అమెరికాలో కరోనా సంక్షోభ వేళలో... సహాయ పడుతున్న తెలుగు సంఘాలు

Telugu Associations helps to Covid 19 Victims in USA

అమెరికాలో కరోనా వైరస్‍ విస్తృతంగా వాప్తి చెందడంతో లక్షలాదిమంది వైరస్‍ బారిన పడి ఆస్పత్రుల పాలయ్యారు. వేలాదిమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన, ఉంటున్న లక్షలాది మంది తెలుగువారికి తమవంతు సహాయంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగు సంఘాలు సహాయపడుతున్నాయి. తమవంతుగా నిధులను సేకరించి సహాయపడటం, అవసరమైన సలహాలను, సూచనలను అందించడం చేస్తున్నాయి. కరోనా వైరస్‍ నుంచి రక్షణకు మాస్క్ లను, ఇతర పరికరాలను కొన్ని తెలుగు సంఘాలు పంపిణీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు టైమ్స్ ఆయా సంఘాల అధ్యక్షులను పలకరించినప్పుడు వారు చెప్పిన విషయాలను ఇక్కడ ఇస్తున్నాము.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కమ్యూనిటీ సర్వీస్‍లో ఎల్లప్పుడు ముందుంటుంది. అమెరికాలో కరోనా వైరస్‍ విజృంభించడంతో అమెరికాలోని విశ్వవిద్యాలయాలను, హాస్టళ్ళను మూసివేయడంతో రోడ్డున పడిన తెలుగు స్టూడెంట్‍లను ఆదుకునేందుకు వెంటనే స్పందించి హాట్‍లైన్‍ ను ఏర్పాటు చేసి అవసరమైన వారికి సహాయక చర్యలను చేపట్టింది. మరోవైపు సంఘంలో ఉన్న సభ్యులలో కరోనాపై అవగాహన పెంచే విధంగా పలువురు డాక్టర్లతో, నిష్ణాతులతో వెబ్‍ సదస్సులను ఏర్పాటు చేసి చైతన్యపరిచింది. కరోనా సంక్షోభ సమయంలో ఎదురయ్యే ఇమ్మిగ్రేషన్‍ సవాళ్ళు వంటి విషయాల్లో అవసరమైన సలహాలకోసం ఇమ్మిగ్రేషన్‍ అటార్నీతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి సందేహాలను తీర్చింది.

కరోనా వ్యాధితో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు వీలుగా ఆన్‍లైన్‍లో  నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. గో ఫండ్‍ ద్వారా దాదాపు లక్ష డాలర్ల నుంచి ఒక మిలియన్‍ డాలర్ల దాకా విరాళాలు సేకరించే పనిలో ఉన్నామని, ఆ ఫండ్‍ ద్వారా వచ్చే నిధులను కరోనా బాధితులకు, కుటుంబాలకు ఉపయోగిస్తామని తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి తెలిపారు. తానా వైద్యుల ద్వారా కూడా సలహాలను ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశారు.

కరోనాపై కవి చిగురుమళ్ళ శ్రీనివాస్‍ రచించిన కరోనా శతకం పుస్తకాన్ని జయ్‍ తాళ్ళూరి ఆవిష్కరించి ప్రపంచ దేశాలు కరోనా భయంతో వణకిపోతున్న ఈ సమయంలో ఆత్మస్థ్తెర్యంతో క్రమశిక్షణతో యుద్ధం నిర్వహిస్తే గెలుపు తధ్యమని, తరతరాలుగా ప్రకృతికి దూరమై కలుషితం చేస్తూ, సర్వజీవులకు కీడు తలపెడుతూ భూమికే ప్రమాదకారిగా మారిన మనిషికి ప్రకృతి పాఠం చెప్పదలచుకున్నదని కవి ఈ పద్యాలలో చెప్పడం బాగుందని అన్నారు. ఈ కరోనా శతకం చదివించేలా ఉందన్నారు. అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా నివారణ చర్యల్లో తానా పాలుపంచుకునేలా అనేక కార్యక్రమాలను జయ్‍ తాళ్ళూరి చేపట్టారు.

