
సుదీర్ఘ లాక్డౌన్ నుంచి అంచెలంచెలుగా బయటపడేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. కోవిడ్ 19 నియంత్రణ చర్యల్లో భాగంగా దేశాలన్నీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. కాగా ప్రపంచంలోనే అత్యధిక ప్రభావాన్ని చవిచూసిన ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో అంటువ్యాధుల సంక్రమణ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దీంతో లాక్‌డౌన్‌ను ఉపసంహరించాలన్న నిర్ణయానికొచ్చాయి. నెమ్మదిగా వ్యాపార సంస్థలు, పరిశ్రమల్ని ప్రారంభించాలని నిర్ణయించాయి. అమెరికా తర్వాత ఈ మూడు దేశాలే కోవిడ్ బారిన ఎక్కువగా పడ్డాయి. ఇక్కడే రోగులతోపాటు మరణాల సంఖ్య అధికంగా నమోదైంది. అయితే ఉపసంహరణకు సంబంధించి ఒక్కో దేశం ఒక్కో రకమైన ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అమెరికాలో కొన్ని రాష్ట్రాలిప్పటికే నిబంధనల్ని సడలించాయి. మరికొన్ని లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా లాక్డౌన్ పకడ్బందీగా అమలౌతోంది.
అమెరికా తర్వాత యూరోప్ దేశాలే ఎక్కువగా ఈ ప్రభావాన్ని చవిచూశాయి. ఇటలీ ప్రపంచ ప్రధాన హాట్‌స్పాట్‌ల్లో ఒకటిగా అవతరించింది. మార్చి 9నే అక్కడే కఠినమైన లాక్డౌన్ అమల్లో పెట్టారు. యూరోప్‌లో తొలిసారిగా లాక్డౌన్ అమలు చేసింది ఇటలీనే. మార్చి చివరినాటికి ఇటలీలో కోవిడ్ 19 సంక్రమణ వ్యాప్తి వేగం తగ్గింది. ప్రస్తుతం అక్కడ రోగులు కోలుకుంటున్నారు. ఇటలీ ప్రధాని గూయిసేఫ్కోంటే లాక్ డౌన్‌ను అంచెల వారీగా ఉపసంహరణకు శ్రీకారం చుట్టారు. తొలుత దేశంలోని పార్క్లన్నింటిని తెరుస్తామన్నారు. ప్రజలు ఆరుబయట వ్యాయామం చేసేందుకు, బంధువుల ఇళ్ళను సందర్శించేందుకు అనుమతిస్తామన్నారు. అయితే సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ఫేస్‌మాస్క్‌లు తప్పనిసరని చెప్పారు. ఇటలీలోని భవన నిర్మాణ కార్యక్రమాలు, కర్మాగారాలు కూడా తిరిగి యదాస్థితిలో పనిచేయనున్నాయి. రెస్టారెంట్లు, బార్లు మాత్రం తెరుచుకోవు. విద్యాసంస్థలు, మ్యూజియంలు, సెలూన్లు, సాధారణ దుకాణాలు జూన్ 1వరకు లాక్‌డౌన్‌లోనే కొనసాగుతాయి. ఇక విద్యాసంస్థలైతే సెప్టెంబర్‌లోనే తెరుస్తారు. స్పెయిన్‌లో మే 2వ వారం నుంచి లాక్‌డౌన్‌ను అంచెలంచెలుగా ఉపసంహరిస్తామని ఆదేశ ప్రధాని పెడ్రోసొంచెజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్పెయిన్ కోవిడ్‌తో తీవ్రంగా అతలాకుతలమైంది. కాగా ఇప్పుడు సంక్రమణ రేటు తగ్గుతోంది. మే రెండోవారంలో దుకాణాలు, సూపర్మార్కెట్లు, ఫార్మసీలు, క్లీనిక్‌లు తెరవడానికి ప్రణాళికలు సిద్ధం చేఎశారు. అయితే విద్యాసంస్థలకు మాత్రం సెప్టెంబర్ వరకు నిషేదాజ్ఞలు కొనసాగనున్నాయి. ఫ్రాన్స్‌లో ప్రజలిప్పుడు లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నారు. మూడ్రోజుల క్రితం ప్రజల్నుంచి నిరసన వ్యక్తమైంది. దీంతో మే 11 నుంచి ఆంక్షల ఎత్తివేతకు ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్ సిద్దపడుతున్నారు. మే 11 నుంచి కార్యాలయాలు తిరిగి తెరవనున్నారు. రవాణా వ్యవస్థల్ని పునరుద్దరించనున్నారు. ప్రయాణాలపై ఆంక్షల్ని ఎత్తివేయనున్నారు. దీనిపై పోర్చుగల్ కూడా చర్చలు మొదలెట్టింది. మే 2వరకు అక్కడ లాక్డౌన్ ఉంది. ఈలోగా కేసుల సంఖ్య తగ్గితే దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరుచుకునేందుకు అనుమతులిస్తామని ప్రభ ్నత్వం స్పష్టం చేసింది. కాగా ఇంగ్లాండ్ దేశ ప్రధాని జాన్సన్ స్వయంగా కోవిడ్ 19కు గురయ్యారు. కోలుకున్న అనంతరం ఈ వారంలోనే ఆయన తిరిగి విధులకు హాజరౌతున్నారు. ఇప్పటికే దేశ ఆర్ధిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకుందన్న ఆందోళన బ్రిటన్‌లో వ్యక్తమౌతోంది. ఇక ప్రజల అసహనాన్ని భరించడం సరికాదని జాన్సన్ భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆంక్షల సడలింపునకు ఆయన అంగీకరించారు.
