
అమెరికాలోని తెలుగు చిన్నారులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం సూచించిన సిలబస్‌తో తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ వసంతోత్సవం మే9వ తేదీన ఆన్లైన్లో వైభవంగా జరిగింది. బే ఏరియాలో ప్రతి సంవత్సరం జరిగే పాఠశాల వసంతోత్సవ వేడుకలను తిలకించేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతుంటారు. విద్యార్థులతోపాటు, విద్యార్థుల తల్లితండ్రులు, టీచర్లు, నిర్వాహకులు వైభవంగా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తాయి. దానిని తిలకించేందుకు ఎంతోమంది ఈ కార్యక్రమానికి వస్తుంటారు. గతంలో జరిగిన వసంతోత్సవ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సినీ గేయరచయిత, కవి జొన్నవిత్తుల, చంద్రబోస్‌తోపాటు యాంకర్ సుమ, 2018వ సంవత్సరంలో అప్పటి ఎపి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరై ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి వసంతోత్సవం నిర్వహించలేని పరిస్థితుల్లో బే ఏరియా పాఠశాల నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా వసంతోత్సవ వేడుకలను చేద్దామని చెప్పడం, అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేయడంతో మే 9వ తేదీన ఆన్లైన్ ద్వారా వసంతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ, తెలుగు నేర్పించడంలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందని, తానా ఆర్గనైజేషన్‌లో దీనిని ఓ విభాగంగా ఏర్పాటు చేసుకుని వివిధ చోట్ల పాఠశాల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆన్లైన్లో జరిగిన వసంతోత్సవంలో ఫ్రీమాంట్, శాన్‌రామన్ పాఠశాల విద్యార్థులు పాల్గొని వివిధ రకాల కార్యక్రమాలను ప్రదర్శించారు. విద్యార్థులంతా వారి వారి ఇళ్ళలోనే ఉండి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడం ఆకట్టుకుంది. కొంతమంది విద్యార్థులు తెలుగు పద్యం ఆలపిస్తే, మరికొందరు కవితలు చెప్పారు. జోక్స్ లు కొందరు చెప్పారు. ఇద్దరు విద్యార్థులు వేర్వేరు చోట్ల ఉండి ప్రదర్శించిన నాటక అలరించింది. ఇలా ఎన్నో కార్యక్రమాలతో విద్యార్థులు అందరినీ మైమరపింపజేశారు.
ఈ కార్యక్రమంలో తానా తరపున పాల్గొన్న నాగరాజు నలజుల మాట్లాడుతూ, పాఠశాలకు తానా పూర్తిస్తాయి మద్దతును ప్రకటించిందని చెప్పారు. తానా ఆధ్వర్యంలో పాఠశాలను మరింతగా ముందుకు తీసుకెళుతామని చెప్పారు.
తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలన్ని చూసిన తరువాత పాఠశాల 7 సంవత్సరాలుగా తెలుగు చిన్నారులకు తెలుగుభాషను సులువుగా బోధిస్తోందని అర్థమవుతోందని చెప్పారు. ఆన్లైన్లో పిల్లలు ఇంత చక్కగా తల్లితండ్రులు, టీచర్లు ఇచ్చిన తర్పీదుతో చక్కగా కార్యక్రమాలను ప్రదర్శించారని అభినందించారు.
పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, పాఠశాలకు ఇప్పుడు మంచిరోజులు వచ్చాయని, తానా యాజమాన్యం చేతుల్లోకి పాఠశాల వెళ్ళిన విషయం తెలిసిందేనని చెప్పారు. ఇప్పుడు తానా యాజమాన్యం పెద్ద టార్గెట్‌ను పెట్టుకుందని, దాదాపు 50 నగరాల్లో పాఠశాల కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మన టీవీలో టెలికాస్ట్ చేస్తున్నందుకు మన టీవీ సీఈఓ శ్రీధర్ చిల్లర గారికి పాఠశాల తరపున చెన్నూరి వెంకట సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాల డైరెక్టర్ రమేష్ కొండ మాట్లాడుతూ పిల్లలు చేసిన చక్కని ప్రదర్శనలు మరింత కష్టపడటానికి శక్తి ని ఇచ్చాయి అన్నారు. తానా బే ఏరియా నాయకులు వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, బాటా వైస్ ప్రెసిడెంట్ హరి చికోటి తదితరులు కూడా మాట్లాడారు.
పాఠశాల డైరెక్టర్ ప్రసాద్ మంగిన మాట్లాడుతూ పాఠశాల వసంతోత్సవం ఇంత విజయవంతం చేసినందుకు టీచర్లకు, పిల్లలకు, తల్లి తండ్రులకు అభినందనలు తెలిపారు.
ఫ్రీమాంట్ సెంటర్ పిల్లల ప్రదర్శనలను శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి కో ఆర్డినేషన్ లో టీచర్లు సునీత రాయపనేని, జస్వంతి మండలి, పద్మ విశ్వనాథ్, దీపిక లు పాఠశాల పిల్లలతో, వారి తల్లి తండ్రులతో మాట్లాడుతూ వారి చేత చక్కని కార్యక్రమాలు చేయించారు. అదే విధంగా శాన్ రామన్ సెంటర్ నుంచి కల్యాణి చికోటి, శ్రీదేవి ఎర్నేని ల కోఆర్డినేషన్ లో టీచర్లు సత్య బుర్ర, అర్చన బూరెడ్డి,మమత ఆవుల లు తమ సెంటర్ పిల్లల చే చక్కని ప్రదర్శనలు ఇప్పించారు.
పాఠశాల డైరెక్టర్ ప్రసాద్ మంగిన, అడ్వయిజర్ విజయ ఆసూరి, పాఠశాల కరికులం డైరెక్టర్ డా. గీతామాధవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మరో అడ్వయిజర్ వీరు ఉప్పల బ్యాక్ ఎండ్ మొత్తం చూశారు. మనటీవీ లో కూడా ఈ వసంతోత్సవం లైవ్ గా కవరేజ్ చేశారు.