గాన గంధ‌ర్వుడు మ‌న బాలుకి బ‌ర్త్‌డే విషెస్‌

birthday wishes to sp balasubramanyam

ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం... అంద‌రూ బాలు అని ముద్దుగా పిలుచుకుంటారు. 11 భార‌తీయ భాష‌ల్లో పాట‌లు పాడిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఇప్ప‌టికి 40,000కు పైగా పాట‌లు పాడి రికార్డు సృష్టించారు బాలు. 1966 డిసెంబ‌ర్ 15న తొలి పాట ఆల‌పించి నేప‌థ్య గాయ‌కుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. న‌టుడు, నిర్మాత ప‌ద్మ‌నాభం నిర్మించిన `శ్రీ‌శ్రీ‌శ్రీ మ‌ర్యాద రామ‌న్న‌` చిత్రంలోని `ఏమి ఈ వింత మోహం..` పాట‌ను పి.సుశీల‌, పి.బి.శ్రీ‌నివాస్‌, కె.ర‌ఘురామ‌య్య‌తో క‌లిసి పాడారు బాలు. అత‌ని తొలి పాట‌ను శోభ‌న్‌బాబుపై చిత్రీక‌రించారు. ఇంకా ఈ పాట‌లో హీరోలు కృష్ణ‌, హ‌ర‌నాథ్‌, రామ‌కృష్ణ క‌నిపిస్తారు. 1966 డిసెంబ‌ర్ 15న ప్రారంభ‌మైన ఎస్‌.పి.బాలు సంగీత ప్ర‌యాణం 54 సంవ‌త్స‌రాలుగా నిరంత‌రాయంగా కొన‌సాగుతూనే ఉంది. జూన్ 4 అంటే నేడు బాలు పుట్టినరోజు 74 వ‌సంతాలు పూర్తి చేసుకొని 75వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్నారాయ‌న‌. ఈ సంద‌ర్భంగా క్లుప్తంగా ఆయ‌న సినీ జీవిత విశేషాలు.. పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత అతను ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా అతను గళానికి ఉంది.

తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతను పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి.

ఆ త‌ర్వాత హిందీలో మ్యూజిక‌ల్ హిట్స్‌గా నిలిచిన మైనే ప్యార్ కియా, హ‌మ్ ఆప్‌కే హై కౌన్ చిత్రాల్లోని అన్ని పాట‌లు పాడారు. ఆ సినిమాల్లోని పాట‌లు దేశ‌మంతా మారు మోగిపోయాయి. క‌న్న‌డ సంగీత ద‌ర్శ‌కుడు ఉపేంద్ర‌కుమార్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో 12 గంట‌ల్లో 21 పాట‌లు రికార్డు చేసి సంచ‌ల‌నం సృష్టించారు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. అప్ప‌ట్లో రోజుకు 17 గంట‌లు ప‌నిచేస్తూ నిత్యం 15 పాట‌ల‌కు త‌గ్గ‌కుండా పాడిన బిజీ సింగ‌ర్ బాలు. తాను సింగ‌ర్ కావ‌డానికి ఇన్‌స్పిరేష‌న్ ఎవ‌రని అడిగితే మ‌హ్మ‌ద్ ర‌ఫీ అని చెబుతారు బాలు. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన‌ రికార్డు సృష్టించారు బాలు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి.

గాయకుడిగానే కాకుండా డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు. ఇప్ప‌టివ‌ర‌కు 72 సినిమాల్లో వివిధ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు బాలు. క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌, స‌ల్మాన్‌ఖాన్‌, అనిల్‌క‌పూర్ వంటి స్టార్ హీరోలు న‌టించిన సినిమాల‌కు తెలుగులో వారికి గాత్రదానం చేశారు బాలు.

2001లో ప‌ద్మ‌శ్రీ‌, 2011లో ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుల‌ను అందుకున్న బాలుకి 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు. 1996లో బాలు ఆధ్వ‌ర్యంలో ఈటీవీలో ప్రారంభ‌మైన `పాడుతా తీయ‌గా` కార్య‌క్ర‌మం ద్వారా ఎంతో మంది నూత‌న గాయ‌నీగాయ‌కుల్ని తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌కు ప‌రిచ‌యం చేశారు బాలు. 24 సంవ‌త్స‌రాల క్రితం ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం నిరంత‌రాయంగా కొన‌సాగుతోంది.