దాన కర్ణుడి వారసత్వం మనకు రాలేదా?

Did not we get the legacy of Karna

'కరోనా' కూడా ప్రకృతి వైపరీత్యమే
డబ్బున్నవారు మానవత్వం చూపించే తరుణం ఇదే
ఎంత సంపాదించినా ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే

‘ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడి దానగుణాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న వెంటనే ఆయన కర్ణుడి వద్దకు వెళ్లారు. సమయంలో కర్ణుడు అభ్యంగ స్నానానికి సిద్ధం అవుతూ తలకు నూనె రాసుకుంటున్నాడు. ఆయనకు ఎడమ వైపు రత్నాలు పొదిగిన నూనె గిన్నె ఉంది... కుడి చేతిలో నూనె ఉంది. శ్రీకృష్ణుడి దృష్టి నూనె గిన్న మీద పడింది. కర్నా..ఆ గిన్నె ఎంతో బాగుంది. నాకిస్తావా? అని అడిగాడు. వెంటనే కర్ణుడు ఒక్క క్షణం అయినా ఆలోచించకుండా ఎడమ చేత్తో గిన్నె తీసి, తీసుకో కృష్ణా- అని ఇచ్చాడు. దానికి కృష్ణుడు, కర్ణా ఎడమ చేత్తో దానం చేయటం మంచిది కాదని నీకు తెలియదా...అని ఆక్షేపించాడు. దానికి కర్ణుడు, కృష్ణా. నా కుడిచేతిలో నూనె ఉంది. చేయి శుభ్రం చేసుకొని వచ్చి కుడిచేత్తో పట్టుకొని గిన్నె నీకు ఇచ్చే లోపు ఏమైనా జరగవచ్చు. నా ప్రాణాలు పోవచ్చు, లేదా నా ఆలోచన మారిపోవచ్చు. అందుకే అటువంటిదేమీ జరగకుండా వెంటనే నూనె గిన్నె ఇచ్చేశాను. అంతేగానీ ఎడమ చేత్తో దానం ఇవ్వకూడదనే విషయం తెలియక కాదు. ఆహా- దానశీలతలో కర్ణుడిని మించిన వారు లేరు, అని శ్రీకృష్ణుడు సంతోషించాడు…”

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే భరత జాతి ముద్దుబిడ్డలమని, రామాయణ, మహాభారత కావ్యాలు మా వారసత్వ పునాది అని గొప్పలు చెప్పుకునే మన ప్రజలకు కర్ణుడి దాన వారసత్వం వచ్చినట్లు కనిపించటం లేదు. ప్రస్తుత 'కరోనా' కాలంలో ఈ సందేహం రాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కాస్తో కూస్తో దానం చేయగల సత్తా ఉన్న వారంతా 'లాక్ డౌన్' లో ఇంట్లో ఉంటూ సమయం ఎట్లా గడపాలా... అనే ఆలోచన చేస్తున్నారే కానీ, ఈ దేశానికి మనం ఏం చేయగలం, పేద- మధ్యతరగతి ప్రజలను ఏవిధంగా ఆదుకోగలం... అనే ఆలోచన చేస్తున్న వారు అరుదుగా కనిపిస్తున్నారు.

నేను మా బాల్కనీలో మొక్కలు నాటా, మీరు నా ఛాలెంజ్ స్వీకరించి మీరు కూడా మీ బాల్కనీలో మొక్కలు నాటతారా? అని ఒకరు ట్వీట్ విసిరితే, మరొకరు నేను ఇల్లు తుడుస్తున్నా, మీరు కూడా తుడుస్తారా- అని మరొకరు వాట్సాప్ వీడియో పెడుతున్నారు. మరొకరు నేను ఈ రోజు అరటికాయ పచ్చడి చేశా, మీరేం చేశారు. అని మరొక సెలబ్రిటీ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అంతేగానీ దేశం స్థితిగతులను అర్ధం చేసుకోవటం, వివక్ష నుంచి పేదరికం నుంచి అజ్ఞానాంధకారం నుంచి ప్రజలను చైతన్య వంతులను చేద్దామని కానీ, అవసరంలో ఉన్న వారిని ఆదుకుందామని గానీ, మొత్తం బాధ్యతను భుజాన వేసుకొని మోస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడదామని కానీ, తృణమో... పణమో... నేరుగా దానం చేద్దామని కానీ ఆలోచించే వారు మనకు కనిపించటం లేదు. 

