
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు దేశ ప్రజలప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి తదుపరి 3-4 వారాలు చాలా కీలకమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం దృష్టి ‘జాన్ హైతో జహాన్ హై’ నుంచి ‘జాన్ బీ ఔర్ జహాన్ బీ’ పైకి మళ్లిందని ప్రకటించడం ఆకర్షించింది. ‘ప్రాణముంటే ప్రగతి అదే ఉంటుంది’ నుంచి ‘ప్రాణం ఉండాలి. ప్రగతీ ఉండాలి’ అన్నది ఆయన ప్రాస వ్యాక్యానికి అర్థం.
బ్రతికుంటేనే ప్రపంచాన్ని చూడగలమని ఆయన పేర్కొన్నారు. ఇటు ప్రజల ప్రాణాలను, అటు దేశాన్ని ద•ష్టిలో పెట్టుకుని ప్రస్తుతం తమ గురుతర బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ రెండింటిని ప్రధాన సూత్రాలుగా తీసుకొనే ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘మొదటిసారిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో ప్రతి పౌరుడూ బతికి బట్టకట్టాలంటే లాక్డౌన్తో పాటు సామాజిక దూరాన్ని కూడా కచ్చితంగా పాటించాలని నేను విజ్ఞప్తి చేశా. దేశంలోని ప్రజలు నా విజ్ఞప్తిని అర్థం చేసుకొని తమ తమ ఇళ్లలోనే ఉంటూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.’’ అని మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అన్నారు. మార్చి 24 నాటి తన ప్రసంగంలో జాన్ హైతో జహా (బతికుంటే.ప్రపంచాన్ని చూడవచ్చు) చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ...ఇపుడు జాన్ బీ, జహాన్ బీ (జీవితాలు, ప్రపంచం) రెండూ ముఖ్యమైనవే అన్నారు. అటు ప్రాణాలు, ఇటు ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలని మోదీ చెప్పారు. ప్రాణాంతక వైరస్ నుంచి ఇటు ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూనే అటు ఆర్థికవ•ద్దిని ద•ష్టిలో పెట్టుకుని గురుతర బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
‘మనం ఉంటేనే ప్రపంచం... అన్నది నిన్నటి మంత్రం, మనము ఉండాలి, ప్రపంచం ఉండాలి... అనేది నేటి మంత్రం. ఇప్పటిదాకా తీసుకున్న చర్యల సత్ఫలితాలు కనిపించాలంటే, మరో మూడు నాలుగు వారాలు చాలా ముఖ్యం. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి అందేలా మార్కెటింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఆరోగ్య సేతు యాప్ ఇకనుంచి ట్రావెల్ ఈ పాస్ లాగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిపైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశంలో సరిపోయినన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి’ అని ప్రధాని ముఖ్యమంత్రులతో స్పష్టం చేశారు.