బెల్జియంలో మే 4 నుంచి ఫేస్మాస్కుల్తో 12ఏళ్ళపైబడ్డ వ్యక్తుల్ని రోడ్లపైకి అనుమతించనున్నారు. అయితే వ్యాపార స్వభావం కలిగిన దుకాణాలకు మాత్రం అప్పుడే అనుమతులివ్వరు. ఇంటినుంచి పనిచేసేందుకే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అనుమతుంటుంది. అసాధారణ విషయంపై మాత్రమే రోడ్లపైకి రావాల్సుంటుంది. మే 11 నుంచి కొన్ని కఠినమైన మార్గదర్శకాలకు లోబడి దుకాణాలు తెరి చేందుకు అనుమతులిస్తారు. మే 18నుంచి సెలూన్లు, మాల్స్ తెరుస్తారు. ఇక్కడ కూడా సెప్టెంబర్ తర్వాతే విద్యాసంస్థలకు అనుమతులిస్తారు. నెదర్లాండ్స్‌లో మే 11నుంచి పాఠశాలలు ప్రారంభించనున్నారు. అక్కడ కోవిడ్ 19 ప్రభావం పెద్దగా లేదు. దీంతో సామాజిక దూరం పాటిస్తూ ప్రాధమిక పాఠశాలలు తెవవొచ్చని ఆ దేశ పబ్లిక్‌హెల్త్ శాఖ సూచించింది. అలాగే క్రీడా మైదానాలు, క్లబ్‌లు, ఉద్యానవనాల్ని కూడా తెరుస్తారు. ఆస్ట్రేలయాలో మే 10 నాటికి అంచెల వారీగా నిబంధనల్ని తొలగించనున్నారు. అప్పటికి సమావేశాలక్కూడా అనుమతులిస్తారు. ఈలోగా వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. హంగేరిలో ముసుగు లేదా ఫేస్‌మాస్క్‌తో దుకాణాలు, మార్కెట్లకెళ్ళేందుకు, ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకునేందుకు ఏప్రిల్ 29నుంచి అనుమతులు జారీ చేశారు. పోలెండ్ ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన తన దేశీయుల్ని స్వదేశానికి అనుమతించాలని నిర్ణయించింది. అయితే ఇలా వచ్చే ప్రయాణీకులు రెండువారాలు క్వారంటైన్లో గడపాల్సుంటుంది. ఈ దేశంలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలన్నీ మే 24వరకు మూసేస్తారు. గ్రీస్‌లో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కొన్ని వర్గాలకు మాత్రమే వెసులుబాటివ్వనున్నారు. బ్యాంకులు, సూపర్మార్కెట్లు, రెస్టారెంట్లతో సహా డెలివరీ సేవలకు అనుమతించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జనాన్ని రోడ్లపైకొచ్చేందుకు అంగీకరించారు. క్రోయేషియాలో దుకాణాలు, మ్యూజియమ్లు, గ్రంథాలయాలు తెరిచేశారు. అయితే షాపింగ్‌మాల్స్‌కు మాత్రం అనుమతివ్వలేదు. డెన్మార్క్‌లో మే 10 తర్వాతే బహిరంగ కార్యకలాపాలకు అనుమతులిచ్చారు. పదిమందికి లోపు జరిపే సమావేశాలకు మాత్రమే ఆమోదిస్తారు. నార్వేలో చిన్నపిల్లల పాఠశాలల్ని తెరిచారు. అయితే ఇక్కడ భౌతిక దూరం అమలు చేస్తున్నారు. నార్వేలో అంచెలంచెలుగానే లాక్డౌన్ ఉపసంహరిస్తున్నారు.