
పాలన పూర్తయి ఏడాది కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న మేథో మధనంలో వైసీపీ ప్రభుత్వం తాను ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను ఏ విధంగా అమలు చేసిందీ, చేస్తోందీ, చేయబోతోందీ అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తాను మేనిఫెస్టో అనేది నేను బైబిల్‌గా భావిస్తాను, ఖురాన్‌గా భావిస్తాను, భగవద్గీత గాను భావిస్తానన్నారు. మేనిఫెస్టో అమలుకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలిసేలా... ప్రతి గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర, ప్రతి మంత్రి దగ్గర చివరకు నా ఛాంబర్లో కూడా గోడలకి ఈ మేనిఫెస్టేనే కనిపిస్తుందన్నారు. తాము ఏమేం చేశాం, ఏమేం చేయాలన్న తలంపుతోనే అడుగులు వేస్తున్నామని, ఇప్పటికే మేనిఫెస్టో అమలును 90 శాతం మొట్టమొదట సంవత్సరంలోనే పూర్తి చేశామని చెప్పారు. ఈ సందర్భంగా తాము అమలు చేసిన మేనిఫెస్టో వివరాలను తేదీలతో సహా ఆయన వెల్లడించారు.
8–07–2019 పెన్షన్ కానుక: 2018 అక్టోబరు దాకా అంటే ఎన్నికలకు ఆరునెలలు ముందు దాకా గత ప్రభుత్వ హయంలో కేవలం 44 లక్షలు మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. ఇప్పుడు మేం 58.61 లక్షల వరకూ ఇస్తున్నాం. గత ప్రభుత్వం 02–19–2019 వరకు అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు దాకా పింఛను ఎంతిచ్చేవారంటే కేవలం రూ.1000. ఇవాళ మనం ఎంతిస్తున్నామంటే రూ.2250. గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వానికి నెల, నెలా వచ్చే బిల్లు 490 కోట్లు రూపాయలు. ఈ రోజు పెన్షన్ బిల్లు మనకొచ్చేది నెలకు ఎంతా అంటే 1421 కోట్ల రూపాయలు మనకొచ్చే బిల్లు. పెన్షన్ల కోసం పడిగాపులు కాసే పరిస్ధితి నుంచి నేరుగా తలుపు తట్టి నేరుగా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం.. 15–08–2019న వాలంటీర్ల వ్యవస్ధకు నాంది పలికాం. ఆ తర్వాత 02–10–2019న విలేజ్ సెక్రటేరియ్, వార్డు సెక్రటేరియట్ వ్యవస్ధకు నాంది పలికాం.
అనంతరం 04–10–2019న వైయస్సార్ వాహనమిత్ర అనే కార్యక్రమంతో సొంత ఆటో ఉన్న డ్రైవర్లకు,టాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచాం.వైయస్సార్ కంటివెలుగు 10–10–2019న ప్రారంభించి దాదాపుగా 69 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించడం, వారికి ట్రీట్మెంట్ ఇప్పించే కార్యక్రమం పూర్తి చేశాం. వైయస్సార్ రైతు భరోసాను 15–10–2019న ప్రారంభించి ముందుగా ఇస్తామని చెప్పిన రూ.12500కు బదులుగా రూ. 13500, ఇస్తామన్న నాలుగేళ్లను మరో ఏడాది పెంచి 5 సంవత్సరాలు చేస్తున్నాం. అందులో రెండో దఫా కూడా మొదలైంది. ఈ పధకం ద్వారా దాదాపు 50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతా ఉంది.
