విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు టాలీవుడ్ మ‌ద్ద‌తు

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య అందరికీ తెలిసిందే. మునుపెన్నడూ చూడని విపత్కర పరిస్థితిలో ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి వ‌ల్ల‌ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సామాన్య ప్ర‌జ‌లు, రెక్కాడితేగానీ డొక్కాడని బడుగు వర్గాలు లాక్‌డౌన్ వ‌ల్ల త‌ల్ల‌డిల్లిపోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల‌ ప్రజల‌నే తీసుకుంటే ఎంతో మంది జీవనోపాధి కోల్పోయి ఈ లాక్‌డౌన్‌ కాలాన్ని ఎలా నెట్టుకు రావాలో అర్థంకాక అవ‌స్థ‌లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని స్వచ్ఛంధ సంస్థలు తమకు వీలైనన్ని విధాలుగా పేద ప్రజల‌కు సాయం చేస్తున్నారు. అలాగే కొంతమంది సంపన్నులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయా రాష్ట్రాల‌ ముఖ్యమంత్రుల‌ సహాయ నిధికి పెద్ద మొత్తాల్లో విరాళాలు అందిస్తున్నారు.

ముఖ్యంగా సినీ పరిశ్రమకు ఇది గడ్డుకాలం. సినిమానే నమ్ముకొని ఎంతో మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. గత కొన్నిరోజులుగా సినిమా షూటింగ్స్‌ లేవు, సినిమా థియేటర్స్‌ లేవు. దీంతో తమ భవిష్యత్‌ ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. సినీ కార్మికులు లేకపోతే సినిమాలు లేవు, రిలీజ్‌లు లేవు. కాబట్టి వారు ఎలాంటి ఇబ్బందుల‌కు లోనవకుండా సినీ పెద్దలు తగిన చర్యలు చేపట్టారు. అందరికీ నిత్యావసరాలు అందిస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఈమధ్యే హీరో చిరంజీవి ఒకడుగు ముందుకు వేసి సిసిసి పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా కష్టాల్లో ఉన్న సినిమా కార్మికుల‌కు అన్నిరకాల‌ సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సంస్థను సపోర్ట్‌ చేస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు భారీగా విరాళాలు అందించారు, అందిస్తున్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి మనిషికైనా తమకు తోచిన విధంగా సాయం చెయ్యాల‌ని, తమ ధాతృత్వాన్ని చాటుకోవాల‌ని ఉంటుంది. ఆలోచన ఉన్నా ఆచరణలో అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి సిసిసి వంటి సంస్థకు ఎంతో కొంత విరాళాన్ని అందిస్తే దాని ద్వారా పేదల‌కు ఆ సాయం అందుతుంది. తాము కూడా సహాయం అందించామన్న తృప్తి కలుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఎంతో మంది సినీ ప్రముఖులు సిసిసికి విరాళాలు అందించారు. సిసిసికి విరాళాలు అందిస్తూ వ్యక్తిగతంగా కూడా కొందరు ప్రముఖు పేదల‌ను ఆదుకుంటున్నారు. అలాంటి వారిలో హీరో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘ది దేవరకొండ ఫౌండేషన్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించి దాని ద్వారా ఆపన్నుల‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన ఫ్యాన్స్‌ నుంచి, కొంతమంది ప్రముఖుల‌ నుంచి విరాళాలు సేకరించి పేద ప్రజకు తనవంతు సాయం చేస్తున్నారు.

ఏ మంచి పని చేసినా చెడు దాని వెంటే వస్తుంది. ఎదుటివారికి మంచి చేయడం చేతకాకపోయినా ఉచిత సల‌హాలు ఇవ్వడానికి, చేసే మంచి పనిని కించపరచడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. విజయ్‌ దేవరకొండ విషయంలోనూ అదే జరిగింది. ఒక స్వచ్ఛంధ సంస్థను ప్రారంభించి ఎంతో మందికి తమ సంస్థలో ఉపాధి కల్పించడమే కాకుండా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిల‌వడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు విజ‌య్‌. రెండు రాష్ట్రాల్లోని పేదల‌కు తోచిన సాయం అందించాడు. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే దాన్ని నలుగురికీ తెలిసేలా చేస్తే దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మరికొంతమంది సాయం చెయ్యడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించాడు విజయ్‌.

కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా ఆ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదిస్తే వారికి తగిన సహాయం చేసేందుకు దేవరకొండ ఫౌండేషన్‌ సిద్ధమవుతుంది. అలాగే ఈ సంస్థ ద్వారా సహాయం పొందిన వారి వివరాలు కూడా అందులో పొందుపరుస్తారు. విజయ్‌ దేవరకొండ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల‌ను ప్రోత్సహించడం మానేసి కొన్ని వెబ్‌సైట్స్‌ విమర్శించడం ప్రారంభించాయి. దీంతో మనస్తాపానికి గురైన విజయ్‌ ఓ వీడియోతో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చాడు. పేద ప్రజల‌ను విజయ్‌ దేవరకొండ అవమానిస్తున్నాడు అంటూ ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన న్యూస్‌ను ప్రస్తావిస్తూ ప‌లు అంశాల‌ గురించి మాట్లాడాడు. కొన్ని వెబ్‌సైట్లు రాసే గాసిప్స్‌ గురించి, సినిమా రివ్యూ గురించి... కొన్ని విషయాల్లో వెబ్‌సైట్స్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్ప‌డుతున్న‌ విషయాల‌ గురించి దాదాపు 20 నిమిషాల‌ పాటు మాట్లాడాడు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అయ్యింది. విజయ్‌ దేవరకొండను టాలీవుడ్‌ ప్రముఖు చాలా మంది సపోర్ట్‌ చేస్తున్నారు. చిరంజీవి, మహేష్‌, రవితేజ, రానా, అల్ల‌రి నరేష్‌, కార్తికేయ, రాశీ ఖన్నా, సింగర్‌ స్మిత, కాజల్‌ అగర్వాల్‌, కొరటాల‌ శివ, శివ నిర్వాణ, హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, మెహర్‌ రమేష్‌, అనీల్‌ సుంకర, వంశీ పైడిపల్లి, క్రిష్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా తమ మద్దతును ప్రకటించారు. విజయ్‌ అభిప్రాయాల‌తో తాము ఏకీభవిస్తున్నామని, అత‌ని వెంట మేమున్నామంటూ విజయ్‌కు బాసటగా నిలుస్తున్నారు.