
ప్రయోగాలు చెయ్యాలన్నా, విభిన్నమైన పాత్రలు పోషించాలన్నా, అతను తప్ప ఎవ్వరూ ఈ పాత్ర చెయ్యలేరు అనేంతగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన హీరో కమల్‌హాసన్. అయితే ఇప్పుడు కమల్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో విక్రమ్. తను చేసే క్యారెక్టర్ కోసం ఏం చెయ్యడానికైనా వెనుకాడని విక్రమ్‌కు ఈమధ్యకాలంలో సరైన హిట్ రాలేదు. ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో `కోబ్రా` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విక్రమ్ పలు గెటప్స్‌లో కనిపిస్తాడట. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ `పొన్నియన్ సెల్వన్` చిత్రంలో కూడా విక్రమ్ ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్‌తోపాటు కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలు రన్నింగ్‌లో ఉండగానే విక్రమ్ మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. విక్రమ్‌కు ఇది 60వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి సంబంధించి మరో విశేషం ఉంది. అదేమిటంటే విక్రమ్ కుమారుడు ధృవ్ కూడా ఈ సినిమా నటించడం. `అర్జున్‌రెడ్డి` చిత్రం తమిళ్ రీమేక్‌లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ధృవ్ తన తండ్రితో కలిసి ఈ సినిమాలో నటించనున్నాడు. విక్రమ్‌తోపాటు ధృవ్ క్యారెక్టర్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్‌తో `మాస్టర్` చిత్రాన్ని నిర్మిస్తున్న సెవన్ స్ర్కీన్ స్టూడియో సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. అంటే విక్రమ్ నటించే మూడు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఈ మూడు సినిమాలు విక్రమ్‌కి ఎలాంటి పేరు తెస్తాయనేది తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.