ఈ నిబంధనల‌తో షూటింగ్‌ సాధ్యమేనా?

Permits for shooting are also acceptable to the film industry

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మొదలై 50 రోజులు దాటిపోయింది. ఈ లాక్‌డౌన్ వ‌ల్ల‌ అదీ, ఇదీ అని కాదు.. అన్ని రంగాలూ నష్టపోయాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ ఇప్పట్లో పూడ్చుకోలేని నష్టాల్లో కూరుకుపోయింది. షూటింగులు లేవు, కొత్త సినిమా రిలీజ్‌లు లేవు, థియేటర్స్‌ లేవు.. ఆఖరికి టీవీ సీరియల్స్‌ షూటింగులు కూడా లేవు. దీంతో సినిమా, టి.వి. రంగాల‌ను నమ్ముకొని బ్రతుకుతున్న ల‌క్షలాది మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల‌ ప్రధానమంత్రి నరేంద్ర మోది 20 ల‌క్షల‌ కోట్లతో ఓ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీ వ‌ల్ల‌ ఎవరికి ఎలాంటి ఉపయోగం జరుగుతుందో తెలియదు కానీ, లాక్‌డౌన్‌ ఎత్తేసినా, కొన్ని సడలింపులు చేసినా చాలా మందికి ఉపయోగం జరుగుతుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే కొన్ని పరిశ్రమల‌కు షరతుల‌తో కూడిన సడలింపులు చేశారు. సినిమా పరిశ్రమకు కూడా ఆమోద యోగ్యమైన షరతుల‌తో షూటింగుల‌కు అనుమతులు ఇస్తే ఇండస్ట్రీకి పూర్వ వైభవం వస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

షూటింగులు తిరిగి ప్రారంభించుకోవడానికి కేంద్రం కొన్ని కఠినమైన నిబంధనల‌తో కూడిన సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. అవేమిటంటే.. షూటింగ్‌ చేయాల‌నుకునే నిర్మాతలు తమ యూనిట్‌లో ఎవ్వరికీ కరోనా వైరస్‌ లేదని సర్టిఫికెట్‌ సమర్పించాలి. యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ సొంత ఖర్చుల‌తో పరీక్షలు చేయించాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ షూటింగ్‌ సమయంలో ఎవరైనా చనిపోతే రూ.50 ల‌క్షలు నష్టపరిహారం ఇవ్వాలి. షూటింగ్‌కు ముందు తర్వాత లొకేషన్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేయించాలి. యూనిట్‌లోని అందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఇదంతా నిర్మాత బాధ్యతగా ఉంటుంది. ఇలా నిబంధనలు పాటిస్తే ఎంతమంది సభ్యుతోల‌నైనా షూటింగ్‌ చేసుకోవచ్చు. ఎక్కువ మంది జనం పోగయ్యే లొకేషన్లలో షూటింగ్‌ చెయ్యకూడదు.

సినిమా యూనిట్‌ తప్ప ఏ ఒక్కర్నీ షూటింగ్‌ లొకేషన్‌లోకి అనుమతించ కూడదు. ఇండియాలోని గ్రీన్‌ జోన్లలో మాత్రమే షూటింగ్‌ జరుపుకోవడానికి అనుమతినిస్తారు. విదేశాల్లో షూటింగ్‌కి పర్మిషన్‌ ఇవ్వరు. వీటన్నింటికీ ఓకే అయితే జూన్‌ 1 నుంచి షూటింగులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొందరు నిర్మాతలు తెంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తల‌సాని శ్రీనివాసయాదవ్‌ను క‌లిసార‌ని తెలుస్తోంది. అయితే షూటింగ్‌ ప్రారంభించే రోజుని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని, లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలియజేసినట్టు సమాచారం.

పైన తెలిపిన నిబంధనల‌ ప్రకారం షూటింగ్‌ చేసుకోవడం ఎంతవరకు సాధ్యం? ఎంతమందికి అది ఆచరణ సాధ్యమవుతుంది. వైరస్‌ పరీక్షల‌తో సహా అన్ని ఖర్చులూ నిర్మాతే భరించడం, ఎవరైనా చనిపోతే 50 ల‌క్షలు పరిహారం ఇవ్వడం అందరికీ సాధ్యమయ్యే పనేనా? ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఈ నిబంధనల‌తో ఎన్నిరోజులు షూటింగ్‌ చెయ్యగల‌రు. అయితే పైన తెలిపిన నిబంధనల‌ను అధికారికంగా ప్రకటించలేదు. ప్రకటన సమయానికి ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయేమో చూడాలి.