'కరోనా వైరస్ వ్యాధి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేస్తున్న విధ్వంసం, సృష్టిస్తున్న కాలుష్యం, తవ్వుతున్న గనులు, నరుకుతున్న అడవులు వల్లే ప్రకృతి వైపరీత్యాలు సంభవించేది. ఒక రకంగా చెప్పాలంటే 'కరోనా' కూడా ప్రకృతి వైపరీత్యమే. ఇష్టానుసారం ప్రయోగాలు చేసి, ఆ ప్రయోగాలు అదుపుతప్పిన ఫలితంగా కరోనా వైరస్ జనం మీద పడింది. దీన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక అగ్ర రాజ్యాలు సైతం తలలు పట్టుకుంటున్నాయి. మనదేశంలో కాస్త నయం. యూకే, రష్యా దేశాల్లో స్వయానా ప్రధానమంత్రులు సైతం కరోనా బారిన పడ్డారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదీ స్పష్టమవుతుంది.

మనదేశంలో 130 కోట్ల జనాభా ఉంటే, అందులో దాదాపు సగం మందికి స్థిరమైన ఆదాయం లేదు. అందులో సగం మంది కటిక పేదలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు తదితర నగరాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు రైలు పట్టాలు పట్టుకొని వేలాది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి సొంత ఊళ్లకు వెళ్లే సాహసం చేశారంటే, వారికి ఎంత కష్టం వచ్చిందో తెలుస్తూనే ఉంది. కరోనా పుణ్యమా అని శ్రమనే నమ్ముకున్న వారి ఉపాధి చక్రం ఆగిపోయింది. నిలువ నీడలేక, ఆకలితో కడుపు నకనకలాడిపోతంటే, ఏం చేస్తారు. పాపం వాళ్లు మాత్రం. సొంత ఊరికి చేరుకుంటే కల్లోగంజో తాగి బతక వచ్చని తాపత్రయం. ఇటువంటి శ్రమజీవుల కష్టాలు చూసినా... మనదేశంలో డబ్బున్న మారాజుల మనసులు కదల్లేదు. మధ్యతరగతి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కదిలి వచ్చి చేతనైనంత సాయం చేస్తున్నారు కానీ తరతరాలుగా తిన్నా తరగనంత ఆస్తులున్న ధనికులు మాత్రం బయటకు రావటం లేదు. కాస్తో కూస్తో కార్పొరేట్ సంస్థలు నయం. సీఎం కేర్స్ నిధికి సీఎస్ఆర్ నిధులను విరాళాలు ఇచ్చాయి. టాటాలు, రిలయన్స్, విప్రో గ్రూపు, మహీంద్రా, బిర్లా, గొడ్రైజ్, పేటీఎమ్  తదితర గ్రూపు సంస్థల నుంచి చిన్న, మధ్యస్థాయి కార్పొరేట్ సంస్థల వరకూ పీఎం కేర్స్ నిధికి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధులకు నిధులు అందించాయి.

ప్రపంచంలోనే భారతదేశం  మొట్ట మొదటి సారి కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ను ప్రవేశపెట్టింది. సీఎస్ఆర్ కింద తమ సంస్థల వార్షిక లాభాల్లో 2 శాతం సొమ్మును స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి. లేని పక్షంలో కొన్ని పెనాల్టీలను ఎదుర్కొనాల్సి వస్తుంది. కార్పొరేట్ సంస్థలు కొంత నయం. పీఎంకెర్స్ నిధికి తన సీఎస్ఆర్ నిధులను విరాళాలుగా ఇచ్చాయి. తప్పనిసరిగా లాభాల్లో 2 శాతం సొమ్ము సీఎస్ఆర్ కింద ఖర్చు చేయాల్సి ఉండటంతో... ఇచ్చాయి. కానీ, వాటికి ప్రజల పై - దేశంపై అంత ప్రేమ ఉంటుందా? అని నిలదీశే వారు కూడా ఉన్నారు. కానీ ఏదో ఒకరకంగా ముందుకు వచ్చి సాయం చేస్తున్నాయి. కాబట్టి వాటిని మెచ్చుకోవలసిందే. కానీ ధనికులు ఆ మాత్రం అయినా చేయలేదుగా, దీన్ని బట్టి మనకు అర్ధం అవుతున్నదేమిటంటే, తప్పనిసరి అయితేనే - మనం సాయం చేస్తామన్నమాట. ఇదేదో బాగానే ఉంది. అటువంటి రూల్స్ మనదేశంలో తీసుకువస్తే పోలా... 

