
అమెరికాలో కరోనా మహమ్మారి ప్రళయాన్నే సృష్టిస్తోంది. లక్షలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. వేలాదిమంది మృత్యువాతపడ్డారు. వేలాది సంస్థలు ఆదాయాన్ని కోల్పోయి మూతపడ్డాయి. నిరుద్యోగం పెరిగింది. ప్రజల్లో ట్రంప్ పాలనపట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. కరోనా ఇంతగా విస్తరించడానికి ట్రంప్ వైఫల్యమే కారణమన్న ప్రచారం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన పాలన వైఫల్యాల నుంచి బయటపడేందుకు, ప్రజలను డైవర్ట్ చేసేందుకు పదునైన ఆయుధాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. అదే ఇమ్మిగ్రేషన్ నిలుపుదల చట్టం. నిరుద్యోగం పెరిగిన వేళలో కొత్తవారు అమెరికాకు వస్తే ఇక్కడ ఉన్నవారికి కాకుండా కొత్తవారికి ఉద్యోగాలు లభించడానికి అవకాశాలు ఉంటాయని అంటూ, అమెరికన్లకోసమే తాను కొత్తవారి రాకను తాత్కాలికంగా రెండు నెలలు నిలిపి వేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు
20 ఏప్రిల్ 2020 న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా సంక్షోభంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా అన్నీ రకాల వీసాలను ఆపు చేసే చర్యలను చేపట్టామని, ఈ దిశగా ఆర్డినెన్స్ కూడా జారీ చేస్తామని ప్రకటించి అమెరికాలోని ఇతర దేశాలవారిని, అమెరికాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఉన్న అనేక ఇతర దేశాల వారిని షాక్‌కి గురి చేశారు. ఆ ప్రకటన అనంతరం అమెరికాలోనే కాకుండా, దాదాపు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆ వార్త పెద్ద సంచలనమే కలిగించింది. అయితే 22 ఏప్రిల్ 2020 న వైట్ హౌస్ ఈ విషయం పై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని విడుదల చేసింది.
అయితే ప్రెసిడెంట్ ట్రంప్ హడావిడిగా చేసిన ఈ ప్రకటనలో కరోనా సంక్షోభంలో అమెరికాలోని నిరుద్యోగులను రక్షించాలన్న ప్రయత్నం కంటే రాజకీయ కారణాలే ఎక్కువగా ఉన్నాయని, పరిశీలకులు అంటున్నారు. రిపబ్లికన్ పార్టీ నాయకుడు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో యునైటెడ్ స్టేట్స్ అటార్నీ జనరల్‌గా 2017-18 సంవత్సరాలు పనిచేసి, ఈ సంవత్సరం ఎన్నికలకు సిద్ధమవుతున్న జెప్ సెషన్స్ ఏప్రిల్ 18వ తేదీనాడే అమెరికాకు సంవత్సరానికి దాదాపుగా 1.4 మిలియన్ మంది వివిధ రకాల వీసాలతో వస్తున్నారని, వీరందరినీ కొన్నాళ్ళపాటు ఆపేస్తే అమెరికాలో నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుందని ప్రకటించారు.
అసలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కి ఈ విధంగా వలసలను ఆపే అధికారం ఉందా అని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. ఇంతక్రితం ముస్లిం దేశాల వారిని అమెరికాకి రానివ్వం అని ట్రంప్? ప్రకటించడం, దానిమీద కొన్నివర్గాలు కోర్ట్ కి వెళ్ళడం, అమెరికాలో సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసిన సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. అందుకనే అధికారులు, న్యాయనిపుణులతో ఈ ఆర్డినెన్స్ ను ఎలా తీసుకురావాలో, అందులో ఉండాల్సిన విధి, విధానాలను కూలంకషంగా చర్చించి అన్నీ కోణాలతోనూ పరిశీలించే పనిలో ఉన్నారని తెలిసింది.
వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కెలే మెక్ ఇనాని మాట్లాడుతూ ప్రెసిడెంట్ ట్రంప్ మొదటి నుంచి అమెరికా పౌరుల ఆరోగ్య , ఆర్థిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అని, అమెరికా పౌరులకు నిరుద్యోగం, తక్కువ వేతనాలు ఉండటానికి కారణం బయటనుంచి వచ్చిన విదేశీయులే అని మొదటి నుంచి వాదిస్తున్న సంగతిని గుర్తు చేశారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ చేసిన ఈ వ్యాఖ్యలతో వలసలు నిషేధం అనే ప్రస్తుత మాటలకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో లాక్ డౌన్ పరిస్థితి వలన అన్నీ ఇమ్మిగ్రేషన్ ఆఫీసులు గత రెండు నెలలుగా మూసివేసి ఉండటం, అనేక దేశాలలో లాక్ డౌన్ పరిస్థితుల వలన ఆయా దేశాల్లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాలు కూడా మూసివేసి ఉండటంతో ఇప్పటికే వీసాలు ఆగిపోయాయని అమెరికాలో నివసించే ఒక అటార్నీ అన్నారు.
ఇమ్మిగ్రేషన్ స్టడీస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్క్ క్రికోరియన్ మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వంలో కంటే రిపబ్లికన్ పార్టీలో చాలామంది ఈ ఇమ్మిగ్రేషన్ బ్యాన్ మీద అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నారని, ఇప్పుడు కరోనా సాకుతో ఈ ఆర్డర్ తెచ్చారని గ్రీన్ కార్డులు ఇవ్వడం కొన్నాళ్ళు ఆపడంవలన, అమెరికాకు పని మీద వచ్చే వారి వీసాలను ఆపడం వలన అమెరికాలో, అమెరికా పౌరుల నిరుద్యోగ సమస్య సమసిపోదని వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంలో ఆలోచిస్తే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆయన 4ఏళ్ళ క్రితం ఎన్నికల సమయంలో చెప్పిన పాయింట్‌ను మరల ఆవిష్కరించినట్లే అని, ఈ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉంటూ అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నారని, త్వరలో ఎన్నికలు జరగనున్నవేళలో మరోసారి తన ఉద్దేశ్యాలను ఈ చట్టం ద్వారా తెలియజేస్తున్నారని అంటున్నారు.
డెమోక్రటిక్ పార్టీకి, వర్జీనియా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌మాన్ డాన్ బేయర్ మాట్లాడుతూ, ట్రంప్ మొదటినుంచి కరోనాని కట్టడి చేయడంలో విఫలమయ్యారని, ఇప్పుడు ఈ ఇమ్మిగ్రేషన్ బ్యాన్ అంటూ ప్రజలను తన వైఫల్యాల నుంచి దిశ తిప్పుతున్నారని ఆరోపించారు. అలాగే టెక్సస్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ మ్యాన్ జోక్విన్ క్యాస్ట్రో కూడా ఇమ్మిగ్రేషన్ మీద ట్రంప్ తీసుకుంటున్న చర్యలు తన తప్పులను కప్పిపుచ్చడానికేనని వ్యాఖ్యానించారు.
మొత్తం మీద ట్రంప్ తాను పక్కా బిజినెస్‌మ్యాన్, రాజకీయ ఎత్తుగడలలో తనకు సాటిమరెవరూ లేరని నిరూపించుకుంటున్నారు.
- చెన్నూరి వెంకట సుబ్బారావు