లాక్ డౌన్ వ్యూహం వికటించినట్లేనా?

Is that a lock down strategy

ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి విషయంలో వేసిన తప్పటడుగులు వేయకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరైన సమయంలో లాక్‍ డౌన్‍ విధించి దేశంలో కరోనా వైరస్‍ను కట్టుదిట్టం చేశారన్న వార్తలు నిన్నటి వార్తలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేడు లాక్‍ డౌన్‍ నిబంధనలు సడలిస్తూ మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపడంతో ఇన్నాళ్ళు లాక్‍ డౌన్‍ పేరుతో ఇంట్లోనూ ఉంటూ వైరస్‍ను వ్యాపింపజేయకుండా ప్రభుత్వానికి సహకరించినవారు మద్యంకోసం వీధుల వెంట పరుగులు తీశారు. ఒకరినొకరు తోసుకుంటూ, భౌతిక దూరం పాటించకుండా మందుకోసం ఎగబడుతున్నారు. మరోవైపు వలస కార్మికుల విషయంలో కూడా కేంద్రం అనుసరించిన నిర్లక్ష్య వైఖరి నేడు అన్నీ రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపుతోంది.

తొలుత కరోనా వైరస్‍ విషయంలో కనపడని శత్రువుతో యుద్ధం చేసినట్లు ప్రజలంతా ఐక్యంగా నిలబడి విభేదాలు పక్కనబెట్టి ప్రధాని మోదీ ఇచ్చిన లాక్‍డౌన్‍ను జయప్రదం చేశారు. కాకపోతే మనదేశం పాశ్చాత్య దేశాల్లోగా పారిశ్రామికంగా అభివ•ద్ధి చెందిన దేశం కాదు కాబట్టి లాక్‍ డౌన్‍ ను నిరవధికంగా చేయలేని పరిస్థితి ఉంది. దానికితోడు కోట్లాది మంది వలస, అసంఘటిత కార్మికులకు సరైన కనీస వసతులులేని పరిస్థితి దేశంలో ఉంది. ఇలాంటి సమయంలో వారి విషయంలో సరైన అవగాహనతో ముందు నుంచి పథకం ప్రకారం వెళ్ళి ఉంటే లాక్‍ డౌన్‍ వ్యూహం సఫలమై ఉండేది. లాక్‍ డౌన్‍ విధించిన తరునాత కాంట్రాక్టర్లు అంతా కూలీలను పట్టించుకోవడం మానేశారు. దాంతో కార్మికులకు పనిలేకుండా పోయింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా ప్రతి వ్యక్తికి/ కుటుంబానికి ఆర్థికసాయం, ఆహార వస్తువులు అందిస్తామని ఎవరికీ పస్తులతో అలమటించే పరిస్థితిని రానీయమని ప్రధానమంత్రి మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు బహిరంగంగా ప్రకటించారు. మనదగ్గర ఆహారధాన్యాల నిల్వలు 5.5లక్షల టన్నులు గిడ్డంగుల్లో ఉన్నాయి. ఇంకో నెలలో 2 లక్షల టన్నుల ధాన్యం గోడౌన్లలో చేరుతుంది. ఈ ఆహారధాన్యం నుండి ప్రతి కుటుంబానికి 20కేజీల ఆహారధాన్యాలు 3నెలలపాటు ఇచ్చినా ఇంకా మూడొంతుల ఆహారధాన్యం గిడ్డంగుల్లో ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 36 రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసేందుకు కనీసంగా 7 లక్షల కోట్లు ఖర్చని అంచనా. ఒక్క కేరళ రాష్ట్రం మాత్రమే ప్రతి ఇంటికి 19 రకాల ఆహార వస్తువులు 5000 రూపాయలు ఇళ్లకే పంపించింది. ప్రపంచంలోనే కరోనా వైరస్‍ను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను కాపాడింది కేరళ రాష్ట్రమని అందరూ అంగీకరిస్తారు. అలాగే పేదలను పట్టించుకోవడంలో కూడా కేరళ శ్రద్ధ చూపించింది.