మనదేశంలో ఆస్తి హక్కు ఉంది. అందుకే ప్రజలు ఆస్తులు కూడబెట్టి, తమ వారసులకు ఇచ్చిపోతున్నారు. వారు పనిచేసినా, చేయకపోయినా తల్లితండ్రులు ఇచ్చి వెళ్లిన ఆస్తులతో కాలుకింద పెట్టకుండా కూర్చొని తినిపోతున్నారు. అందువల్ల జనాభాలో కొంతమంది ఎప్పటికీ బద్ధకస్తులుగా ఉండిపోతున్నారు. మనిషనే వాడు ఎవరైనా శ్రమపడి తన కాళ్లమీద తాను బతకాలి. తన అవసరాలు తీరిపోయిన తర్వాత మిగిలిన  సొమ్మును ప్రజలకు, ప్రభుత్వానికి ఇచ్చివేయాలి- అని సామ్యవాదం మనదేశంలో ఎప్పటికైనా వస్తుందా? వస్తుంది. ఎప్పుడంటే ఆస్తి హక్కును సవరిస్తే. ఒక వ్యక్తి తన ఆస్తిపాస్తులు మొత్తాన్ని తన వారసులకు ఇవ్వకుండా కొంతభాగాన్ని అయినా ప్రభుత్వానికి ఇవ్వాలనే నిబంధన తీసుకువచ్చినప్పుడు సాధ్యమవుతుంది. అసలు ఇటువంటి నిబంధన తీసుకువస్తే మన సమాజం ఎంతగానో మారుతుంది. మనిషిలో స్వార్థం తగ్గుతుంది. నానా గట్టికరిచి ఎదుటి వారిని మోసం చేసి లేదా లంచాలు తీసుకొని తరతరాలకు తరగని గని మాదిరిగా ఆస్తులు కూడబెడదామనే దుర్భుద్ధి లేకుండా పోతుంది. ఎంత సంపాదించినా ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే కాబట్టి ఆశ తగ్గి, తన అవసరాలకు సరిపడా సంపాదించి మిగిలిన సొమ్ము ప్రజలకు దానం చేద్దామనే ఆలోచన వస్తుంది. ఈ దిశగా ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.

