న్యూజిలాండ్ వ్యూహం ఆచరించాలి!

New Zealand eliminates COVID 19

లాక్‍డౌన్‍ ఉపసంహరణకు ఆతృత ప్రదర్శించిన కొన్ని రాష్ట్రాలు, దేశాలు కరోనా ఇప్పట్లో పూర్తిగా సమసిపోయే అవకాశం లేదంటూ తేల్చేస్తున్నాయి. దీర్ఘకాలం పాటు కరోనాతో కలసి జీవించక తప్పదని అంటూ ప్రభుత్వాధినేతలు ప్రజలను సంసిద్ధం చేస్త్తున్నారు. కరోనా అన్నది జనజీవనంలో కొంతకాలం పాటు ఓ భాగంగానే కొనసాగుతుందని వీరు స్పష్టంచేస్తున్నారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కట్టడిలో ఆయా ప్రభుత్వాల సామర్ద్యంపై కూడా పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే పాలకులింతగా భయపడాల్సిన అవసరంలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితమే న్యూజిలాండ్‍ కరోనా నుంచి పూర్తిస్థాయిలో విముక్తి సాధించింది. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని జాకిండాఆర్డర్న్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ దేశం కూడా కరోనాతో విలవిల్లాడింది. అయితే ముందుగానే అప్రమత్తమైంది. అంతర్జాతీయ రవాణాను నియంత్రించింది. పరీక్షల సంఖ్య పెంచింది. దీంతో మొత్తం 1474కేసులు మాత్రమే ఈ దేశంలో నమోదయ్యాయి. వీరిలో 19మంది మ•తిచెందారు. న్యూజిలాండ్‍లో కోవిడ్‍ 19 మహమ్మారిగా మారకుండా అడ్డుకట్టేశారు. ఇది సామాజిక వ్యాప్తి దశకు చేరకుండా నిరోధించగలిగారు.

ఒక న్యూజిలాండే కాదు.. తైవాన్‍, దక్షిణకొరియా, జార్జియా, ఐస్‍లాండ్‍లు కూడా కరోనా విమ్నుక్తి సాధించాయి. ఇవి చిన్న చిన్న దేశాలైనా ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. దీంతో వ్యాధి వేగంగా విస్తరించే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరగా ఈ దేశాలు లాక్‍డౌన్‍ ప్రకటించాయి. దాన్ని సమర్ధవంతంగా అమలు చేశాయి. విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు చేపట్టాయి. ఈ ఫలితాన్ని ఇవి వేగంగానే ఫలితాలను పొందగలిగాయి. చైనా సరిహద్దుకు కేవలం వందమైళ్ళ దూరంలోనే ఉన్న తైవాన్‍ చాలా వేగంగా స్పందించింది. వూహాన్‍లో తొలికేసు ప్రకటించిన వెంటనే సరిహద్దుల్ని మూసేసింది. దక్షిణకొరియాలో కేసులు వేగంగా విస్తరించాయి. అయితే మరణరేటును ప్రపంచంలోనే అత్యల్పంగా నమోదయ్యే విధంగా ఈ దేశం చర్యలు చేపట్టగలిగింది. చిన్న దేశం జార్జియా ఈ వ్యాధిని తీవ్రంగా ప్రతిఘటించింది. దీర్ఘకాలం అంతర్యుద్దాలు, దండయాత్రల్తో సతమతమైన జార్జియా శతృవుల్తోనే కాకుండా క్రిమికీటకాల్తో కూడా పోరాడటంలో ఆ దేశ పౌరుల క్రమశిక్షణ కలసొచ్చింది. 

ఐస్‍లాండ్‍లో కరోనా రోగుల సగటు అధికంగా నమోదైంది. కానీ పకడ్బందీ చర్యల్తో ఇప్పుడా దేశం కరోనాపై విజయం సాధించింది. ఓ పక్క అమెరికాలో వేలాదిమంది కరోనాతో చనిపోతుంటే సరిహద్దుల్లోని కెనడా నెమ్మదిగా ఈ బారి నుండి బయటపడుతోంది. అక్కడి పటిష్టమైన ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ చేపట్టిన చర్యలు సత్ఫలితాల్నిస్తున్నాయి. వీటితో పాటు 5వేలకు పైగా కేసులు నమోదైన స్వీడన్‍ కూడా ఇప్పుడు కరోనా నుంచి విముక్తి సాధించింది. ప్రపంచమంతా లాక్‍డౌన్‍ అమలౌతుంటే స్వీడన్‍లో మాత్రం ప్రజలపై ఎలాంటి ఒత్తిళ్ళులేవు. కానీ ప్రభుత్వ ఆదేశాల్ని అక్కడి ప్రజలు తూచ తప్పకుండా పాటించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా వ్యాధి కట్టడికి ప్రయత్నించారు. ప్రపంచంలోనే విలక్షణమైన హైట్రస్ట్ కల్చర్‍ కలిగున్న దేశం కావడంతో ప్రజలే చైతన్యవంతులై ఈ వ్యాధిని అదుపులోకి తీసుకొచ్చారు.

 


                    Advertise with us !!!