మోదీ కరోనా వ్యూహం...రాష్ట్రాలన్నీ కేంద్రం చేతుల్లోకి

Modi corona strategy the states are in the hands of the Center

కరోనా వైరస్‍ మానవ జీవితాలను కట్టుదిట్టం చేసినట్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన మాట వినని రాష్ట్రాలను తన చెప్పుచేతుల్లోకి తీసుకువచ్చేలా కరోనా వ్యూహాన్ని అమలు చేసి సక్సెస్‍ అయ్యారు. విభిన్నమైన వైఖరులతో కేంద్రం మాటను ఖాతరు చేయకుండా తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న రాష్ట్రాలను మోదీ తనదైన వ్యూహంతో కట్టడి చేయగలిగారు. కేంద్రానికి ఉన్న ఆర్థిక శక్తిని గమని రాష్ట్రాలు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో పడ్డాయి. దీంతో లాక్‍డౌన్‍ నేపధ్యంలో పేదలకు, వలస కూలీలకు ఆహార, ఆర్థిక భరోసాను కేంద్రం నేరుగా కల్పించింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అర్హులందరికీ నేరుగా బ్యాంక్‍ ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది. తద్వారా కేంద్రం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తన హోదాను మరింత పటిష్టం చేసుకుంది. నెహ్రూ, ఇందిరల తర్వాత ఈ స్థాయిలో కేంద్రం బలంగా రూపుదిద్దుకోవడం ఇప్పుడేనని అంటున్నారు.

కరోనా వైరస్‍ ఓ విధంగా కేంద్ర ప్రభుత్వానికి మేలు చేసింది. కరోనా నియంత్రణ చర్యలతో కేంద్రం మరింత బలంగా ఆవిర్భవించింది. భారత రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కొన్ని హక్కులున్నాయి. పలు అంశాల్లో రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే వెసులు బాటుంది. అయితే జవహర్‍లాల్‍ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ కాలం వరకు కేంద్రం, రాష్ట్రాల్లో ఒకే పార్టీ పాలన సాగింది. దీంతో కేంద్ర ఆదేశాలకు రాష్ట్రాలు బద్దులై ఉండేవి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా ఉండేది. అపరిమిత హక్కుల్ని అనుభవించేది. ఏ విషయంలోనైనా రాష్ట్ర పాలకులు కేంద్రంవైపే చూసేవారు. పరిస్థితులు మారాయి. దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరిగింది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకొచ్చాయి. కేంద్రంలోనూ ఏకపార్టీ పాలనకు కాలం చెల్లింది. కూటముల వ్యవస్థ మొదలైంది. వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారాన్ని చెలాయించడం ప్రారంభించాయి. వీటిలో కూడా ప్రాంతీయ పార్టీలు కీలకం. దీంతో కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా బలంగా మారాయి. కేంద్రం చేసిన ప్రతి నిర్ణయానికి రాష్ట్రాలు తలొంచడం మానేశాయి. స్వతంత్ర నిర్ణయాల్తో ముందుకెళ్ళడం మొదలెట్టాయి. రాన్రాను కొన్ని రాష్ట్రాలు కీలకమైన ఆర్ధిక, సైనిక వ్యవహారాలు తప్ప పలు అంశాల్లో స్వతంత్ర నిర్ణయాలకే ప్రాధాన్యతనివ్వడం మొదలైంది. దీన్ని కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు సఫలంకాలేదు. కాగా 2014లో పేరుకు ఎన్‍డిఎ కూటమి అయినా బిజెపి స్వతంత్రంగా ప్రభుత్వాన్నేర్పాటు చేయగలిగే స్థాయిలో సీట్లు పొంది అధికారంలోకొచ్చింది. మోదీ ప్రధానమంత్రి అయ్యారు. బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

 

