మందులు దొరక్క ఎన్నారైల ఇక్కట్లు

Problems of Health Care in the United States

అమెరికాలో ఎన్నారైలు ఎప్పుడూ ఎదురుచూడని సంక్లిష్ట స్థితిని నేడు ఎదుర్కొంటున్నారు. ఇనాళ్ళు అమెరికాయే స్వర్గం అన్నట్లుగా భావించిన ఎన్నారైలు కరోనా తీవ్రతతో పడరాని కష్టాలు పడుతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. ఓవేళ బయటవెళితో కరోనా బారిన పడి ప్రాణాలు పోతాయేమోనన్న భయం వారిలో కనిపిస్తోంది. అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న ఎన్నారైలు ఎంతోమంది 35-45 ఏళ్ళ వయస్సులో ఉన్నవారే. ఒకరిద్దరు పిల్లలతో ఉన్నవాళ్ళు. దాంతో వారు తమకు తోడుగా తల్లితండ్రులను, అత్తమామలను అమెరికాకు పిలిపించుకోవడం మామూలే. విజిటర్స్ వీసా మీద వారు వచ్చి ఆరునెలలు తమ పిల్లలకు సహాయంగా ఉంటూ ఇండియాకు వెళుతుంటారు. తాము ఉండే కాలానికి తగ్గట్టుగా షుగర్‍మందులు, బిపి మందులు ఇతర మందులను వారు భారత్‍ నుంచి తమతో తెచ్చుకుంటారు. కాని ఇప్పుడు కరోనా వైరస్‍ అమెరికాను అష్టదిగ్బంధనం చేయడంతో వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. లాక్‍డౌన్‍తో వారు ఇండియాకు వెళ్ళలేని పరిస్థితి. అమెరికాలో ఉందామంటే తెచ్చుకున్న మందులు అయిపోయిన నేపథ్యంలో మందులకోసం వారు పడుతున్న కష్టాలు చెప్పనలవి కావు.

టెక్సాస్‍, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సి, వాషింగ్టన్‍ డీసి తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే తెలుగువాళ్ళు ఉన్నారు. చాలామంది మధ్యవయస్సువారే కావడంతో తోడుగా తమతోపాటు తల్లితండ్రులనో, అత్తమామలనే తీసుకువచ్చుకున్నారు. కరోనా వైరస్‍ విజృంభణతో ఎంతోమంది మరణిస్తుండటంతో అమెరికాలోని పలు రాష్ట్రాలు లాక్‍డౌన్‍ విధించాయి. లాక్‍డౌన్‍ కారణంగా ఇండియా వెళ్ళాల్సిన తల్లితండ్రులు, అత్తమామల ప్రయాణాలు వాయిదా పడ్డాయి. దాంతో వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాము ఉండాల్సిన కాలానికి తెచ్చుకున్న బిపి, షుగర్‍, ఇతర మందులు అయిపోవడంతో ఆ మందులకోసం వారు పడరాని కష్టాలు పడుతున్నారు. మామూలు సమయాల్లో ఇలాంటివారు ఇండియా నుంచి వచ్చేవారితో, లేదా తెలిసినవారి ద్వారా ఇండియానుంచి మందులను తెప్పించుకుంటారు. కాని లాక్‍డౌన్‍ వేళలో ఇండియా నుంచి మందులు వచ్చే పరిస్థితి లేదు.

అమెరికాలోనే మందులు కొందామంటే తమ వల్ల కావడం లేదని పలువురు తల్లితండ్రులు, అత్తమామలు వాపోతున్నారు. ఎందుకంటే భారతదేశంలో లాగా వీధి చివర ఉన్న మందుల షాపుకు వెళ్ళి తమకు ఫలానా మందులు కావాలని అని చెప్పి తీసుకుని వచ్చేంత ఈజీగా అమెరికాలో మందుల షాపు వాళ్ళు మందులు ఇవ్వరు. దానికి చాలా ప్రొసీజర్‍ ఉంటుంది. పేషంట్‍కు ఫలానా మందులు ఇవ్వాలని డాక్టర్‍ ఇచ్చే ప్రిస్కిప్షన్‍తోపాటు, వాళ్ళు ఎంక్వైరీలు చేసిన తరువాతనే మందులను ఇస్తారు. దానికితోడు అమెరికాలో మెడిసిన్స్ పూర్తిగా ఇన్‍స్యూరెన్స్ కంపెనీల ద్వారా ఇస్తారు. డాక్టర్లు రోగుల మధ్య ఇన్‍స్యూరెన్స్ కంపెనీలు, ఫార్మసీ కంపెనీలు ఉంటాయి. ఎవరైనా ఫార్మసీ షాప్‍కు వెళ్ళి తమ డాక్టర్‍ ఇచ్చిన చీటి చూపగానే వాళ్ళు డాక్టర్‍ ఎవరో నిర్దారించుకుని ఎన్‍పిఐ (నేషనల్‍ ప్రొవైడర్‍ ఐడెంటిఫికేషన్‍) నెంబర్‍ అడుగుతారు. అలాగే DEA (Drug Enforcement Agency) నెంబర్‍ అడుగుతారు. ఇప్పుడు తెలుగువారికి సహాయం చేయడంకోసం ముందుకు వచ్చిన డాక్టర్లు కూడా ఒక్కో ఫార్మసిస్ట్ తో మాట్లాడి, ఒక్కో కేసు విశదీకరించేందుకు సమయం చాలడం లేదు. దానికితోడు ఆ ఫార్మసిస్ట్ ను ఒక్కో కేసుకు సంబంధించి కన్విన్స్ చేయడం కుదరడం లేదు. దాంతో చాలామంది డాక్టర్లు వెనక్కి వెళ్ళిపోయారు.