ప్రపంచంలోని దానకర్ణుల జాబితా చూస్తే... అందులో మనవాళ్ల పేర్లు మచ్చుకైనా కనిపించవు. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, ఫేస్ బుక్ మార్క్ జుకెన్ బర్గ్, అమెజాన్ జెఫ్ బోజన్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, మైఖేల్ డెల్, ట్విట్టర్ జాక్ డోర్సేయ్ , ఇన్వెస్టర్ జార్గ్ సోరెస్, మైఖేల్ బ్లూమ్ బర్గ్... ఇలా అంతా తెల్లవాళ్లే ఉంటారు.  ఎంత కూడబెట్టిన పోయేటప్పుడు ఎత్తుకుపోయేదేమీ లేదని వారికి తెలిసినంతగా మనకు తెలియదేమో. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశం మనది. తత్వ జ్ఞానం ఎన్నో శతాబ్దాల కిందే ఇక్కడ పరిఢవిల్లింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన 'గీత' ను రేడియోల్లో వినటమే కానీ దాన్ని ఆచరించటం తెలియని మనుషులుగా మారిపోయాం మనం. తూర్పు ఐరోపా నుంచి భారతదేశం పశ్చిమ ప్రాంతం వరుస విజయాలతో జగజ్జెత అనిపించుకున్న గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన చేతులు బయటకు కనిపించే విధంగా పెట్టి సమాధి కట్టారు. జీవితాంతం ఎంత సాధించినా తీసుకుపోతుంది ఏమీ లేదని ప్రజలకు చెప్పటానికి అలా చేశారు. దీన్ని అమెరికా, ఐరోపా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టే ఆ దేశాల నుంచి దానధర్మాలు చేసే వారు అధికంగా ఉంటున్నారు. అసలు సేవ, దానగుణం అనేది తెల్లవాళ్ల రక్తంలోనే ఉందనిపిస్తుంది. వాళ్ల మత విశ్వాసాల్లో, ఆచార వ్యవహారాల్లో, జీవన విధానంలో... ఎదుటి వారికి సేవ చేయటం, సాయపడటం... అండగా నిలవటం అనేది ఒక తప్పనిసరి గుణంగా కనిపిస్తుంది. అటువంటి ఆలోచన కానీ, అలవాటు కానీ మనకు లేకపోవటం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. దానికి తగ్గట్లుగా ఆ దేశాల్లోన్ని కొన్నింటిలో  వారసత్వపు పన్ను అమల్లో ఉంది. ఒక వ్యక్తి ధనికుడు అయితే, అతినికి నిర్దిష్టమైన పరిమితికి మించి సొమ్ము ఉంటే అందులో దాదాపు సగభాగం అతను చనిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెందుతుంది. మిగిలిన సగభాగం మాత్రమే ఆయన వారసులకు దక్కుతుంది. దీనివల్ల వారు తాము బతికి ఉండగానే దానధర్మాలు అధికంగా చేసే పరిస్థితి ఏర్పడింది.

ఆక్స్‌ఫామ్‌  రీసెర్చ్ నివేదిక ఇచ్చిన ప్రకారం " భారత్ దేశం లో అరవైమూడు మంది బిలియనీర్ల యొక్క  సంపద విలువ మన దేశం ఫిస్కల్ బడ్జెట్ 2018-2019 ( 24,42,200 కోట్లు) కంటే ఎక్కువ ." మన దేశంలోని అత్యంత ఐశ్వర్యవంతుల సంపద 39 శాతం వృద్ధి చెందగా, జనాభాలో సగ భాగం సంపద 3 శాతమే పెరిగింది. భారత్‌లో అత్యంత పేదలైన 13.6 కోట్ల మంది (జనాభాలో పది శాతం) 2004 నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయే ఉన్నారు. సామాన్యులు రోజుకు రూ.500 సంపాదించడమే కష్టం. అలాంటిది దేశంలోని కుబేరులు సంపద రోజుకు రూ.2,200 కోట్లు పెరిగింది. 2022 నాటికి భారత్‌లో రోజుకు 70 మంది కొత్త కుబేరులు పుట్టుకొస్తారని అంచనా. గత ఏడాది కొత్తగా 18 మంది బిలియనీర్లు అవతరించారు. దీంతో దీంతో భారత్‌లోని బిలియనీర్ల సంఖ్య 119కు పెరిగింది. వీరందరి సంపద తొలిసారిగా గత ఏడాది 40,000 కోట్ల డాలర్లు (రూ.28 లక్షల కోట్లు)కు పెరిగింది. భారత్‌లో ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. జనాభాలో సగం మందికి కనీస అవసరాలు తీరడం లేదని ఆక్స్‌ఫామ్‌  రీసెర్చ్ పేర్కొంది.

కొద్ది మంది మనదేశంలోనూ లేకపోలేదు.....

* రూ. 1500 కోట్లు ఇచ్చిన రతన్ టాటా, అవసరం అయితే నా ఆస్తినంతా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నా- అన్నారు. ఇంతకంటే గొప్ప మనసు వేరేవరికైనా ఉంటుందా.

* బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, నిజజీవితంలోనూ హీరోనే. కొవిడ్-19 పై పోరాటానికి రూ.25 కోట్లు ఇచ్చారాయన. ఇంత పెద్దమొత్తంలో పీఎం కేర్స్ నిధికి విరాళం ఇచ్చిన సెలబ్రిటీ మరొకరు లేరు. "నేను జీవితాన్ని ప్రారంభించినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఆ స్థితి నుంచి నేను ఎంతో కొంత దానం చేయగల స్థాయికి వచ్చాను. ఒకప్పుడు నేను ఉన్న స్థితిలో ఇప్పుడున్న వారి కోసం ఆ మాత్రం సాయం చేయలేనా...' అని స్పూర్తిదాయకమైన రీతిలో ఆయన ట్వీట్ చేశారు. 

* గుప్తదానాలు చేయటంలో, ఏదైనా స్వయంగా ముందుండి అండగా నిలబడటంతో విప్రో గ్రూపు అధిపతి అజీం ప్రేమ్ జీ అందరికీ ఆదర్శం. తన జీవితంలో ఆయన ఇంతవరకూ వివిధ సందర్భాల్లో 21 బిలియన్ డాలర్ల మేరకు దానాలు ఇచ్చారు. 2019 లో ఆసియలోనే నెంబర్ వన్ పరోపకారిగా  ఆయన ఒక చరిత్ర సృష్టించారు.

మానవ సేవే మాధవ సేవ- అన్నారు. కానీ మనం దానికి పూర్తిగా భిన్నం. గుల్లో పూజలకు, ఊరేగింపులకు, ఉత్సవాలకు ఎంత సొమ్మెనా ఇస్తాం. కానీ ఆకలితో ఉన్న వాళ్లను మాత్రం పట్టించుకోం. అందుకే మనం దానగుణంలో వెనుకబడిపోయాం. ఈ విషయంలో ఇతర దేశాలు ఎంతో ముందున్నాయి. కేవలం ధనిక దేశాలే కాదు. మనకంటే లేదా మనస్థాయిలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఈ విషయంలో పెద్ద మనసు కలిగి ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు ...

ఫిలాంత్రోపీ (దాన గుణం) అనేది అమెరికా రాజ్యాంగంలోనే ఉంది. దాని ప్రియామబులో న్యాయం. ప్రజా సంక్షేమం, స్వేచ్ఛ పునాదులుగా అమెరికా సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశాన్ని ప్రస్తావించారు. 2018 గివింగ్ యూఎస్ఏ నివేదిక ప్రకారం అంతకు ముందు ఏడాది కాలంలో అమెరికా ప్రజలు సేవా కార్యక్రమాల కోసం 410 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. దానగుణం ఉన్న ప్రజలు అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత స్థానాల్లో మ్యాన్మర్, న్యూజీల్యాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, శ్రీలంక, ఇండోనేషియా ఉన్నాయి.

ఆఫ్రికాలో అత్యంత దానగుణం ఉన్న దేశం కెన్యా. ఒక అపరిచితుడు ఎదురొస్తే, సాయం చేయటానికి కెన్యాలో 68 శాతం మంది ప్రజలు ముందుకు వస్తారు. " గల్ఫ్ దేశాల్లో యునైటెడ్ ఘోరబ్ ఎమిరేట్స్ ప్రజలు ఎదుటివారికి ఏదైనా చేయాలని తహతహ లాడతారు. చివరికి మనకు పొరుగున ఉన్న దాల్యాండ్ కూడా దాన సూచీ (డొనేషన్ ఇండెక్స్)లో ఎంతో ముందు స్థానంలో ఉంది.

* 128 దేశాల ఈ సూచీలో మనదేశం 8వ స్థానంలో ఉంది. ఈ విషయంలో పాకిస్థాన్, నేపాల్ కంటే కూడా మనం వెనుకబడే ఉన్నాం.

*  డబ్బున్న వారే దానం చేయగలరని అనుకోవటం పొరపాటు. దానం చేయటం అనేది గుణం మీద ఆధారపడి ఉంటుంది. పర్సు మీద కాదు. మ్యాన్మర్, శ్రీలంక, ఇండోనేషియా దేశాలను ఐక్యరాజ్యసమితి లోయర్- మిడిల్- ఇన్కమ్ దేశాలుగా పేర్కొంది. అయినా ఆ దేశాలు దాన సూచీలో ఎంతో ముందు ఉన్నాయి. తెరవేద బుద్ధిజాన్ని శ్రీలంక, మయన్మార్ దేశాలు అనుసరిస్తున్నాయి. దీనివల్ల దానం చేయటం అనేది ఆ దేశాల్లో మత, సాంస్కృతిక ఆచారంగా నిలిచిపోయింది.

