
ప్రళయం, తుఫాన్‌లాంటివి ఏవీ రాలేదు. ప్రపంచయుద్ధాలు జరగడంలేదు. కేవలం అదృశ్యరూపంలో ఉండే ఓ వైరస్ కు నేడు ప్రపంచం గడగడలాడుతోంది. ఈ వైరస్ ధాటికి వేడుకలు, మీటింగ్‌లు, ఆటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సమావేశాలు, హోటళ్ళలో పార్టీలు, ప్రయాణాలు అన్నీవాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని రంగాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అన్ని దేశాలు ఏదోవిధంగా ఈ వ్యాధి పరిణామాల్ని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఈ వైరస్ కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇవే కాదు. అందరూ ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్ కూడా వాయిదాపడింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. సంగీత కచేరీలు జరగడం లేదు. పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడ్డాయి. విహరయాత్రలు, పిక్నిక్లు ఇప్పుట్లో జరిగేలా లేవు.
జపాన్‌లో వైరస్ రావడంతో వేరే దేశంలో ఒలింపిక్స్‌ను మరో దేశంలో నిర్వహించాలన్న ప్రతిపాదనలొచ్చాయి. కానీ వరుసగా దాదాపు అన్ని దేశాల్ని వైరస్ కబళిస్తుండడంతో కొంతకాలం వాయిదా వేయాలన్న నిర్ణయం జరిగింది. ఈ అంతర్జాతీయ క్రీడోత్సవాన్ని వచ్చే ఏడాది జూలైలో నిర్వహించాలని తీర్మానించారు. ఒలింపిక్స్‌ను 1896 ఏప్రిల్ 6న మొదట ప్రారంభించారు. కాగా ప్రతినాలుగేళ్ళకోసారి ఇవి సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఒక్కోదేశం దీనికి ఆతిధ్యమిస్తోంది. అయితే మొదటి రెండో ప్రపంచ యుద్దాల నేపధ్యంలో మాత్రమే ఈ ఒలింపిక్స్ రద్దయ్యాయి. కాగా ఇప్పుడు కరోనా వైరస్ భయంతో ఏడాదిపాటు వాయిదా వేసుకోవాల్సివచ్చింది. అయితే మార్చి 12న గ్రీస్‌లోని ఒలింపియాలో సంప్రదాయ ఓలింపిక్ జ్వాల వెలిగించే కార్యక్రమాన్ని ప్రజల్లేకుండా సాదాసీదాగా నిర్వహించారు. అలాగే 1920 ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ ఈ ఏడాది మార్చి 13నుంచి 15వరకు చైనాలోని నాన్జింగ్లో జరగాల్సుంది. దీన్ని వచ్చే ఏడాదికి మార్చారు. ప్రపంచ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ ఛాంపియన్‌షిప్‌ను ఆతిధ్య దేశం పోలెండ్ ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్‌కు వాయిదావేసింది. 2020 డైమండ్లీగ్ ఈవెంట్లను ఖతార్, చైనాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరపాలి. ఇవి కూడా డిసెంబర్‌కు వాయిదాపడ్డాయి. 2020 బోస్టన్ మారథాన్‌ను ఏప్రిల్ 20నుంచి సెప్టెంబర్ 14కు, లండన్ మారథాన్ ఏప్రిల్ 26నుంచి అక్టోబర్ 4కు వాయిదావేయగా రోమ్ మారథాన్ ను రద్దు చేశారు. రెండు మహాసముద్రాల మధ్య ఏప్రిల్ 8నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన మారథాన్ పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఏప్రిల్ 25న నిర్వహించాల్సున్న త్రీపీక్స్ రేస్ సెప్టెంబర్ 26కు వాయిదావేశారు. జూన్ 20న జరగాల్సిన గ్రాంట్స్ మారథాన్‌ను పూర్తిగా రద్దు చేశారు. స్టాండర్డ్ చార్టర్ మారథాన్, హాంకాంగ్ మారధాన్, కౌలాలంపూర్ మారథాన్లు కూడా రద్దయ్యాయి.
ఆస్ట్రేలియ ఫుట్‌బాల్ లీగ్ ఉమెన్స్ సీజన్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాడ్మింటన్• వరల్డ్ ఫెడరేషన్ మే వరకు మ్యాచ్‌లు నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. స్వి• •ఓపెన్, ఇండియా ఓపెన్, ఓరియన్స్ మాస్టర్స్, మలేషియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, జర్మన్ ఓపెన్, చైనా మాస్టర్స్, థామస్ అండ్ ఉబెర్ కప్‌లు వాయిదా పడ్డాయి. బాస్కెట్‌బాల్ ఆఫ్రిక లీగ్‌ను డిసెంబర్‌కు వాయిదావేశారు. చైనీస్బాస్కెట్బాల్ అసోసియేషన్ నిర్వహించే క్రీడలన్నింటిని ఏడాదిపాటు వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. ఏషియన్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. కొలంబస్లో మార్చి 3నుంచి జరగాల్సిన ఆర్నాల్డ్ స్పోర్టస్ ఫెస్టివల్ వచ్చే ఏడాదికి వాయిదాపడింది. 44వ చెస్ ఓలింపియాడ్ను కూడా వాయిదా వేసింది. వైరస్ ప్రభావంతో మార్చి 26న బంగ్లాదేశ్ తన స్వతంత్ర దినోత్సవవేడుకల్ని నిర్వహించుకోలేక పోయింది.