రాష్ట్రాల తీరుతెన్నులపై స్పష్టమైన అవగాహన కలిగిన మోడి మొదట్నుంచి రాష్ట్రాల్ని తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే దీర్ఘకాలంగా పెండింగ్‍లో ఉన్న జిఎస్‍టి బిల్‍ను అమల్లోకి తెచ్చేశారు. దీంతో రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థంతా నేరుగా కేంద్రం గుప్పెట్లోకెళ్ళింది. పన్నుల వసూళ్ళ బాధ్యత రాష్ట్రాలకు పరిమితంగానే మిగిలింది. తమ రాష్ట్రాలకు చెందిన పన్నుల్ని తిరిగి తమ ఖాతాల్లో జమ చేయించుకునేందుకు కేంద్రాన్ని అభ్యర్ధించాల్సిన పరిస్థితి రాష్ట్రాలకొచ్చింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలింకా ధిక్కారణ ధోరణిని కొనసాగించాయి. ఈ దశలో కేంద్రానికి కరోనా నేపథ్యం గొప్పగాకలిసొచ్చింది. ఇదొక అంతర్జాతీయ సమస్య. ఏ రాష్ట్రానికా రాష్ట్రం సొంతంగా నియంత్రణ, చికిత్సా విధానాలు పాటించేందుకు వీల్లేకుండా పోయింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన విధానాల్ని కేంద్రం ఆదేశాలకనుగుణంగా ఆచరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశంలో కరోనా మొట్టమొదట కేరళలో మొదలైంది. అయితే ఆ రాష్ట్రం కరోనాను పకడ్బందీగా కట్టడి చేయగలిగింది. దీంతో కేంద్రం కంటే తామే సమర్ధులమన్న భావం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడింది. మార్చి 24న కేవలం 4గంటల ముందు నోటీసుతో దేశవ్యాప్తంగా ప్రధాని 21రోజుల లాక్‍డౌన్‍కు పిలుపునిచ్చారు. అప్పటికి కరోనా భయంతో ఉన్న రాష్ట్రాలన్నీ మారుమాట్లాడలేదు. కానీ దీన్ని ఏకపక్ష నిర్ణయంగా కొన్ని రాష్ట్రాలు విమర్శలు గుప్పించాయి. అందుకే రెండో విడత కొనసాగింపునకు ముందు మోడి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారందరి అభిప్రాయాల్ని స్వీకరించారు. అయితే తుదకు తన సొంత అభిప్రాయాన్నే ఆయన ఆచరణలో పెట్టారు. మరోసారి లాక్‍డౌన్‍ ప్రకటించారు. ఈ సారి 19రోజులు దేశాన్ని దిగ్భందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటికే కేసుల నమోదు తగ్గుముఖం పట్టడంతో కేరళ కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇది జాతీయ స్థాయి నిర్ణయానికి విరుద్దం. సహజంగానే అక్కడున్న వామపక్ష ప్రభుత్వానికి మోడి పొడగిట్టదు. ఆయన నిర్ణయాన్ని సమర్ధించేందుకు మనసొప్పదు. ఈ కారణంగానే జాతీయ స్థాయిలో లాక్‍డౌన్‍ను కూడా పక్కనపెట్టి సొంతంగా వెసులుబాట్లకు అవకాశమిచ్చింది. దీనిపై సహజంగానే కేంద్రానికి ఆగ్రహం ముంచుకొచ్చింది. ఒక్క చోట లాక్‍డౌన్‍ విఫలమైనా జాతీయ స్థాయిలో దాని ప్రభావముంటుంది. ఇంతకాలం చేసిన ప్రయత్నాలు వ•ధా అవుతాయి. కేరళ తీరును కేంద్రం సీరియస్‍గా తీసుకుంది. వెంటనే లాక్‍డౌన్‍ అమలు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో కేరళ దిగిరాక తప్పలేదు. ఒకప్పుడు కేంద్ర ఆదేశాల్ని ఏదో విధంగా పక్కదారి పట్టించేందుకు రాష్ట్రాలు ప్రయత్నించేవి. ఇందుక్కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న పార్టీలకు వివాదాలుండడమే. వారి పెత్తనాన్ని వీరు ఆమోదించేందుకు అంగీకరించకపోవడమే. అలాగే పశ్చిమబెంగాల్‍లో కూడా మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కేంద్ర ఆదేశాలపై అసమ్మతిని వెలిబుచ్చినా చివరకు తమ ఆదేశాలను పాటించేలా కేంద్రం చేయగలిగింది. ఇలా విపక్షాల ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలను తన దారిలోకి నరేంద్ర మోదీ తీసుకువచ్చి బలమైన నాయకుడు తానేనని మరోసారి నిరూపించారు.

 


                    Advertise with us !!!