* ఎదుటి వారికి చేతనైనంత సాయం చేయటం మనకు ఎంతో మానసిక సంతృప్తినిస్తుంది. దానివల్ల మనసు తేలిక | పడుతుంది. సంతోషం కలుగుతుంది. ఈ ప్రంచంలో అత్యంత సంతోషంగా జీవించే దేశం నెదర్లాండ్స్ 2019 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ - ప్రకారం ఈ దేశం నెంబర్ వన్ దేశం. ఆ దేశ ప్రజల్లో సగానికి పైగా ప్రజలు దానం చేయటాన్ని మించిన సంతోషం మరొకటి లేదని భావిస్తారు.

కష్టాల్లో ఉన్న మనిషికి, తోటి మనిషి సాయపడకపోతే... ఇక జీవితానికి అర్థం ఏముంటుంది. కాస్తో కూస్తో డబ్బున్నవారు మానవత్వం చూపించే తరుణం ఇదే కదా. రాజకీయ నాయకులైనా, సినీ ప్రముఖులైనా, అగ్రశ్రేణి వ్యాపారస్తులైనా... వారు ఎంచుకున్న రంగాల్లో ఘన విజయాలు సాధించి ఉండవచ్చు. తరగని ఆస్తులు కూడబెట్టి ఉండవచ్చు. కానీ ఏమి లాభం. ఎల్లకాలం ఎవరికైనా గుర్తుంటారా ?. పది మందికీ సాయపడి వారు మెచ్చుకుంటేనే కదా, ఎవరికైనా శాశ్వత కీర్తి దక్కేది. ప్రస్తుత పరిస్థితుల్లో... మధ్యతరగతి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కదిలి వచ్చి చేతనైనంత సాయం చేస్తున్నారు. కానీ తరతరాలుగా తిన్నా తరగనంత ఆస్తులున్న కొందరు మాత్రం బయటకు రావటం లేదు.

ఎదుటివారికి సాయపడకుండా ఏ వ్యక్తి ధనవంతుడు కాలేడు- అని ప్రముఖ అమెరికా ఫిలాంత్రోఫిస్ట్ అండ్రూ కార్నేజ్ అన్నారు. ఈ మధ్య వచ్చిన మహేష్ బాబు సినిమా ఒకదాంట్లో కూడా ఇదే విషయాన్ని మనసుకు హత్తుకునేట్లు చెప్పారు. శ్రీమంతుడు- ఆ సినిమా. అందులో ఒక డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. “రేయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయ్యాలి, లేకపోతే లావైపోతారు" అనే డైలాగ్. ఈ సినిమా చూసి ఆహా, ఏం సినిమా - అన్నారు. ఈ డైలాగ్ ను పదేపదే వల్లె వేస్తూ, ఏం చెప్పాడురా మహేష్ బాబు, అన్నారు. అంతేగాక దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పల్లెటూళ్ల అభ్యున్నతికో, పేద ప్రజల ప్రగతికో, లాభసాటి వ్యవసాయానికో... నడుంకట్టిన వాళ్లు లేరు. ఎదుటివారికి ఏదైనా ఇవ్వటం... అనే దానగుణాన్ని మన సంస్కృతిలో భాగంగా చేర్చుదామని, దాన్ని అలవాటుగా మార్చుకుందామని ఆలోచించే వారు అరుదుగా కనిపించే సమాజంలో మనం బతుకుతున్నాం. మనం - ఇస్తా ఉంటే, మనకు వస్తూ ఉంటుంది- అనే నిజం తెలీకుండా కాలం గడుపుతున్నాం. ఈ కఠోర వాస్తవాన్ని, కరోనా వైరస్... మనందరికీ స్పష్టంగా చెబుతోంది. ఇకనైనా మనం మారదామా.

ఎల్.మారుతీ శంకర్, మేనేజింగ్ డైరెక్టర్
7సీస్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్. 98494 55777

 


                    Advertise with us !!!