వైద్య సిబ్బంది పై దాడి తగదు నిజమైన సూపర్‌ హీరోలను గౌరవిద్దాం - మహేష్ బాబు

COVID 19 health workers are our true superheroes says Mahesh Babu

ప్రపంచంలోని అన్ని దేశాలనూ వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. భారత్‌లో గణనీయంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ కుటుంబ సభ్యులకు మరింత దగ్గరయ్యే మంచి అవకాశం కల్పించింది ఈ లాక్ డౌన్. మరో పక్క తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా రోగులకు వైద్య సేవలు  అందిస్తూ సూపర్‌ హీరోలుగా పేరు తెచ్చుకుంటున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, అన్నిరకాల సేవలు అందిస్తున్న పోలీసులు. అయితే ప్రజలు మాత్రం వైద్య సిబ్బంది సేవలను గుర్తించడం లేదు. వివిధ కారణాలతో వారిపై దాడులకు దిగుతున్నారు. 

ఈ ఘటనలపై కలత చెందిన సూపర్‌స్టార్‌ మహేష్‌ నిజమైన సూపర్‌ హీరోలను గౌరవించాలని ప్రజకు విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్‌ ద్వారా సూపర్‌స్టార్‌ మహేష్‌ స్పందిస్తూ ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిస్వార్థంగా, అలుపెరుగని సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు మన క్షేమం కోసమే పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు  గుర్తించాలి. మనకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తున్న వారిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వారు చేస్తున్న త్యాగాలను గౌరవించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుటివారికి ప్రేమను అందించడం కంటే గొప్ప బహుమతి మరొకటి ఉండదు. నిజమైన సూపర్‌ హీరోలను మనం గౌరవించుకుందాం’’ అని ట్వీట్‌ చేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. వైద్య సిబ్బందిపై ఎవరైనా దాడికి దిగితే వారికి గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.5 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. దీన్ని నాన్‌ బెయిలబుల్‌ నేరంగా పరిగణిస్తారు.