కరోనా కట్టడికి అది ఒకటే మార్గం... హార్వర్డ్ శాస్త్రవేత్తల మాట

social distancing to slow the spread of coronavirus

ఒకేసారి లాక్‍డౌన్‍ అమలు చేయడం ద్వారా మహమ్మారి కరోనా వైరస్‍(కోవిడ్‍-19) వ్యాప్తిని కట్టడి చేయలేమని హార్వర్డ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2022 వరకు భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపడితేనే ప్రాణాంతక వైరస్‍ నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారాస్థాయి (25 వేలు దాటింది)కి చేరడం సహా లక్షలాది మంది వైరస్‍ బారిన పడుతున్న నేపథ్యంలో మహమ్మారి ప్రభావంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. జలుబు మాదిరి కోవిడ్‍-19 సీజనల్‍ వ్యాధిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ దీని ప్రభావం తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. ఇక సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం సరైన చర్యే అయినప్పటికీ.. తరచుగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భౌతిక దూరం వల్ల రోగనిరోధక శక్తి పెరగదని.. దీని ద్వారా వైరస్‍ వ్యాప్తిని మాత్రం నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా  కరోనాను అంతం చేసే అంతిమ ఆయుధం వ్యాక్సిన్‍నే అని.. అయితే దానిని తయారు చేసేందుకు మరికొంత ఎక్కువ సమయం పట్టవచ్చని అంచనా వేశారు.

అదే విధంగా రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు కరోనాను జయిస్తున్నారని.. అయితే ఏడాది పాటు వారు తరచుగా కరోనా పరీక్షలు నిర్వహించుకుంటే దీని నుంచి పూర్తిస్థాయిలో విముక్తి పొందినట్లు భావించవచ్చన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందని.. కరోనా నుంచి కోలుకున్న వారు మళ్లీ ఆస్పత్రిలో చేరుతున్న ఉదంతాలు ఇందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి తరుణంలో లాక్‍డౌన్‍ నిబంధనలు మరింత కఠినతరం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.