad Police Book Jr NTR Fans For Threatening Actress Meera Chopra With Gang Rape

త‌మ అభిమాన హీరోని ఏమైనా అంటే ఏ అభిమానీ ఊరుకోడు. అలా మాట్లాడిన వారితో వాగ్వాదానికి దిగుతారు. త‌మ హీరోపై వారికి ఉన్న అభిమానాన్ని మ‌రింత చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. అయితే ఒక్కోసారి ఆ అభిమానం హ‌ద్దులు దాటుతుంది. వ్య‌వ‌హారం ముదురుతుంది. దానివ‌ల్ల స‌ద‌రు ఆ హీరో కూడా ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప‌రిస్థితి అలాగే ఉంది. హీరోయిన్ మీరా చోప్రాపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌. వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీరాచోప్రా అందించిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే... హీరోయిన్ మీరా చోప్రా ట్విట్టర్‌లో మంగళవారం లైవ్ చాటింగ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నాకు ఎన్టీఆర్ గురించి తెలియదు. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అని అన్నారు. దాంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ.. గ్యాంగ్ రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న మీరాచోప్రా ట్రోలింగ్‌కు సంబంధించిన ట్వీట్లను హైదరాబాద్ పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి, అలాగే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు న‌మోదు చేశారు.

మీరా ఫిర్యాదుకు స్పందించి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదుతో ఎఫ్ఐఆర్ తంతును కూడా పూర్తి చేశారు. FIR కాపీని మీడియాకు రిలీజ్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలో తనపై చేసిన ట్రోల్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు అందించినట్టు మీరా పేర్కొన్నారు. అలాగే కొన్ని ట్వీట్లను కొందరు డిలీట్ చేశారు. వాటి ఆధారాలు తన వద్ద ఉన్నాయి. అలాగే ఆ అకౌంట్లను తొలగించాలని తన పిటిషన్‌లో మీరా చోప్రా కోరారు. అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మీరా చోప్రా తన ఫిర్యాదును బుధవారం అంటే జూన్ 3వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ఆన్‌లైన్ ద్వారా అందజేశారు. ఆ ఫిర్యాదుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై క్రైమ్ నంబర్ 997/2020sy ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం, అలాగే ఐపీసీ 506, 509 ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేపట్టిన పోలీసులు అకౌంట్లు, వారికి సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై ఎన్టీఆర్ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. కానీ, మీరా చోప్రా మాత్రం త‌న‌కు ల‌భిస్తున్న మ‌ద్ద‌తుతో ఎన్టీఆర్‌పై మ‌రింత ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీనిపై ఎన్టీఆర్ స్పందించ‌క‌పోతే అభిమానుల ఆగ‌డాల‌ను స‌మ‌ర్థించిన‌వాడ‌వుతాడు. కంట్రోల్ చెయ్యాలంటే సోష‌ల్ మీడియా ద్వారానే త‌న మెసేజ్‌ల‌తోనే వారిని అదుపు చెయ్యాలి. అది జ‌రిగే ప‌నేనా? మ‌రి ఈ వివాదానికి ప‌రిష్కారం ఏమిటి? పోలీసులు అభిమానుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారు? దానికి ఎన్టీఆర్ ఏం స‌మాధానం చెప్తారు. మీరా చోప్రా... ఎన్టీఆర్ అభిమానుల‌పై కేసు పెట్ట‌డంతో ఊరుకుంటుందా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానాలు దొర‌క‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది.