దేశాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్న ట్రంప్

Trump team faces a new 2020 risk

అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుందన్నట్టుగా ఉన్న ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం బొక్కబోర్లాపడగా, చైనా ఆ స్థానాన్ని ఆక్రమించేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే, అసలు అమెరికా ఎప్పటికి కోలుకుంటుంది ఇప్పటికే అక్కడ చదువుకుంటున్న, ఉద్యోగులు చేసుకుంటున్న భారతీయులతో సహా ఇతర దేశీయుల మదిలో తొలిచేస్తున్న ప్రశ్న ఇది. అన్ని రంగాల కార్యకలాపాలు ఆగిపోయాయి. యూనివర్శిటీలు మూతపడ్డాయి. కనీసం ఒక సంవత్సరం వరకూ అవి తెరుచుకునే పరిస్థితులు లేవు. తెరుచుకున్నా, పూర్తి స్థాయిలో పనిచేస్తాయన్న నమ్మకం లేదు. ఇప్పటికే భారత్‍ నుంచి మంచి ఉద్యోగాలు వదిలేసి మరీ ఎంఎస్‍ చేయడానికి అమెరికా వెళ్లిన మనోళ్లంతా బేర్‍మంటున్నారు. అసలు తిరిగి రావడమెలా అని తెగ మధనపడిపోతున్నారు. ఇక ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వారంతా అవి ఉంటాయో, ఊడతాయో తెలియక గందరగోళంలో ఉన్నారు.

మరోపక్క లాక్ డౌన్ ఎత్తివేయాలని అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. మాకు స్వేచ్ఛ ఇస్తారా చావమంటారా అంటూ అమెరికన్లు రోడ్డెక్కి నానా యాగీ చేస్తున్నారు. నియంత్రణ చర్యల్ని తీవ్ర స్థాయిలో ఉల్లంఘిస్తున్నారు. ప్రతి రోజు వేలాది మంది ఒకపక్క అమెరికాలో చనిపోతున్నా అక్కడి జనం, ప్రభుత్వాలు ఇంకా ఆర్థిక పురోగతి, స్వేచ్ఛాయుత సమాజం మీదే ఆసక్తి! ఇప్పుడు అమెరికా మొత్తం మీద ప్రతి రోజు ఒక లక్షా 20 వేల మందికి పరీక్షలు జరుపుతున్నారు. ఇవి కనీసం పది నుంచి పదిహేను రెట్లు పెరిగితే తప్ప కరోనా సంక్షోభం నుంచి బయటపడడం సాధ్యం కాదని అక్కడి నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని మొత్తం 45 మంది ప్రముఖ ఆర్థిక, సామాజిక, న్యాయ, నైతికవాదులు చెబుతున్న దాని ప్రకారం అమెరికా తిరిగి ఎప్పటిలాగా పట్టాలెక్కాలంటే కనీసం ఏడాది పడుతుందని, అది కూడా ఒక ప్రణాళిక ప్రకారం జనం అంతా క్రమశిక్షణతో నడిస్తేనే సాధ్యపడుతుందని వివరిస్తున్నారు. వారు విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం లక్షల కోట్ల డాలర్లను ఒక పద్ధతి ప్రకారం వ్యయం చేస్తేనే గట్టెక్కడం సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. టెస్టింగ్‍, ట్రేసింగ్‍ అండ్‍ సపోర్టెడ్‍ ఐసోలేషన్‍ విధానం ద్వారా మాత్రమే బయటపడగలమని వారు వివరించారు.

మహామాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం కంటే కరోనా సంక్షోభం మరింత భయానకమైనదని వారు హెచ్చరించారు. అందరూ నిబంధనలు పాటించి, కరోనాను ముందు నియంత్రించాలి, ఇందుకు వ్యక్తిగత రక్షణాత్మక పరికరాలను (మాస్క్‌లు, గ్లవ్స్, శానిటైజర్లు పీపీఈలు) ఉపయోగించాలి, ఆ తర్వాత టిటిఎస్‍ఐ టెస్టింగ్‍, ట్రేసింగ్‍, సపోర్టివ్‍ ఐసోలేషన్‍ను పాటించాలని విశదీకరించారు. ఇవన్నీ చేస్తూ, ప్రతి రోజూ కనీసం 20 మిలియన్‍ టెస్ట్లను జరపగలిగితేనే అమెరికా తిరిగి గాడినపడుతుందని తెలిపారు. అయితే, ఎప్పుడెప్పుడు లాకడ్ఱౌన్‍ను ఎత్తివేసి కార్యకలాపాలు ప్రారంభిద్దామా అని అధ్యక్షుడు ట్రంప్‍ నిమిషాలు లెక్కిస్తున్నారు. కాని, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు మరికొంత కాలం లాకడ్ఱౌన్‍ కొనసాగించాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వెలువరించిన ఈ నివేదిక ఇప్పుడు అందర్నీ ఆలోచింపచేస్తోంది. అదే సమయంలో ట్రంప్‍ పాలనా దక్షతపై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. ఫిబ్రవరిలోనే మీకు కరోనా పాండివెరీనియం గురించి తెలుసు కదా మరెందుకు అమెరికన్లను హెచ్చరించకుండా వదిలేశారని ఒక జర్నలిస్ట్ ట్రంప్‍ను ప్రశ్నించగా, ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాకు తెలుసు మీరు గొంతు తగ్గిస్తే మంచిదని ఆ మహిళా జర్నలిస్ట్ను ఉద్దేశించి ఆయన పదేపదే చెప్పడం విమర్శలకు దారితీసింది. ట్రంప్‍ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్న వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో దాదాపు ఎనిమిది లక్షల మందికి కరోనా సోకగా, అందులో సుమారు 43 వేల మంది చనిపోయారని అధికారిక గణాంకాలు చెబుతుండగా, ఇందుకు అనేక రెట్ల మృతుల సంఖ్య ఉంటుందని సామాజిక మాధ్యమాలు ఘోషిస్తున్నాయి.