మార్చి 25న గ్రీస్ జాతీయ దినోత్సవ వేడుకలు రద్దయ్యాయి. మార్చి 15న హంగేరీ, ఏప్రిల్ 4న సెనగల్, ఏప్రిల్ 18న జింబాంబ్వే, ఏప్రిల్ 26న టాంజానియా, మే 17న నార్వే జాతీయ దినోత్సవ వేడుకలు రద్దయ్యాయి. జపాన్ సంప్రదాయ ఉత్సవం షిజుకాను ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది.
వైద్యరంగంలో అత్యంత కీలకమైన అమెరికన్ అకాడమీ ఆఫ్ అలర్జీ, ఆస్త్మా, ఇమ్యూనాలజీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ, న్యూరాలజీ, సోషియాలజీ, అంకాలజీ, ఫిజికల్ సొసైటీల వార్షిక సమావేశాలు వాయిదాపడ్డాయి. అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ విజన్ అండ్ ఆప్తమాలజీ అంతర్జాతీయ సమావేశం రద్దయింది. అలాగే ఇంటర్నేషన్ ఎకనామిక్ ఫోరం సమావేశం వాయిదాపడింది. విచ్కాన్ యూరోప్ 2020, వండర్కాన్ 2020, సోలార్ పవర్ సమ్మిట్, ఇంటర్నేషనల్ ఆటోషో, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్లను కూడా వాయిదా వేశారు. అలాగే ఉమ్రా తీర్ధయాత్రను నిలిపేశారు. స్పెయిన్‌లో హోలీవీక్ ఉత్సవాలు ఆపేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను రావద్దని కోరింది. వాటికన్ సిటీని దిగ్భంధనం చేసేశారు. మక్కా మదీనాలకు భక్తుల రాకను నిషేదించారు.
హాలివుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మి అవార్డుల వేడుకను వాయిదావేశారు. అలాగే 55వ అకాడమీ కంట్రీ మ్యూజిక్ అవార్డులు నిలిపేశారు. 2020నికులోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డుల వేడుక వాయిదాపడింది. బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, టోని, పోలీష్ మ్యూజిక్ అవార్డస్ కూడా రద్దయ్యాయి. ఆఖరకు జేమ్స్‌బాండ్ కొత్త చిత్రం నో టైమ్ టు డై విడుదలను ఏడుమాసాల పాటు వాయిదావేశారు. అలాగే మిస్ యూనివర్స్ చైనా, ఐస్లాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, యుఎస్ఎ పోటీలన్నీ వాయిదాపడ్డాయి. వీటితో పాటు 36వ ఆసియన్ శిఖరాగ్ర సమావేశాన్ని నాలుగు మాసాల పాటు వాయిదావేశారు. బొలివియన్ సార్వత్రిక ఎన్నికలు నిలిపేశారు. ఇండోనేషియాలో స్థానిక ఎన్నికలు ఆపేశారు. ఇటలీలో రాజ్యాంగ ప్రజాభిప్రాయ సేకరణను వాయిదావేసుకున్నారు. లిబరల్ డెమోక్రాట్స్ నాయకత్వ ఎన్నిక వాయిదాపడింది. మేరీల్యాండ్ డెమోక్రాటిక్ అభ్యర్ధి ఎంపిక తేదీలు మార్చుకున్నారు. రష్యన్ రాజ్యాంగ ప్రజాభిప్రాయ సేకరణను వాయిదావేశారు. సెర్బియా, శ్రీలంక, సిరియన్ పార్లమెంటరీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. లండన్ మేయర్ ఎన్నికల్ని నిలిపేశారు. ఫ్రెంచ్‌లో మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేశారు. ఇరాన్లో శాసనసభ రెండో రౌండ్ వాయిదావేశారు. న్యూయార్క్‌లో స్థానిక ఎన్నికలు ఆపేశారు. ఇండియాలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్ని వాయిదావేసుకున్నారు. ఇలా ఎన్నోరకాల కార్యక్రమాలను ప్రపంచ దేశాలు కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసుకుని రక్షణాత్మక చర్యల్లో మునిగిపోయారు. ఇప్పుడు ఏ దేశంలో కూడా వినోదాలు, సాంస్క•తిక కార్యక్రమాలు, ఆటలు ఇతర విషయాల గురించి చర్చించడం లేదు. పత్రికల్లో కూడా ఇలాంటి వార్తలు కనిపించడం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎటు చూసినా కరోనావైరస్ గురించిన వార్తలే. విషయాలే కనిపిస్తున్నాయి. ప్రపంచ మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతోంది. కాలగమనాన్ని ఆపిన కరోనా వైరస్‌కు చెక్ పెట్టేంతవరకు ప్రజలు వేడుకలు, వినోదాలను తిలకించడం సాధ్యం కాకపోవచ్చు.