ఎంఎస్ఎంఈ యూనిట్స్‌కు లోన్స్ రీస్ట్రక్చర్ చేసే కార్యక్రమాన్ని 17–10–2019న వైయస్సార్ నవోదయం పేరిట ప్రారంభించాం. అలాగే 08–11–2019 లో ఆగ్రిగోల్డ్ బాధితులకు దాదాపు రూ.264 కోట్ల రూపాయలు అందజేశాం. కోర్టు అనుమతి మేరకు పదివేల లోపు డిపాజిట్లున్న బాధితులందరికీ ఇవ్వడం జరిగింది. స్కూళ్ల రూపురేఖలన్నీమార్చే ప్రక్రియ మనబడి కి 14–11–2019న నాడు నేడు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 45వేల స్కూళ్లకు గాను 15,700 స్కూళ్లకు జూలై నాటికి పూర్తిగా కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ప్రతిస్కూళ్లోనూ బ్లాక్‌బోర్డ్స్ మారబోతున్నాయి. బాత్రూమ్స్ రాబోతున్నాయి. గోడలకు ఫెయింటింగ్స్, ఫినిషింగ్ మారనున్నాయి. కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నాం.
ప్రతీ స్కూల్ ఇంగ్లిషు మీడియంగా రూపురేఖలు దిద్దుకోనుంది. 20–11–2019న వైయస్సార్ నవశకానికి సర్వేకి శ్రీకారం చుట్టాం. ఇంతకముందు బియ్యం కార్డు ఉంటే గ్రామాల్లో నెలకు ఐదువేలరూపాయల అర్హత, పట్టణాలల్లో ఆరువేల రూపాయలు అర్హత ఉండేది. ఇవాళ గ్రామాలల్లో అర్హత రూ.10వేలు చేశాం. పట్టణాలలో అయితే నెలకు ఏకంగా రూ.12వేలు చేశాం. పూర్తిగా రైస్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, హౌసింగ్ అన్ని పథకాలకు నవశకం ద్వారా గ్రామవాలంటీర్ వ్యవస్ధకు పదునుపెట్టి సర్వేలు మొదలుపెట్టాం. మరోవైపు 21–11–2019 మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం. ఆరోగ్యశ్రీ పధకం రూపురేఖల్ని కూడా 01–12–2019లో పూర్తిగా స్వరూపం మార్చేశాం.
గత ప్రభుత్వంలో రూ.680 కోట్లు బకాయిలు పెట్టి నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బులివ్వకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకునే దానికి ఎవరైనా ఆసుపత్రికి పోతే ప్రభుత్వ బకాయిలు కారణం చెప్పి వెనక్కి పంపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పూర్తిగా బకాయిలన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేస్తూ... మే 18 వరకు ఎలాంటి బకాయిలు లేకుండా ఆరోగ్యశ్రీలో మొత్తం అప్టు డేట్ చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించి 03–01–2020న 2వేల వ్యాధులతో ఆరోగ్యశ్రీతో ఫైలెట్ ప్రాజెక్టు మొదలుపెట్టాం,
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు పెంచాం. ఇకపై ఒక్కో జిల్లాను 2వేలకు పెంచుకుంటూ పోవాలి, అంతేకాకుండా వైయస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమంలో భాగంగా ఎవరికైనా వైద్యం చేయించడమే కాదు, వైద్యం చేయించిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి అంటే ఆ విశ్రాంతి సమయంలో కూడా నెలకి రూ.5వేలు అందిస్తున్నాం. ఇప్పటికే దాదపుగా 1 లక్ష ఆరువేల మంది వైయస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ది పొందారు. ఇంకా 03–12–2019న వైయస్సార్ లా నేస్తం, 16–12–2019న మహిళల భద్రతకు సంబంధించి , సరికొత్తగా దిశ యాక్టును తీసుకురావడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇద్దరు మహిళా ఆధికార్లు దానికి పూర్తిగా సూపర్వైజింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గత 21–12–2019 నా పుట్టిన రోజు నాడున వైయస్సార్ నేతన్న నేస్తం ప్రారంభించాం. ఇంతకు ముందు ఐదేళ్లలో కూడా చేనేతలకు రూ.200 కోట్లు ఇవ్వలేదు. ఇప్పుడు సంవత్సరానికి రూ.200 కోట్లు ఇస్తున్నాం. ఏకంగా 81 వేల మంది చేనేత కార్మికులకు 24వేల రూపాయలు చొప్పున అందించాం. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి, పిల్లాడికి కూడా భరోసా ఇస్తూ రూ.15 వేల రూపాయలు తల్లుల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ అమ్మ ఒడి పధకాన్ని 09–01–2020 న ప్రారంభించాం. దీని ద్వారా 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలు లబ్ధిపొందారు. అలాగే 18–02–0220 వైయస్సార్ కంటివెలుగు కార్యక్రమం అవ్వా తాతలకు మొదలుపెట్టాం, 24–02–2020 జగనన్న వసతి దీవెన ప్రారంభించి దాదాపు 15 లక్షల మందికి, పిల్లల వసతి కోసం ప్రతి పిపిల్లాడికి 20వేల రూపాయలను రెండు దఫాల్లో ఇవ్వనున్నాం.