తానా ఫౌండేషన్‍

కరనా వైరస్‍ విస్తృతమవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్క్లను పంపిణీ చేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో విభాగమైన తానా ఫౌండేషన్‍ నిర్ణయించింది. తెలుగు కమ్యూనిటీని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే తానా ఫౌండేషన్‍ ఈ విపత్కర పరిస్థితుల్లో తనవంతుగా తెలుగు కమ్యూనిటీకి తోడ్పడాలన్న ఉద్దేశ్యంతో వైరస్‍ విస్తృతంగా వ్యాపించకుండా ముందుగా మాస్క్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలివిడతగా దాదాపు 5000 మాస్క్లను వివిధ చోట్ల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుందని ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు తెలిపారు. సతీష్‍ చుండ్రు, రవి సామినేని, వెంకట్‍ యార్లగడ్డ, సురేష్‍ కాకర్ల, సురేష్‍ పుట్టగుంట, వెంకట్‍ కోగంటి, వెంకట రమ యార్లగడ్డ తదితరులు మాస్క్లను స్పాన్సర్‍ చేశారని, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మాస్క్లను పంపిణీ చేశామని చెప్పారు. మరిన్ని చోట్ల కూడా పంపిణీ చేయనున్నామని తెలిపారు. హైదరాబాద్‍లో తొలుత మాస్క్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, ఇతరులకు ఈ మాస్క్లను పంపిణీ చేశారు. మామూలు బట్టలులాగా ఈ మాస్క్లను కూడా ఉతికి మళ్ళీ మళ్ళీ వాడవచ్చని తానా ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు తెలిపారు. రాజమండ్రి, గుడివాడ, కృష్ణాజిల్లాలో మాస్క్లను తానా ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఇలాగే మరిన్ని చోట్ల కూడా మాస్క్లను పంపిణీ చేస్తున్నట్లు నిరంజన్‍ శృంగవరపు తెలిపారు.

అమెరికా తెలుగు సంఘం (ఆటా)

అమెరికాలో ప్రాచీన సంఘాల్లో ఒకటైన అమెరికా తెలుగు సంఘం (ఆటా) కరోనా సంక్షోభంలో తెలుగువారిని ఆదుకునేందుకు అవసరమైన అన్నీ చర్యలను తీసుకుంటోంది. ఆటా అధ్యక్షులు పరమేష్‍ భీంరెడ్డి మాట్లాడుతూ, వెబ్‍ సదస్సుల ద్వారా అవగాహన కల్పించాము. డాక్టర్లతో సలహాలు, సూచనలు ఇప్పించాము. ఇమ్మిగ్రేషన్‍ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అటార్నీతో మాట్లాడించి సందేహాలను నివృత్తి చేశాము. కరోనా వల్ల చాలాచోట్ల లాక్‍డౌన్‍ కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో అన్‍ ఎంప్లాయ్‍మెంట్‍పై, ఫెడరల్‍ గవర్నమెంట్‍ ఇచ్చిన సహాయం, ట్రావెల్‍ వీసా ఇతర విషయాలపై సభ్యులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాము. ప్రస్తుతం మేము అమెరికాలోని తెలుగు కమ్యూనిటికీ ఏ విధంగా సహాయపడాలనే విషయంగానే చర్యలు తీసుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాల్లో గత డిసెంబర్‍లో ఆటా డేస్‍లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మేము తెలుగు కుటుంబాలకు అవసరమైన గ్రాసరీస్‍ అందించడం, పెద్దలకు, వృద్ధులకు మెడిసిన్స్ అందించడం, విజిటింగ్‍ పేరెంట్స్కి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాము.

విజిటర్స్ వీసా మీద ఇక్కడ ఉన్న తమ పిల్లలకు సహాయంగా తల్లితండ్రులు, అత్తమామలు వస్తుంటారు. వారు ఇక్కడ  ఆరునెలలు లేదా తాము అనుకున్న సమయం వరకు గడిపి ఇండియాకు వెళుతుంటారు. తాము ఉండే కాలానికి తగ్గట్టుగా  షుగర్‍మందులు, బిపి మందులు ఇతర మందులను వారు భారత్‍ నుంచి తమతో తెచ్చుకుంటారు. కాని ఇప్పుడు కరోనా వైరస్‍ అమెరికాను అష్టదిగ్బంధనం చేయడంతో వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. లాక్‍డౌన్‍తో వారు ఇండియాకు వెళ్ళలేని పరిస్థితి. అమెరికాలో ఉందామంటే తెచ్చుకున్న మందులు అయిపోయింది. ఈ నేపథ్యంలో మందులకోసం వారు పడుతున్న కష్టాలు చెప్పనలవి కావు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించేందుకు ఆటా ప్రాధాన్యత ఇస్తోంది. ఆటాలో ఉన్న డాక్టర్ల ద్వారా వారికి కావాల్సిన మందులు దొరికేలా చేయడానికి కృషి చేస్తున్నాము. కరోనా కాలంలో అందరూ జాగ్రత్తగా ఉండటమే మంచిది.