ఈ నేపథ్యంలో వారు తాము పడుతున్న కష్టాలను తమకు తెలిసినవారి ద్వారా కొంతమంది డాక్టర్లకు వివరించారు. వారు ఈ కేసులను ఒక్కొక్కటి పరిశీలించి వారు వేసుకునే మాత్రలకు సరిపోయేలా అమెరికాలో దొరికే మాత్రలను ఇద్దామనే ప్రయత్నం చేశారు. కాని కొన్ని ప్రొసీజర్స్ వల్ల ఈ విషయంలో తాము ఇప్పుడేమి చేయలేమని ముందుకు వచ్చిన డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో తమ సమస్యలను కొందరు తెలుగు సంఘాల దృష్టికి, న్యూయార్క్ లోని ఎంబసీ దృష్టికి తీసుకెళ్ళారు. ఎంబసీ అధికారులు ఈ విషయంలో తామేమి చేయలేమని తేల్చేశారు. ఈ విషయం పై శాండియాగో పట్టణం లో వున్న హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పాలకోడేటి ప్రభాకర్, ఉష దంపతులు మాట్లాడుతూ తాము తమ కుమార్తె స్వాతి దగ్గరకు వచ్చామని, తిరుగు ప్రయాణం అనుకున్నట్టుగా ఏప్రిల్ నెలలో వేళ్ళ లేమని, తమ మందులు అయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

డల్లాస్ నగరం లో తెలుగు వారికి సుపరిచితులైన డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ మాట్లాడుతూ తాను వ్యక్తిగతం గా అనేక సంవత్సరాల నుంచి తనకు తెలిసిన తెలుగు వారి తల్లి తండ్రుల మెడికల్ అవసరాలకు సహాయ పడుతూ ఉంటానని, ఇప్పుడు కరోనా నేపధ్యం లో ఈ సమస్య పెద్దది అయ్యింది అని, ప్రతి పట్టణం లో తనలాంటి డాక్టర్లు కలిసి కొంత వరకు సహాయం అందిస్తున్నారని తెలిపారు.

ఫిలడెల్ఫియా లో నివసిస్తున్న నాగరాజు నలజుల మాట్లాడుతూ చాలా మంది తెలుగు వారు తమ ఇంటిలో వున్న పెద్ద వారి మెడికల్ అవసరాలకు సహాయం కోసం వస్తున్నారని, మా పట్టణం లోనే వున్న డాక్టర్ ప్రమీల నాయుడు గారు వారికి సలహాలు ఇస్తున్నారని, ఆవసరం అయితే పేషెంట్ గా గుర్తించి వైద్య సదుపాయాలు కూడా చేస్తున్నారని తెలిపారు.

బే ఏరియా లో వున్న తానా ఉప కోశాధికారి శ్రీ వెంకట్ కోగంటి మాట్లాడుతూ అమెరికా లో వచ్చిన విజిటర్స్ తగిన ఇన్సురెన్సు కవరేజ్ లేకుండా మెడికల్ సౌలభ్యం పొందటం కష్టమే కాకుండా చట్ట రీత్యా తప్పు కూడా కనుక తెలుగు వారు ఈ సమస్య ను సున్నితం గా పరిష్కరించు కోవాలి అన్నారు. ఈ విషయమై అమెరికాలో జాతీయ తెలుగు సంఘాలలో ఒకటైన ఆటా (అమెరికన్‍ తెలుగు అసోసియేషన్‍) కొంత చొరవ తీసుకుని వారికి సహాయపడేందుకు ముందుకు వచ్చింది.

ఆటా అధ్యక్షుడు పరమేష్‍ భీంరెడ్డి మాట్లాడుతూ, ఈ విషయమై తాము చేస్తున్న కార్యక్రమాన్ని వివరించారు. ఒకట్రెండురోజుల్లో ఒక డాక్టర్‍ ప్యానెల్‍ ఏర్పాటు చేసి వారి దగ్గరకు తెలుగు తల్లితండ్రులు ఇ-మెయిల్‍ ద్వారా సంప్రదించే ఏర్పాటు చేస్తామని, అప్పుడు ఆ డాక్టర్లు కూడా వారి ఫ్రీ టైమ్‍లో వారికి వచ్చిన ఇ-మెయిల్‍ చూసి ఆ పిస్క్రిప్షన్‍ లో ఉన్న మందులను గుర్తించి వారికి ఇ-మెయిల్‍ ద్వారా జవాబు ఇస్తారని చెప్పారు. అప్పుడు ఎవరికి వారు తమ దగ్గరలో ఉన్న ఫార్మసిస్ట్ దగ్గరకు వెళ్లి ఆ మందులు కొనుక్కొని వారి తల్లితండ్రులు, అత్తమామలను వీలున్నంతవరకు అటెండ్‍ అవవచ్చని పరమేష్‍ భీంరెడ్డి తెలిపారు.

ఏదీఏమైనా మందులు సమయానికి వేసుకోకపోతే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కరోనా కాలం...వారికి మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఈ విషయంలో అమెరికాలోని భారత సంతతి ప్రముఖులు కూడా చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

చెన్నూరి వేంకట సుబ్బా రావు 

(ఈ ఆర్టికల్‍ సాక్షి దిన పత్రికలో శనివారం 11వ తేదీన ప్రచురితమైంది)


                    Advertise with us !!!