
దక్షిణాదిలో ఎవర్ గ్రీన్ గ్లామర్/యాక్షన్ కలబోసిన హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్ అగ్రగామి హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా రాణించి... బాహుబలి సినిమా తర్వాత మరింత జోరుమీదున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా దూసుకుపోతున్న ఈ స్టార్ యాక్ట్రెస్ గత ఏడాదే ఒటిటి వేదిక మీదా కాలు మోపారు. తమిళంలో రూపొందిన సంచలన క్వీన్ వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇది ఎమ్ఎక్స్ ప్లేయర్ రూపొందించింది. ఆ వెబ్‌సిరీస్ కధ తమిళనాడు మాజీ సిఎం దివంగత పురుచ్చతలైవి జయలలిత జీవితాన్ని పోలి ఉండడంతో జనాదరణతో పాటు రమ్య కృష్ణ అభినయానికి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపధ్యంలో ఆమె పంచుకున్న ముచ్చట్లు...
లాక్ డవున్ అనేది నా జీవితంలో ఓ మరపురాని మధురమైన అనుభూతినిస్తోంది. చాలా హాయిగా ఉంది. ఇలాంటి టైమ్ మళ్లీ దొరకదేమో కూడా. దాదాపు రెండునెలలైంది గుమ్మం దాటి. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో వలస కూలీలు, ఆహారం లేని నిరుపేదల దుస్థితి చూస్తుంటే మాత్రం హృదయానికి చాలా బాధ అనిపిస్తోంది. ఏదేమైనా ఈ కష్టాలు తొలగి అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఒకసారి ఈ లాక్‌డవున్ పూర్తయిపోయిన తర్వాత ఈ టైమ్ తప్పకుండా మెమొరబుల్ అవుతుంది. ఇలాంటి ఫ్రీ టైమ్ మళ్లీ వస్తుందా? అనిపిస్తుంది. కాని మళ్లీ వచ్చినా ఇలాంటి కరోనా లాంటి కారణంతో కాకుండా రావాలని మాత్రం కోరుకుంటున్నా.
చిరంజీవితో నటించడానికి రెడీ...
ఇప్పుడ నటించిన వెబ్‌సిరీస్‌తో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. తెలుగులో చిరంజీవి లాంటి అగ్రనటులు కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తారని వార్తలు వస్తున్న నేపధ్యంలో వారితో కాంబినేషన్‌గా నాకు ఏదైనా మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ఆఫర్లున్నాయి. వెబ్‌సిరీస్‌లో సాంగ్స్ ఉండవు నిజమే అయినా ఇప్పుడు నాకు పాటలు అవసరమా? అయినా నేనేం సాంగ్స్ చేస్తాను చెప్పండి? (నవ్వుతూ) అయితే సాంగ్స్ కంటే వెబ్‌సిరీస్‌లో కంటెంటే పెద్ద ఆకర్షణ.
‘క్వీన్‌ను ఆమెతో పోల్చుతున్నారు...
నా తొలి వెబ్‌సిరీస్ క్వీన్. దీని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా ప్రజ్ఞావంతులు. ఆయన స్ట్రాంగ్ స్క్రిప్తో వస్తారు. చాలా బాగా తీస్తారని మనందరికీ తెలుసు. ఆయనే ఆఫర్ ఇస్తే ఈ అవకాశాన్ని ఎవరైనా ఎలా వదులుకుంటారు? ఇక ఇందులో నా పాత్ర తమిళనాడు మాజీ సిఎం జయలలితను పోలినట్టు ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఎవరికి తోచినట్టు వారు పోల్చుకోవచ్చు దానికి నేనేం చేయలేను. నా వరకూ రచయిత్రి అనితా శివకుమరన్ రాసిన క్వీన్ నవల ఆధారంగా తీసిన సిరీస్ ఇది ఇది తెలుగు ప్రేక్షకులకు కూడా జీ తెలుగు చానెల్ లో వచ్చే సోమవారం నుంచి సీరియల్‌గా రానుంది.
వెబ్ సిరీస్‌దే...వచ్చే కాలమంతా...
ప్రస్తుతం వెబ్‌సిరీస్ తీసేవారు చాలా వైవిధ్యభరితమైన కధాంశాలు ఎంచుకుంటున్నారు. దీని వల్ల నటులకు వెరైటీ రోల్స్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా లాక్ డవున్ కారణంగా వెబ్‌సిరీస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. అయితే సినిమాలు చూడడం కోసం ధియేటర్స్‌కి జనం వెళ్లడం మానేస్తారని నేను భావించడం లేదు. అయితే వెబ్‌సిరీస్ కూడా అదే స్థాయిలో ఆదరణ వస్తుందని అనుకుంటున్నా.
పాలిటిక్స్...ప్లాన్స్ లేవు
ఫ్యూచర్ చెప్పలేను
క్వీన్ వెబ్‌సిరీస్ రాజకీయ నేపధ్యంలో నడుస్తుంది. ఈ పాత్ర చాలా కొత్తగా ఫ్రెష్‌గా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. అయితే ఈ పాత్ర చేయడం నాలో రాజకీయ ఆకాంక్షలు, ఆలోచనలు ప్రస్తుతానికైతే ఏమీ రాలేదు. భవిష్యత్తులో అవకాశం ఉందా అంటే నేను చెప్పలేను. మన భవిష్యత్తు ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఎలా చెప్పగలం చెప్పండి?
కరోనాకి నెగిటివ్...దృక్పధంలో పాజిటివ్...
మనం ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిలో రేపేంటి అనేది తెలియని అయోమయంలో ఉన్నాం. .కంటికి కనపడని శతృవుతో చేసే యుద్ధం ునల్ని ఒత్తిడికి గురి చేస్తోంది. కరోనాతో మనం కలిసి బ్రతకాల్సిందే అంటూ చాలా మంది చెబుతున్నారు. కాబట్టి శక్తివంతంగా మారాలి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. భయం, ఒత్తిడి మనల్ని తమ ఆధీనంలోకి తీసుకోకుండా చూసుకోవాలి....జాగ్రత్తలు పాటించండి.