ఆ సమయంలో బంకర్ లో దాగిన డొనాల్డ్ ట్రంప్ ...

Trump Moves to Underground Bunker as Protests and Violence Spill Over

పోలీస్‍ కస్టడీలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‍ మృతిపై అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. వైట్‍హౌస్‍ వద్ద నిరసనలు మిన్నంటిన సమయంలో వైట్‍హౌస్‍ అడుగున నిర్మించిన బంకర్‍లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ను తరలించినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బంకర్‍లో ట్రంప్‍ దాదాపు గంటపాటు గడిపిన అనంతరం వైట్‍హౌస్‍ లోపలికి ఆయను తీసుకువచ్చినట్టు ఆ కథనం పేర్కొంది. వైట్‍హౌస్‍ వద్ద చొచ్చుకువచ్చేందుకు వందలాది మంది ప్రయత్నించిన క్రమంలో సీక్రెట్‍ సర్వీస్‍, యూఎస్‍ పార్క్ పోలీస్‍ అధికారులు నిరసనకారులను నిలువరించారు.  

వైట్‍హౌస్‍ వద్ద ఒక్కసారిగా కలకలం రేగడంతో ట్రంప్‍ బృందం అప్రమత్తమైంది. కాగా ట్రంప్‍తో పాటు మెలానియా ట్రంప్‍, బారన్‍ ట్రంప్‍లను కూడా బంకర్‍లోకి అధికారులు తోడ్కొని వెళ్లారా అనేది సృష్టం కాలేదు. మిన్నెపొలిస్‍లో పోలీసు కస్టడీలో నల్లజాతీయుడు మరణించడం పట్ల మే 25 నుంచి అమెరికా అంతటా నిరసనలు వెల్లువెతుతున్న సంగతి తెలిసిందే. నిరసనల నేపథ్యంలో దాదాపు 15 రాష్ట్రాల్లో పోలీసులు, నేషనల్‍ గార్డ్ సభ్యులను అధికారులు రంగంలోకి దింపారు.