మొదటి దఫా దాదాపు 1200 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది.ఇంజనీరింగ్ చదువుతున్న చదువుతున్న వాళ్లకైతే రూ.20 వేలు దాంట్లో రూ.10వేలు ఇచ్చాం. పాలిటెక్నిక్ చదువుతున్నావారికి రూ.15000 దాంట్లో రూ.7500 కూడా ప్రతి తల్లికీ కూడా ఇవ్వడం జరిగింది. 2020–21 కి సంబంధించి కూడా ఏకంగా కేలెండర్ రిలీజు చేశాం. ఏప్రిల్ నెలలో పొదుపు సంఘాలకు వైయస్సార్ సున్నా వడ్డీ పధకం కింద వడ్డీలేని రుణాలు రూ.1400 కోట్లు ఇవ్వగలిగాం. దీని ద్వారా 8.7 లక్షల స్వయం సహాయ సంఘాలకు చేయూత లభించింది. అలాగే దాదాపు 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం కలిగింది..
28–04–2020 విద్యాదీవెన కింద రూ.4000 కోట్లు ప్రతి పిల్లాడికీ కూడా ఎవరైతే చదువుతా ఉన్నారో... ఇంతకు ముందు ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్లు బకాయిలు తీరుస్తూ... 4300 కోట్లు రూపాయలు వైయస్సార్ విద్యా దీవెన కింద ఇచ్చాం. ఫీజు రీయింబర్స్మెంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మార్చి క్వార్టర్ వరకు ఒక్క రూపాయి కూడా కాలేజీలకు బకాయిలకు లేకుండా నేరుగా కాలేజీలకు డబ్బులివ్వడం జరిగింది. తర్వాత క్వార్టర్ నుంచి తల్లులకే నేరుగా డబ్బులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైయస్సార్ విద్యా దీవెన కూడా ఏప్రిల్‌లోనే అందజేశాం. గత 6–05–2020 వైయస్సార్ మత్స్యకారభరోసా అందించాం.
ఇక 15–05–2020 మొన్నేనే రైతు భరోసా రెండోదఫా కింద రైతులుకు రూ.7500 ఇచ్చే కార్యక్రమం కూడా అయిపోయింది. అలాగే ఎంఎస్ఎంఈలకు సంబంధించి రీస్టార్స్అనే ప్రోగ్రాం కింద చిన్న, చిన్న కంపెనీలకు తోడుగా ఉండేందుకు గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు మొత్తం 960 కోట్లు రూపాయలు పెట్టిందో, వాటిని మొత్తం తీరుస్తున్నాం. మే నెలలో మొదటి దఫా రూ.450 కోట్లు రూపాయలు రిలీజ్ చేశాం.
ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కార్యక్రమంలో అక్కడ చిన్న, చిన్న కంపెనీలకు మేలు జరిగే విధంగా వాళ్లకు మూడు నెలలు పాటు ఫిక్స్‌డు ఛార్జీలు కరెంటు బిల్లులు రద్దు చేశాం.