
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
బ్యానర్: పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సినిమావాలా
నటీనటులు: రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్, శ్రీజిత్ గంగాధరన్, జేడీ చెరుకూరు
సినిమాటోగ్రఫీ: సంతోష్ శనమొని
సంగీతం: ఎన్ ఎస్ ప్రసు
ప్రెజెంటర్: సురేశ్ ప్రొడక్షన్స్
నిర్మాత: ఎస్ ఎన్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సురేందర్ కోటండి
ఏప్రిల్ 29 న జీ5 ఓ టి టి ద్వారా విడుదల.
ప్రేమంటే కేవలం ఆనందం ఒక్కటే కాదు సుఖ దుఃఖాలు, అనుబంధాలు, ఆకర్షణలు వికర్షణలు, విడిపోవడాలు మళ్ళి కలుసుకోవడాలు ఇలా అన్ని ఎమోషన్స్ కలగలుపే ప్రేమ ఒక సముద్రం లాంటిది. ఈ ప్రేమ సముద్రం లో చివరిదాకా ఈదగలిగితేనే ఆ ప్రేమ విజయవంతం అయినట్టు. అయితే సీరియస్‌గా, సిన్సియర్‌గా, చివరిదాకా అబ్బాయిలే మాత్రమే ప్రేమిస్తారనుకుంటారు చాలామంది. కానీ ఒక్కసారి మనసిచ్చారంటే ఏడు సముద్రాలనైనా ఈదగలమంటూ, ప్రాణం పోయేవరకు నీడగా ఉంటామని కొత్త ధైర్యంతో, కొనితెచ్చుకున్న ఆత్మవిశ్వాసంతో బాసలు చేస్తారు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన అమ్మాయిలు. అలాంటి ఓ ప్రేమికురాలి కథే "అమృతరామమ్" లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం లేక జీ 5 ద్వారా విడుదలైనా ఈ తొలి చిత్రం సమీక్ష ఏమిటో చూద్దాం.
కథ:
అమృత(అమిత రంగనాథ్) విద్య కోసం విదేశాలకు వెళుతుంది. అక్కడ తొలి చూపులోనే రామ్(రామ్ మిట్టకంటి)తో ప్రేమలో పడుతుంది. అది పిచ్చి ప్రేమగా మారుతుంది. ఎంతలా అంటే అతనితో ఎవరు సన్నిహితంగా మెలిగినా భరించలేనంతగా! రామ్ నుంచి కొన్నింటిని వేరు చేసేందుకు ఆమె విశ్వప్రయత్నాలు చేస్తుంది. దీంతో అతని అహం దెబ్బతిని గొడవ మొదలవుతుంది. అది కాస్తా తారాస్థాయికి చేరడంతో ఆమెతో విడిపోవడానికి సిద్ధమవుతాడు. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించడు. కానీ అవన్నీ తనపై ప్రేమతోనే చేసిందని తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరూ కలిశారా? లేదా? సడన్‌గా హీరోకు ఏం జరుగుతుంది? అతను ప్రాణాపాయ స్థితిలో ఉండటానికి కారణం ఎవరు? వీటన్నింటికీ సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల హావభావాలు:
తొలిసారి వెండితెరపై హీరోగా నటించిన రామ్ మిట్టకంటి ఇంకా తన నటనను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. అమితా రంగనాథన్ పాత్రలో లీనమై అమ్మాయిల మనసు దోచుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అనుభవం ఉన్నదానిలా నటించి ప్రశంసలు దక్కించుకుంటుంది. ముఖ్యంగా హీరోయిన్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. హీరోహీరోయిన్లు విడిపోయే సమయంలో ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారు. ఆ సమయంలో హీరోయిన్ నటన, ఆమె పడే మానసిక వేదన తారాస్థాయిలో ఉంటుంది. మిగిలినవి కొద్ది పాత్రలే అయినా తమకు తగ్గ స్థాయిలో బాగానే నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. దర్శకుడు సురేందర్ కథ బాగా రాసుకున్న కధనంలో తడబడిన విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏదో మ్యాజిక్ చేద్దామనుకున్నాడు కానీ అది ప్రదర్శితమౌలేదు. ప్రేమ కథ చిత్రాలకు సంగీతమే ప్రదానం ఈ సినిమాకు అది ఆయువు పట్టుగా నిలిచింది. ఎన్ ఎస్ ప్రసు అందించిన సంగీతానికి గేయ రచయిత మధుసూదన్ నూటికి నూరు శాతం న్యాయం చేసారని చెప్పొచ్చు.. ఈ పాటలు సినిమాను ఓ మెట్టు పైకి ఎక్కించాయనే చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సంతోష్ శానమోనీ కెమెరా పనితనం ఈ సినిమాకు సరిగ్గా సరిపోయింది. రెండు గంటల నిడివి అయినప్పటికీ ఇంకా పూర్తవలేదేంటా అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు వస్తుంది. ఫస్టాఫ్‌లో మరింత ఎడిటింగ్ చేయాల్సింది.
విశ్లేషణ:
సినిమా మొత్తం ఆస్ట్రేలియా బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రేమికులకు నచ్చుతుంది. దర్శకుడు కథను నడిపించిన విధానంలో పెద్దగా కొసమెరుపులు ఉండవు. ఫస్టాఫ్ ఆసక్తికరంగా అనిపించదు. భారంగా, నెమ్మదిగా కొనసాగుతుంది. మొదటి భాగాన్ని ఎలాగోలా నెట్టుకురాగా రెండో భాగం కాస్త ఆసక్తికరంగా మలిచారు. దీంతో సగటు ప్రేక్షకుడు అప్పుడు ట్రాక్‌లోకి వచ్చి సినిమాలో లీనమైపోతారు. కథ చివర్లో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. కానీ క్లైమాక్స్ రొటీన్ గా ఇదివరకే ఎక్కడో చూశామే అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మధ్య ఇండస్ట్రీలో కొత్త సరుకుకు డిమాండ్ భారీగా పెరిగింది. చిన్న సినిమాలే బాక్సాఫీస్ హిట్ కొడుతూ ప్రజలకు చేరువవుతున్నాయి. అలా వచ్చిందే అమృతరామమ్. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజవుతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ సినిమాలో దాదాపుగా అందరూ కొత్తవారే. విశేషమేంటంటే..ఇందులో అమృత, రామ్ మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సహజమైన నటనతో మిమ్మల్ని కూడా సినిమా వెంట తీసుకెళతారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో నే ఉంటూ మనకిష్టమైన సమయంలో వీక్షించవచ్చు.