
సినిమా రంగంలో ఒక్క మంచి అవకాశం వారి కెరీర్‌ని టర్న్ చేస్తుంది. అలాంటి అవకాశం కోసమే నటీనటులంతా ఎదురుచూస్తుంటారు. కొందరికి కెరీర్ ప్రారంభంలోనే అలాంటి ఛాన్స్ వస్తుంది. మరికొందరికి ఎన్నో సినిమాలు చేసిన తర్వాత గానీ బ్రేక్ రాదు. విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఆ ఛాన్స్ తొందరగానే వచ్చింది. చేసింది మూడు నాలుగు సినిమాలు. ఆ తర్వాత ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు విజయ్. అతని కెరీర్లో అర్జున్‌రెడ్డి అనే సినిమా రాకపోతే అతని కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేది. అర్జున్‌రెడ్డిలో అతని పెర్ఫార్మెన్స్కు అందరూ ఫిదా అయిపోయారు. నటనతోపాటు నిజజీవితంలో అతని యాటిట్యూడ్ వల్ల ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే ఈమధ్య విడుదలైన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ వర్ వంటి సినిమాలు అందర్నీ నిరుత్సాహ పరిచాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మే 9న తన పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా అతని కెరీర్ గురించిన కొన్ని విశేషాలు.
ఎవడే సుబ్రమణ్యం నుంచి ఫైటర్ వరకు
కెరీర్ ఆరంభంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రమణ్యం చిత్రం విజయ్ నటుడిగా ఎదగడానికి ఉపయోగిపడింది. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా మంచి బ్రేక్ ఇవ్వడంతో ఈ రౌడీ స్టార్ కెరీర్ రాకెట్ స్పీడ్ అందుకుంది. వెంటనే అర్జున్‌రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఖాతాలో పడటంతో విజయ్ దేవరకొండకు ఎదురే లేకుండా పోయింది. 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇక వరుసగా మహానటి, గీత గోవిందం లాంటి చిత్రాలు ఫెర్ఫార్మర్‌గా విజయ్ దేవరకొండను మరో మెట్టు ఎక్కించాయి. గీత గోవిందం రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించడంతో బాక్సాఫీస్ వద్ద పట్టు సాధించాడు. అదే ఊపులో టాక్సీవాలా కూడా కెరీర్‌కు సపోర్టుగా నిలిచింది.
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా..
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు మాత్రం అభిమానుల ఫాలోయింగ్ చెక్కు చెదరలేదు. రోజు రోజుకు ఫ్యాన్స్ సంఖ్యను గణనీయంగా పెంచుకొంటూ పోతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ల ఫాలోవర్స్‌ను సాధించాడు. ఇక రౌడీ అనే పేరుతో డిజైనర్ వేర్ దుస్తుల తయారీ కంపెనీ ప్రారంభించారు. రౌడీ బ్రాండ్‌కు యూత్‌లో మంచి క్రేజ్ వచ్చేలా చూసుకున్నారు.
కరోనా సమయంలో..
కరోనావైరస్ సమయంలో టాలీవుడ్ కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళం ప్రకటించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనందించారు. మిడిల్ క్లాస్ ఫండ్‌తో దాదాపు 8 వేకుపైగా కుటుంబాలను ఆదుకొన్నారు. ఇంకా పలు సేవా కార్యక్రమాలను విజయ్ దేవరకొండ కొనసాగిస్తున్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్
ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా హీరో చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థతో పలు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా కొన్ని ప్రాజెక్టుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.