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా)

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) కూడా వైరస్‍ సంక్షోభ సమయంలో కమ్యూనిటీని ఆదుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఆదుకుంటూనే మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని బాధితులకోసం ముఖ్యమంత్రుల సహాయనిధికి 20 లక్షల రూపాయలను ఇచ్చింది. నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల మాట్లాడుతూ, తాను డాక్టర్‍గా ఈ సమయంలో ఇచ్చే సలహా ఏమిటంటే ఈ వైరస్‍కు మెడిసిన్‍ కనుగొనేంతవరకు అన్నీరకాల ట్రీట్‍మెంట్స్ చేసుకుంటూ వెళ్ళడం తప్ప ఏమీ చేయలేము. ఈ కరోవ వైరస్‍ ఒక్కొక్కరికి 2 రోజులు రావచ్చు. ఒక్కొక్కరికీ 14 రోజులకు కూడా రాకపోవచ్చు. కొంతమందికి మామూలు ట్రీట్‍మెంట్‍తోనే తగ్గిపోవచ్చు. మరికొంతమందికి వెంటిలేటర్‍ చికిత్సకు కూడా అందించాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు.

జ్వరం వచ్చినప్పుడు మామూలు మందులతో తగ్గించవచ్చు. గొంతు మంట ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. శ్వాస ఇబ్బందులు తలెత్తితే దానికి తగ్గట్టుగా మందులు, చివరికి వెంటిలేటర్‍గా కూడా పెట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది. జ్వరం న్యుమోనియా అయితే అందుకు తగ్గట్టుగా వైద్యం చేయాల్సి ఉంటుందని రాఘవరెడ్డి గోసల అన్నారు.

నాటా కూడా తనవంతుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా కరోనా వ్యాధి నివారణ విషయంలో సహాయపడుతోందని చెప్పారు. దాదాపు 20,000 మాస్క్లను రాష్ట్రాల్లోని తెలుగువారికి అందిస్తున్నామని, ఇప్పటికే దాదాపు 8,000 మాస్క్లను ఇచ్చామని చెప్పారు. అమెరికాలో కూడా చాలాచోట్ల మాస్క్లను పంపిణీ చేస్తున్నట్లు రాఘవరెడ్డి గోసల తెలిపారు.

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్)

నాట్స్ కూడా కరోనా సంక్షోభ సమయంలో తెలుగువారికి సహాయపడేందుకు ముందుకు వచ్చింది. డాక్టర్ల బృందంతో వెబినార్‍ నిర్వహించి కరోనాకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసింది. అపోహలను తొలగించింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందరికీ విశదీకరించింది. నాట్స్ చైర్మన్‍ శ్రీధర్‍ అప్పసాని మాట్లాడుతూ, ఇది చాలా క్లిష్ట సమయమని, అందరూ సమన్వయంతో ఉండాలని అందరికీ నాట్స్ అండగా ఉంటుందని హామి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా నాట్స్ తరపున సహాయం అందిస్తున్నామని, పలు చోట్ల నిత్యావసర సరకులను, మాస్క్లను పంపిణీ చేశామన్నారు.

ఉమెన్‍ ఎంపవర్‍మెంట్‍ తెలుగు అసోసియేషన్‍ (వేటా)

అమెరికాలో మహిళలకోసం, మహిళల ఉన్నతికోసం ఏర్పడిన సంస్థ ఇది. కరోనా కష్టకాలంలో తనవంతుగా అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వేటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సహాయ సహకారాలను అందజేస్తున్నారు. వేటా తరపున, ఝాన్సీరెడ్డి ఫౌండేషన్‍ తరపున ఆమె పలు కార్యక్రమాలను చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్‍ జిల్లా  తొర్రూరులో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు వేటా,హనుమాండ్ల రాజేందర్‍ రెడ్డి-ఝాన్సీ రెడ్డి ఫౌండేషన్‍ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందించారు. దాదాపు 350 మంది వలస కూలీలకు 15 రోజులకు సరిపడా రూ.3.50  లక్షల విలువైన ఆహార కిట్లను అందజేశారు.

 


                    Advertise with us !!!