
కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభం, లాక్డౌన్ కారణంగా ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు కోల్పోయి ఇబ్బందుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ ప్రజలను ఆదుకోవడం కోసం ఆర్థిక ప్యాకేజీలను అమలుపరుస్తున్నాయి. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కరోనా ప్రభావానికి లోనయ్యాయి. సుదీర్ఘ లాక్డౌన్లను అమలు చేస్తున్నాయి. ఆయా దేశాల్లో పరిశ్రమలు, వ్యాపారాలు కుంటుపడ్డాయి. ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం ప్రబలింది. దీంతో పలు దేశాలు ఇప్పటికే ఉద్దీపన ప్యాకేజీల్ని ప్రకటించాయి. ఒక్కో దేశం ఒక్కో రంగానికి ప్రాధాన్యతనిచ్చాయి.
కోవిడ్ 19కు తీవ్రంగా ప్రభావితమైన అమెరికా బహుళ దశల్లో 2.5ట్రిలియన్ డాలర్లకుపైగా ఆర్ధిక ప్యాకేజీని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగాలు కోల్పోయిన 22మిలియన్ల అమెరికన్లకు ఇందులో భాగంగా ఆర్ధిక సాయం అందించింది. టీకాల అభివృద్ధికి 3బిలియన్లు, సిడిసిల ఏర్పాటుకు 2.2బిలియన్లు, స్థానిక ఆరోగ్య సంస్థలకు 950మిలియన్ల ఆర్ధిక సాయాన్నందించింది. చరిత్రలోనే అతిపెద్ద ఎకనామిక్ స్టిమ్యులెస్ ప్యాకేజీకి కరోనా వైరస్ ఎయిర్ రిలీఫ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా 2ట్రిలియన్ డాలర్ల సాయా న్ని ఆమోదించింది. జీతాలందని ప్రైవేటు ఉద్యోగులందరికీ 2500డాలర్ల చొప్పున నెలవారీ చెల్లిస్తోంది. చిన్న, మధ్యతరహా వ్యాపారులకు 450బిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్నందిస్తోంది. యునైటెడ్ కింగ్డమ్ కూడా తమ దేశ ప్రజలకోసం కరోనా వైరస్ బిజినెస్ ఇంటరాప్షన్ లోన్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. నూతన ఆవిష్కరణలకు 25బిలియన్ల ప్యాకేజీని అందించింది.
ఇటలీ దేశం మార్చిలోనే 25బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో 10.3బిలియన్ డాలర్లను నిరుద్యోగుల ప్రయోజనాలకు కేటాయించింది. స్వయం ఉపాధి మద్దతుకు 5మిలియన్ల మందికి 600డాలర్ల చొప్పున భత్యం అందించింది. కెనడా ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆర్ధిక ప్యాకేజీని అమలు చేస్తోంది. పేద కుటుంబాలకు నెలవారీ 2500డాలర్ల చొప్పున అందిస్తోంది. ఇంట్లో ప్రతి చిన్నారికి 300డాలర్ల చొప్పున అదనంగా ఇస్తోంది. ఇదికాక వృద్దులుంటే మరో వంద డాలర్లందిస్తోంది. ఇలా 90లక్షల మందికి ఈ ఆర్ధిక సాయాన్నందజేస్తోంది. ఇదికాక సబ్సిడీలపై నిత్యావసరాల్ని అందిస్తోంది. విద్యార్ధులందరికీ 1250డాలర్ల చొప్పున ఉపకార వేతనంగా చెల్లిస్తోంది. వికలాంగ విద్యార్ధులకైతే 2వేల డాలర్ల చొప్పున ఇస్తోంది. జాతీయస్థాయి విద్యాసంస్థల్లో విద్యార్ధులకు 5వేల డాలర్ల చొప్పున ఆర్ధిక సాయాన్నందజేస్తోంది. వ్యాపార సంస్థలకు కూడా అందులో పని చేసే ఉద్యోగుల సంఖ్య ఆధారంగా నెలవారీ ఆర్ధిక ప్రయోజనాన్ని అందజేస్తోంది.
బ్రెజిల్ ఇప్పటికే సూక్ష్మ మధ్యతరహా వ్యాపార సంస్థలకు బిలియన్ డాలర్ల ఆర్దికసాయాన్నందించింది. మధ్యతరహా వ్యాపారాలకు 14.9బిలియన్ డాలర్లు అందించింది. స్థానిక సంస్థలు, రాష్ట్రాలకు 17.6బిలియన్ డాలర్ల ఆర్దికసాయం చేసింది. ప్రభుత్వం నుంచి ఆర్ధిక వెసులుబాట్లు రుణాలుపొందిన ఏ పరిశ్రమ లేదా వ్యాపార సంస్థ ఉద్యోగుల్ని తొలగించడానికి వీల్లేదంటూ నిబంధన విధించింది. చిన్న తరహా రైతులకు వంద మిలియన్ డాలర్ల ఆర్ధికసాయాన్నందించింది. దేశంలోని ప్రతి కుటుంబానికి నిత్యావసరాల్ని ఉచితంగా సరఫరా చేస్తోంది.
దక్షిణాప్రికా ఇప్పటికే 800 బిలియన్ల ర్యాండ్స్ విలువైన ఆర్ధిక సాయం అందించింది. ఆరోగ్య విభాగానికి 20బిలియన్ల ర్యాండ్లు ఇచ్చింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు 50బిలియన్ ర్యాండ్లు అందించింది. దేశంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు 350ర్యాండ్ల చొప్పున చెల్లిస్తోంది. మే అనంతరం దీన్ని నెలకు 500ర్యాండ్లకు పెంచుతూ తీర్మానించింది. ఉద్యోగుల్ని తొలగించకుండా కొనసాగిస్తున్న సంస్థలకు 200బిలియన్ ర్యాండ్ల ఆర్ధిక సాయాన్ని అమలు చేస్తోంది. సింగపూర్ ఫిబ్రవరి 18నే 4బిలియన్ డాలర్ల విలువైన ఆర్ధిక ప్యాకేజీని విడుదల చేసింది. మార్చి 26న 48.4బిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని, ఏప్రిల్ 26న 5.1బిలియన్ డాలర్ల ఆర్దిక వెసులుబాట్లనందించింది. దేశంలోని ఉద్యోగులొక్కొక్కరికి 4,600 సింగపూర్ డాలర్లను అందించింది. విమానయాన రంగానికి 75శాతం, ఆహార రంగానికి 50శాతం గ్రాంట్‌గా విడుదల చేసింది. ఉద్యోగుల పరిరక్షణకు 55మిలియన్ డాలర్లను కేటాయించింది.