 

లాక్‍ డౌన్‍ పిలుపును మోదీ అంటే గిట్టనివారు కూడా ఆమోదించారు. అలా ఎందుకు చేశారు? వైద్యంలేని జబ్బుతో పోరాడాలంటే ప్రధాని సందేశం అమలు చేయాలని దేశభక్తియుతంగా అంగీకరించారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో ‘కరోనా’ వైరస్‍ నిలువరించడంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం బహు భేష్‍ అని అందరూ భావించారు.  మరోవైపు మన ప్రజల్లో సహజ వ్యాధి నిరోధక శక్తి ఉండటం వల్ల దానితో పాటు లాక్‍డౌన్‍ కారణంగా కరోనాను మొదట్లో ఎక్కువగా విస్తరించనీయకుండా కట్టుదిట్టం చేశారు. కాని అదే సమయంలో వైద్యులకు అవసరమైన పరికరాలు, టెస్టింగ్‍ సౌకర్యాలు పెద్దగా సమకూర్చుకోలేకపోవడంతో ఉన్నవాటితోనే చాలాచోట్ల సరిపెట్టుకుని వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైద్యులకు అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకుంటున్నామని ప్రకటించాయి.

లాక్‍డౌన్‍ ప్రకటించే సమయంలోనే రోజువారి కూలీలపై ఆధారపడిన వలస కార్మికులపై అవగాహన లేకపోవడంతో వారంతా కూలీ డబ్బుల్లేకుండా ఇబ్బందుల్లో పడ్డారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారు చేసేదేమిలేక తమ ఊరికి పయనమయ్యారు. చివరకు ఆకలిచావులకు, సుదూర కాలినడకకు గురైన ప్రజలు దాదాపు 60%--%70మంది చనిపోయారు. 4-5వందల కిలోమీటర్ల్లు కాలినడకన భార్యాబిడ్డలతో కదిలారు. చివరకు సహనం కోల్పోయిన వలస కార్మికులు సూరత్‍, ముంబై, హైదరాబాద్‍ తదితర పట్టణాలలో తిరగబడ్డారు. అప్పటికిగానీ కేంద్ర ప్రభుత్వం వీరి విషయంలో ఏమి చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంది. వలసకార్మికులను వారి స్వస్థలాలకు పంపమని కేందప్రభుత్వం ఆదేశించింది. వివిధ రాష్ట్రాలలోనున్న లక్షలాది మంది కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయలేక రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. లాక్‍డౌన్‍ ముందుగానీ, ప్రకటించిన తక్షణమే గానీ ఈ తరలింపు జరిగుంటే అటు కార్మికులకుగానీ, నిర్మాణ సంస్థలకుగానీ ఉపయోగం ఉండేది. ఇప్పుడు ఈ పక్రియ ‘‘రెండింటికీ చెడ్డరేవడి’’గా దాపురించింది. కేంద్ర ప్రభుత్వం ముద్దాయిగా నిలబడింది.

మరోవైపు ఈ కరోనా విషయంలో ఇప్పుడు తామేమి చేయలేమని కరోనాతో కలిసి జీవించమంటూ ప్రభుత్వాధినేతలు, రాజకీయనాయకులు బాధ్యతారహితంగా మాట్లాడటం మొదలెట్టారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కావాలని కేంద్రాన్ని గట్టిగా అడగటంతో చేసేదేమీ లేక మద్యం అమ్ముకోమంటూ సలహా ఇచ్చారు. దాంతో అన్నీ రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధప్రదేశ్‍, ఉత్తరప్రదేశ్‍, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఆగమేఘాలపై యుద్ధప్రాతిపదికన మద్యం షాపులు తెరిచేశాయి.  మద్యం రేట్లను కూడా అమాంతం పెంచేశాయి. మద్యం అలవాటు ఉన్నవాళ్ళు ఇన్నాళ్ళు తాము పడ్డ జాగ్రత్తలన్నీ మరచి మద్యం షాపుల ముందు ఆడ, మగ తేడాల్లేకుండా నిలబడి మద్యాన్ని సంపాదించుకున్నారు. వారిలో కరోనా వైరస్‍ గురించి భయం లేదు. ప్రభుత్వాలు కూడా నిన్నటివరకు కరోనా వైరస్‍ను కట్టుదిట్టం చేయాలని చెప్పి, నేడు దాంతో సహజీవనం తప్పుదు అని చేతులెత్తేస్తున్నాయి. ఇన్నాళ్ళు ప్రాణాలకు తెగించి సమాజాన్ని కాపాడిన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు నేడు అందరూ రోడ్డు మీదకు వచ్చేయడంతో ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. దీంతో ప్రధాని విధించిన లాక్‍ డౌన్‍ వ్యూహం సఫలమైనట్లా, విఫలమైనట్లా?.

-గోవింద్‍

 


                    Advertise with us !!!