సాయి దత్త పీఠంలో హనుమాన్ జయంతి. ఆన్‌లైన్‌లోనే భక్తుల వీక్షణ

Hanuman Jayanthi at Sai Datta Peetham

అమెరికాలో న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో హనుమాన్ జయంతిని ఈ సారి వినూత్నంగా జరిపారు. కరోనా వైరస్ తో లాక్‌డౌన్ నేపథ్యంలో భక్తులు ఇళ్లకు పరిమితం కావడంతో ఆన్‌లైన్ ద్వారా వారిని ఈ జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేశారు. ఇళ్ల నుంచే హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ రామనామ జపం లలో భక్తులు పాల్గొన్నారు. జూమ్, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా భక్తులు హనుమాన్ జయంతిని వీక్షిస్తుండగా పీఠంలో, కరోనా నుంచి యావత్ మానవాళిని రక్షించాలని కోరుతూ  హనుమాన్ సహస్ర  పారాయణం, మన్యసూక్త సహితంగా 108  కలశాలతో అభిషేకం జరిగింది.  వెయ్యి కి పైగా అరటి పండ్లతో, తమలపాకులతో, వడమాలలతో  ఆంజనేయుడిని అలకరించి ప్రత్యేక పూజలు చేశారు.

సాధారణ సమయాల్లో ఎలా హనుమాన్ జయంతి జరుపుతారో అదే విధంగా లాక్‌డౌన్ సమయంలో కూడా వైభోవోపేతంగా ఈ వేడుకలునిర్వహించడం జరిగింది. భక్తులతో ఆన్‌లైన్‌లోనే అనుసంధానం జరుపుతూ ఈ వేడుకలు నిర్వహించారు. పూజనంతరం స్వామి వారికి అలంకరించిన అరటి పండ్లను స్థానిక సేవా సంస్థలైన న్యూ బ్రన్స్విక్ లోని రాబర్టువుడ్ జాన్సన్ హాస్పిటల్, ఎడిసన్ లోని  ఓజనమ్ హోమ్ లెస్ షెల్టర్, సౌత్ ప్లైన్ఫీల్డ్ లోని  అరిస్టా కేర్ సంస్థలకు, సాయి దత్త పీఠం చారిటీ గ్రూప్ ద్వారా అందించినట్లు సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి తెలిపారు. 

ఆ సాయి నాధుని ఆశీస్సులతో సాయిదత్త పీఠం ఏప్రిల్ 25 న తలపెట్టిన సామూహిక శత సహస్రాధిక శ్రీ రామ రక్షా మంత్రం జపం( 3,61,351) మరియు సామూహిక  సహస్రాధిక హనుమాన్ చాలీసా పారాయణం (15,123) , ఏప్రిల్ 25 నుండి మే 16 వరకూ నిర్విఘ్నంగా భక్తుల సహకారంతో నిర్విఘంగా పూర్తి చేయటం జరిగింది.  ఈ శుభ సందర్భాన్ని  పురస్కరించుకుని, ఎందరో భక్తులు సాయి దత్త పీఠానికి ఆర్ధికంగా, హార్థికంగా సహాయ సహకారాలందించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు.  

ఈ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో, CDC మరియు స్థానిక ప్రభుత్వ నియమాలని పాటించి, భగవంతుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో, ఇంటివద్దనే ఉన్నారని  ఆశిస్తున్నాను.

Click here for Event Gallery